సోషల్ వెల్ఫేర్ గురుకుల కళాశాలలో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
ABN, Publish Date - Dec 22 , 2023 | 04:12 AM
అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ రూరల్ మండలం నగునూర్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో చోటుచేసుకుంది.
ప్రిన్సిపాల్, లెక్చరర్లపై అనుమానాలున్నాయంటూ మృతురాలి తండ్రి ఫిర్యాదు
కరీంనగర్ జిల్లాలో ఘటన
కరీంనగర్ క్రైం, డిసెంబరు 21: అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ రూరల్ మండలం నగునూర్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో చోటుచేసుకుంది. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న మార సృజన(18) బుధవారం అర్ధరాత్రి కళాశాలలోని తరగతి గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె మృతి పట్ల అనుమానాలున్నాయని మృతురాలి తండ్రి లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం 6.48 గంటలకు కళాశాల నుంచి ఒక లెక్చరర్ ఫోన్ చేసి సృజన ఆరోగ్యం బాగోలేదని చెప్పారని, కొద్దిసేపటికి పోలీసులు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుందని చెప్పారని ఆయన తెలిపారు. వెంటనే తాము కళాశాలకు వెళ్లేసరికి తరగతి గదిలో సృజన కింద పడి ఉండగా ఫ్యాన్‌కు చున్నీ కట్టి ఉందన్నారు. బుధవారం రాత్రి హాస్టల్ గదిలో తోటి విద్యార్థులతో కలిసి ఉన్న సృజన గురువారం ఉదయం వరకు ఉరికి వేలాడుతూ కనిపించడం అనుమానాలకు తావిస్తోంది. బీఎస్సీ (ఎంజడ్‌సీ) మొదటి సంవత్సరం చదువుతున్న సృజనది జిల్లాలోని మానకొండూర్ మండలం గంగిపల్లి. ఆమె ఆత్మహత్య నేపథ్యంలో కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్లు, పీఈటీలతో పాటు సృజన స్నేహితురాళ్లు ఇద్దరిపై అనుమానం ఉందని లక్ష్మీనారాయణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ప్రదీ్‌పకుమార్ తెలిపారు. సృజన ఆత్మహత్యకు కారణమైన కళాశాల ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాలు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద ఆందోళన చేపట్టాయి.
Updated Date - Dec 22 , 2023 | 04:12 AM