గ్రామీణ భారతంలో దళితులపై వివక్ష
ABN, Publish Date - Dec 30 , 2023 | 03:47 AM
దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో దళితులపై ఇప్పటికీ వివక్ష కొనసాగుతోందని న్యూఢిల్లీ జేఎన్‌యూ ప్రొఫెసర్లు చిన్నారావు, చిట్టిబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
జేఎన్‌యూ ప్రొఫెసర్లు చిన్నారావు, చిట్టిబాబు
కేయూలో రెండో రోజూ కొనసాగిన ఐహెచ్‌సీ సదస్సు
కేయూ క్యాంపస్, డిసెంబరు 29: దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో దళితులపై ఇప్పటికీ వివక్ష కొనసాగుతోందని న్యూఢిల్లీ జేఎన్‌యూ ప్రొఫెసర్లు చిన్నారావు, చిట్టిబాబు ఆందోళన వ్యక్తం చేశారు. కాకతీయ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న 82వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సదస్సులో భాగంగా శుక్రవారం తొలుత ‘రూట్స్ ఆఫ్ ఇండియన్ సస్ట్రెనబులిటీ లేబర్’’అనే అంశంపై ప్యానల్ సమావేశం జరిగింది. ఈ సెషన్‌లో 22 మంది పరిశోధన పత్రాలను సమర్పించారు. ప్యానలిస్టులుగా వ్యవహరించిన చిన్నారావు, చిట్టిబాబు మాట్లాడుతూ ఇప్పటి వరకు దళిత చరిత్రను నిర్లక్ష్యం చేశారని చెప్పారు. 2016వ సంవత్సరం నుంచి దళిత వర్గాలపై చరిత్రకారులు పరిశోధనలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రెండో సెషన్‌లో ‘అలీఘర్ హిస్టోరియన్ సొసైటీ’ ఆధ్వర్యంలో ‘రీస్ట్రక్చర్ ఇండియన్ ఎకానమీ థియరీ’ అంశంపై 10 మంది పరిశోధన పత్రాలు సమర్పించారు. మూడో సెషన్‌లో ‘దక్కన్ పాస్ట్ అండ్’ ప్రజెంట్ అనే అంశాన్ని ప్రత్యేకంగా గుర్తించి చర్చకు స్వీకరించారు. దీనిలో దక్షిణ భారతదేశ సంస్కృతి, సంప్రదాయాల్లో చోటుచేసుకున్న మార్పులపై 12 పరిశోధన పత్రాలను పరిశోధకులు సమర్పించారు. ఐహెచ్‌సీ 82వ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం శుక్రవారం కేయూ ఆడిటోరియంలో జరిగింది. ఐహెచ్‌సీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపికైన ప్రొఫెసర్ ఆదిత్య చటర్జీకి అధికారికంగా బాధ్యతలు అప్పగించారు. సదస్సులో భాగంగా శనివారం అలీఘర్ హిస్టోరియన్ సోసైటీ ప్యానల్, ఐహెచ్‌సీ దక్కన్, దళిత్ హిస్టరీ ప్యానల్స్ టెక్నికల్ సెషన్స్ జరుగుతాయి. సాయంత్రం ముగింపు సదస్సు జరుగుతుందని ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ కార్యదర్శి తాళ్లపల్లి మనోహర్ తెలిపారు.
Updated Date - Dec 30 , 2023 | 07:30 AM