ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అప్పుల దారి క్లోజ్‌?

ABN, Publish Date - Dec 29 , 2023 | 03:11 AM

‘‘లంకె బిందెలు ఉన్నాయేమోనని వస్తే ఖాళీ కుండలు కనిపించాయి’’ ఇది..

బహిరంగ రుణాలు కష్టమే

3 నెలలు ముందే బడ్జెట్‌ ప్రతిపాదిత అప్పులు పూర్తి

బడ్జెట్‌లో రూ.40,615 కోట్ల మేర రుణ ప్రతిపాదన

డిసెంబరు నాటికే 39,551 కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్రం

‘కాగ్‌’ తాజా నివేదికలో వెల్లడి

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ షెడ్యూలు ప్రకారమే రుణాలు క్లోజ్‌?

కొత్త ప్రభుత్వానికి కష్టకాలమే!

హైదరాబాద్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘లంకె బిందెలు ఉన్నాయేమోనని వస్తే ఖాళీ కుండలు కనిపించాయి’’ ఇది.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం అన్నమాటలివి! ఆయన వ్యాఖ్యలకు తాజాగా విడుదలైన ‘కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)’ నివేదిక అద్దం పడుతోంది. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర ఆర్థిక స్థితిని విశ్లేషించుకుంటే ఉద్యోగుల వేతనాలు, సబ్సిడీలను పక్కన పెడితే ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలకు, ఆరు గ్యారెంటీలకు నిధుల సర్దుబాటు చేయడం కొత్త సర్కారుకు కష్టంగా మారనుందనేది అర్థమవుతోంది. సంక్షేమ పథకాల అమలు కోసం ఇప్పటికే అప్పుల మీద అప్పులు చేస్తుండటంతో నూతన ఆర్థిక సంవత్సరం మొదలయ్యేదాకా కొత్తగా అప్పులకు మార్గం దాదాపు ముగిసిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో మరో మూడు నెలలు మిగిలి ఉండగానే బడ్జెట్‌లో ప్రతిపాదిత అప్పులను గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే లాగేసింది. గత బడ్జెట్‌లో రూ.40,615 కోట్ల అప్పును ప్రతిపాదిస్తే.. ఇందులో డిసెంబరు నాటికే రూ.39,551 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంది. నవంబరు నెల దాకా రాష్ట్రం రూ.38,151 కోట్ల అప్పులు చేసిందని గురువారం విడుదల చేసిన నివేదికలో ‘కాగ్‌’ పేర్కొంది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం డిసెంబరు 12న రూ.500 కోట్లు, 19న మరో రూ.900 కోట్లతో కలిపి మొత్తంగా రూ.1400 కోట్ల రుణాన్ని తీసుకుంది. ఫలితంగా వచ్చే మూడు నెలల కాలానికి అప్పులు పుడతాయా? అన్న సందిగ్దత నెలకొన్నాయి. వచ్చే జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలను నెట్టుకురావడం కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పెద్ద సంకటంగా మారనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

2023-24 ఆర్థిక సంవత్సరంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.2,90,396 కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. ఇందులో బహిరంగ మార్కెట్‌ రుణాల కింద రూ.40,615 కోట్లు వస్తాయని ప్రతిపాదించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించిన అప్పులను ఒక్కో నెలలో ఎంత మొత్తమైనా తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ పద్ధతిన ఆర్థిక సంవత్సరంలోని 12 నెలల పాటు ఎంతో కొంత అప్పును తీసుకుంటూ మార్చి నెల నాటికల్లా లక్షిత రుణానికి చేరుకోవాలి. ఒక్కో నెలలో ప్రభుత్వానికి ఒక్కో రకమైన ఆర్థిక వనరుల ఆవశ్యకత ఏర్పడుతుంది. ఉదాహరణకు రైతుబంధుకు నిధులు సర్దాల్సి వస్తే జూలై, ఆగస్టు, డిసెంబరు, జనవరి నెలల్లో కాస్త ఎక్కువ అప్పును తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి కీలకమైన పథకాల కోసం నిధులను సమకూర్చుకోక తప్పదు. కానీ... గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందు జాగ్రత్తతో వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఎలాగూ నవంబరులో ఎన్నికలు వస్తాయన్న అంచనాతో గత ప్రభుత్వం... డిసెంబరు నాటికే మొత్తం బడ్జెట్‌ రుణాలను తీసేసుకోవాలని తలంచినట్లు అర్థమవుతోంది. ఈ మేరకు బడ్జెట్‌లో పొందుపర్చిన మార్కెట్‌ రుణాలు మొత్తం రూ.40,615 కోట్లలో నవంబరు నాటికే రూ.39,551 కోట్ల అప్పును తీసేసుకుంది. వీటిలో కొత్త ప్రభుత్వం వచ్చాక రూ.1400 కోట్లు తీసుకున్నా ఎన్నికలకు ముందుగానే నిర్ణయించిన రుణ షెడ్యూలు ప్రకారమే సేకరించినట్లు తెలిసింది.

