Revanth Reddy: స్విగ్గీబాయ్ కుటుంబానికి సీఎం సాయం
ABN, Publish Date - Dec 31 , 2023 | 04:24 AM
విధి నిర్వహణలో ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ ప్రాణాలు కోల్పోగా.. కష్టాల్లో ఉన్న అతని కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆర్థిక సాయం చేశారు.
రూ.2 లక్షల చెక్కు అందజేసిన రేవంత్
హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ ప్రాణాలు కోల్పోగా.. కష్టాల్లో ఉన్న అతని కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆర్థిక సాయం చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చెక్కును బాధిత కుటుంబానికి శనివారం సచివాలయంలో అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి డిసెంబరు 23న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో గిగ్ వర్కర్లతో(జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్, క్యాబ్ డ్రైవర్లు) సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయా కార్మికులతో మాట్లాడుతూ ఫుడ్ డెలివరీకి వెళ్లి నాలుగు నెలల క్రితం ప్రమాదంలో మరణించిన రిజ్వాన్ అనే స్విగ్గీ బాయ్ అంశాన్ని ప్రస్తావించారు. గత ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకుంటుందని ఆశించినా అది జరగలేదని పేర్కొన్నారు. ఆ కుటుంబానికి సాయం చేస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో సీఎం ఆదేశాల మేరకు అధికారులు బాధిత కుటుంబ వివరాలు సేకరించి సాయం అందేలా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న చొరవపై స్విగ్గీ బాయ్ కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.
Updated Date - Dec 31 , 2023 | 08:44 AM