ఉద్యోగం వద్దు.. ఆధ్యాత్మికతే జీవితం
ABN, Publish Date - Dec 18 , 2023 | 03:02 AM
పోలీస్ శాఖలో డీఎస్పీ.. అదీ పదిహేనేళ్ల కిందటే.. ఇప్పటికీ సర్వీసులో ఉండి ఉంటే ఆమె మరింత ఉన్నత ర్యాంకుకు చేరేవారే..! కానీ, ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యోగాన్ని తృణప్రాయంగా త్యజించారు.
ధర్మ ప్రచారానికి సాయం చేయండి
మీ ఆత్మీయత సాంత్వన కలిగించింది
మీలో స్పార్క్ ఉంది.. త్వరలో కలుస్తా
పదేళ్లు జీవచ్ఛవంలా బతికా
ఉద్యమ నేతలూ ఎగతాళి చేశారు
డిపార్ట్‌మెంట్‌లో హీనంగా చూశారు
నాలోని అధికారిని హత్య చేశారు
నాలా మరే అధికారీ ఇబ్బంది పడొద్దు
సీఎంకు మాజీ డీఎస్పీ నళిని లేఖ
భువనగిరి టౌన్, డిసెంబరు 17: పోలీస్ శాఖలో డీఎస్పీ.. అదీ పదిహేనేళ్ల కిందటే.. ఇప్పటికీ సర్వీసులో ఉండి ఉంటే ఆమె మరింత ఉన్నత ర్యాంకుకు చేరేవారే..! కానీ, ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యోగాన్ని తృణప్రాయంగా త్యజించారు. మధ్యలో రాజీనామాను వెనక్కుతీసుకున్నా.. కొద్ది నెలలకే కొలువును వీడి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. స్వరాష్ట్రం సిద్ధించినా పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఆమెకు న్యాయం జరగలేదనే విమర్శలు వచ్చాయి. ఇదంతా యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన దొమకొండ నళిని గురించి. తాజాగా నళిని గురించి సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. దీంతో సోషల్ మీడియాలో ఆమెకు ఊహించని మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలో నళిని సీఎం రేవంత్‌కు ఆదివారం ఫేస్‌బుక్ ద్వారా లేఖ రాశారు. ‘‘సాయం చేస్తానని ప్రకటించడం మీ గొప్పదనం. కానీ, ఇకమీదట ఆధ్యాత్మికతనే నా జీవిత లక్ష్యం. ఉద్యోగం చేసేందుకు సుముఖంగా లేను. త్వరలో మిమ్మల్ని కలుస్తా’’ అని పేర్కొన్నారు. డీఎస్పీగా ఎదుర్కొన్న ఇబ్బందులు, మానసిక వేధింపులను అందులో వివరించారు. తనను కానిస్టేబుల్ కంటే హీనంగా చూశారని, నిబద్ధురాలైన అధికారిని హత్య చేశారని పేర్కొన్నారు. అండగా నిలుస్తున్న తెలంగాణవాదులకు రుణపడి ఉంటానన్నారు. తనను తాను సనాతిని, యజ్ఞ బ్రహ్మ వేద ప్రచారకురాలిగా పేర్కొంటూ నళిని ప్రస్తుతం భువనగిరిలో ఆధ్యాత్మికవేత్తగా జీవనం సాగిస్తున్నారు. సీఎం రేవంత్‌కు ఆమె రాసిన లేఖ ఇలా.. ‘‘మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. మీ ఆత్మీయత నా హృదయానికి గొప్ప సాంత్వన ఇచ్చింది. ఈ నేపథ్యంలో గతం రీల్‌లా కళ్ల ముందు కదులుతోంది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు 2009 డిసెంబరు 9న నా రాజీనామా పెను సంచలనం రేకెత్తించింది. అదే రాత్రి చిదంబరం ప్రకటన ఉద్యమాన్ని చప్పున చల్లార్చింది. నాటి సీఎం రోశయ్య మహిళా దినోత్సవం కానుకగా ఉద్యోగాన్ని తిరిగిస్తున్నట్లు ప్రకటిస్తే తిరిగి డిపార్ట్‌మెంట్‌లో చేరాను. జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే. నన్ను అప్పటి ప్రభుత్వం మూడేళ్లు ఇబ్బంది పెట్టింది. ఇన్నాళ్లూ సస్పెండెడ్ ఆఫీసర్‌గా అపవాదు మోశాను.
ఏడాదిన్నర పాటు పద్మవ్యూహంలో..
ఉద్యోగంలో తిరిగి చేరాక 18 నెలలు పద్మవ్యూహంలో చిక్కుకున్నా. నాడు ఎదుర్కొన్న ఒత్తిడి, అవమానాలు నాకు బ్యూరోక్రసీపైనే నమ్మకం పోయేలా చేశాయి. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌లో పోస్టింగ్‌తో చార్జ్ మెమోలు ఇచ్చి వివరణలు రాయమన్నారు. వార్షిక రహస్య నివేదికల్లో చెడుగా రాశారు. బ్యాచ్‌లో నా ఒక్కదానికి ప్రమోషన్ ఆపేశారు. ప్రొబేషన్ పొడిగించారు. ఒంటరిని చేశారు. ఇవన్నీ అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి మొరపెట్టుకొనేలా చేశాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన అపాయింట్‌మెంట్ దొరకలేదు. ఉద్యమ నాయకులను సంప్రదిస్తే సాయం చేయకపోగా ఎగతాళి చేశారు. సోనియాగాంధీ, సుష్మా స్వరాజ్‌కు లేఖలు రాసి నా పరిస్థితిని, రాష్ట్ర దుస్థితిని వివరించా. ఉద్యమంలో పాల్గొనడం అనివార్యం అనిపించి 2011 నవంబరు 1న రాజీనామా ఇచ్చేసి ప్రజల్లోకి వెళ్లాను. ప్రభుత్వం నన్ను సస్పెండ్ చేసింది. దేశ ద్రోహం వంటి తీవ్ర ఆరోపణలు మోపింది. అన్ని పత్రికల్లో నా ఫొటోలు వేసి హైలైట్ చేశారు. ఆనాడే నాలోని ఒక డైనమిక్, కమిటెడ్ ఆఫీసర్‌ను హత్య చేశారు. డిపార్ట్‌మెంట్ పట్ల ఏహ్యభావం కలిగింది.
తుపాకీ స్థానంలో వేదం..
నా ప్రస్థానం చాలా సంఘర్షణమయం. వేదనాభరితం. మీరు భావిస్తున్నట్లు పోలీస్ కాకుండా వేరే ఉద్యోగం చేయలేను. పరమేశ్వరుడు నన్ను క్రిమినాలజీ నుంచి ఫిలాసఫీ వైపు నడిపించాడు. తుపాకీ స్థానంలో వేదం పట్టించాడు. నా వాణిలో మాధుర్యం నింపి ఆచార్యను చేశాడు. నా అమూల్య సమయాన్ని బ్యూరోక్రసీకి వెచ్చించలేను. శ్రేయో మార్గం విడిచి మళ్లీ ప్రేయో మార్గం వైపు రాలేను. అన్ని దానాల్లో గొప్పదైన విద్యాదానాన్ని చేస్తూ, పుణ్యం మూటకట్టుకోవాలనే కోరిక తప్ప నాకు ఇంకేమీ లేదు. నన్ను ఈ ఉద్యోగం నుంచి ఎవరూ సస్పెండ్ చేయలేరు. రాజీనామా చేయాల్సిన పరిస్థితులు కలగవు. అంతిమంగా నేను మిమ్మల్ని కోరేది ఏమిటంటే నాపై కరుణ చూపి యథాతథ స్థితికి అనుమతించండి. డిపార్ట్‌మెంట్‌లో నాలాగా ఇంకే అధికారీ ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోండి. మీలో మంచి స్పార్క్ ఉంది. మీ నుంచి చక్కని పాలన ఆశించవచ్చు అనిపిస్తోంది. నాకు మీరు న్యాయం చేయాలి అనుకుంటే ఉద్యోగం బదులుగా నా ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సాయం చేస్తే స్వీకరిస్తాను. మీరు ఇచ్చే ఫండ్‌ను వేద, యజ్ఞ, సంస్కృత సంబంధ ధార్మిక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్తాను. ప్రస్తుతం సనాతన ధర్మానికి మూలాలైన ‘వేదం యజ్ఞం’ అనే పుస్తకాన్ని తెలుగు, హిందీల్లో రాస్తున్నాను. హిందీ ప్రూఫ్ చూసే పనిలో బిజీగా ఉన్నాను. మహర్షి 200వ జయంతి వరకు అది సిద్ధం కావాలి. సమయం ఎక్కువగా లేదు. అది అయిపోగానే వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఈలోగా మీడియా మిత్రులు నా ప్రతిస్పందన తెలుసుకోవాలి అని ఇంటర్వ్యూలు అడుగుతున్నారు. అందుకే ఇలా లేఖ రాస్తున్నాను.
సంఘర్షణ తెలుసుకునే సందర్భం సృష్టించారు
ఇన్నాళ్లకు నా పోరాటాన్ని, సంఘర్షణను జనం తెలుసుకొనే సందర్భం సృష్టించిన మీకు కృతజ్ఞతలు. 12 ఏళ్ల తర్వాత మీరు నా కేసులో కారణం తెలుసుకోవాలనుకోవడం చాలా చాలా సంతోషం. తెలంగాణ ఉద్యమంలో బతికి బయటపడి సర్వం కోల్పోయిన వాళ్లలో నేను ముందువరుసలో ఉన్నానన్న విషయం మీ ద్వారా ప్రజలకు అర్థమైంది. ఉద్యమంలో కీలక పాత్ర నన్ను ప్రజలకు దగ్గర చేసింది. కానీ బంధుమిత్ర పరివారం వెలివేశారు. 10 ఏళ్లు ఏకాంత కారాగారం అనే శిక్షను అనుభవించా. 10 జన్మలకు సరిపడా కష్టాలుపడ్డాను. ఇల్లు, కుటుంబం, ఆరోగ్యం, మనశ్శాంతి కోల్పోయాను. జీవచ్ఛవంలా బతికాను. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని నా జీవితంలో రుజువైంది. సందప కూడబెట్టాలనే (విత్తైషణ) కోరిక, పేరుతెచ్చుకోవాలనే (లోకైషన) కాంక్ష పోయాయి. రెండేళ్ల క్రితం నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించారు. వేదమాత, యజ్ఞ దేవతలు నాలో తిరిగి ప్రాణం పోశారు. అందుకే జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నాను. ఇంకా ఎవరికి కోసం త్యాగం చేయలేను. జన్మరాహిత్యం కోసం అష్టాంగ యోగా మార్గంలో నడుస్తున్నాను. వేద ప్రచారకురాలిగా వైదిక యజ్ఞ బ్రహ్మగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే నా కర్తవ్యం. దీనివల్ల నా ఆత్మ ఉన్నతితో పాటు, సమాజ ఉన్నతికి పాటు పడొచ్చు. కాబట్టి నా పంథా మార్చుకోలేను.
Updated Date - Dec 18 , 2023 | 03:02 AM