రాబడులు 1.49 లక్షల కోట్లు

నవంబరు నాటికి రాష్ట్ర రాబడుల కింద రూ.1,49,316.41 కోట్లు సమకూరాయి. ఈమేరకు గురువారం విడుదల చేసిన నవంబరు నెల నివేదికలో ‘కాగ్‌’ పేర్కొంది. అంటే... అంచనా వేసిన మొత్తం రాబడుల్లో ఇది 57.46 శాతం. ఈసారి మూలధన, రెవెన్యూ రాబడుల కింద మొత్తం రూ.2,59,861.91 కోట్లు వస్తాయని అంచనా వేయగా నవంబరు నాటికి రూ.1,49,316.41 కోట్లు వచ్చినట్లు నివేదిక స్పష్టం చేసింది. మూలధన రాబడులు కాకుండా, కేవలం రెవెన్యూ రాబడుల కిందే రూ.2,16,566.97 కోట్లు వస్తాయని అంచనా వేయగా నవంబరు నాటికి రూ.1,11,141.37 కోట్లు(51.32ు) వచ్చాయి. ఇందులో జీఎ్‌సటీ కింద రూ.30,047.59 కోట్లు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల కింద రూ.9,354.84 కోట్లు, సేల్స్‌ ట్యాక్స్‌ కింద రూ.19,591.91 కోట్లు, రాష్ట్ర ఎక్సైజ్‌ సుంకాల కింద రూ.14,607.58 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.8,177.58 కోట్లు, వచ్చాయి. నవంబరు నాటికి రూ.1,44,034.48 కోట్లు వ్యయమైనట్లు నివేదిక వివరించింది. ఇందులో ప్రధానంగా పథకాల కోసం రూ.56,037కోట్లు, వడ్డీ చెల్లింపుల కో సం రూ.14,687కోట్లు, వేతనాల కోసం 26,548కోట్లు, పెన్షన్ల కోసం రూ.11,316కోట్లు, సబ్సిడీల కోసం రూ.6,156కోట్లు వ్యయమైనట్లు వివరించింది.

6 గ్యారెంటీలకు నిధులెలా?

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తులను స్వీకరించడానికి గురువారం ‘ప్రజాపాలన’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గురువారం ఒక్క రోజే పట్టణ స్థానిక సంస్థల్లోని ప్రజాపాలన కార్యక్రమం కింద 81,964 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల దరఖాస్తులే 79,110 ఉన్నాయని ప్రజాపాలన రాష్ట్ర నోడల్‌ అధికారి హరిచందన దాసరి ప్రకటించారు. అంటే... ఈ ఆరు గ్యారెంటీలపై ప్రజల్లో ఎంత ఆతృత, ఆకర్షణ ఉందో ఇట్టే అర్థమవుతోంది. అలాంటప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ గ్యారెంటీలను తప్పకుండా అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పైగా పార్లమెంటు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఇలాంటి సంకట పరిస్థితిలో ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేయాలన్నది ఇప్పుడు ప్రభుత్వాన్ని వేధిస్తున్న ప్రశ్న.

Updated Date - Dec 29 , 2023 | 03:12 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising