మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి
ABN, First Publish Date - 2023-11-29T03:36:35+05:30
తెలంగాణలో మార్పు కావాలని, అందుకోసం కాంగ్రె్‌సను బలోపేతం చేయాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ కోరారు.
ఫాంహౌస్ పాలనకు స్వస్తి పలకాలి
బీజేపీ, బీఆర్‌ఎస్, మజ్లిస్‌లు ఒక్కటే
జహీరాబాద్‌లో ప్రియాంక గాంధీ
జహీరాబాద్, నవంబరు 28: తెలంగాణలో మార్పు కావాలని, అందుకోసం కాంగ్రె్‌సను బలోపేతం చేయాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ కోరారు. బీజేపీ, బీఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలు ఒక్కటై జనాన్ని మోసం చేస్తున్నాయని చెప్పారు. రైతులు, యువత బలిదానాల మీద ఏర్పడిన తెలంగాణలో వారి కలలు సాకారం కావాలంటే కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ కార్నర్ మీటింగ్‌లో ప్రియాంక మాట్లాడారు. ‘మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి.. బైబై కేసీఆర్’ అంటూ నినాదాలు చేయడంతో ప్రజలు కేరింతలు కొట్టారు. బీజేపీ, బీఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలు మూడూ ఒక్కటేనని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి సంగతి దేవుడెరుగు.. కేసీఆర్ కుటుంబానికి మాత్రం ఉద్యోగాలు దక్కాయన్నారు. కాంగ్రెస్ పాలిత ఛత్తీ్‌సగఢ్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలవుతున్నాయని తెలిపారు. తెలంగాణలో మాత్రం కేసీఆర్ ఫాంహౌస్ పాలన కొనసాగిస్తున్నారని, ఆ పాలనకు స్వస్తి పలికేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో బీజేపీ, తెలంగాణలో బీఆర్‌ఎస్ పాలనలో అవినీతి పెరిగిందని.. ఆ పార్టీల నేతలు ధనవంతులుగా మారారని ఆరోపించారు. ఆ సొమ్మంతా ప్రజలదేనని ప్రియాంక స్పష్టం చేశారు. ప్రజల సొమ్ము ప్రజలకే చేరాలంటే కాంగ్రె్‌సను గెలిపించాలన్నారు. దేశ సమైక్యత కోసం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ వ్యక్తి కాదని.. శక్తి అని చెప్పారు. జహీరాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తెలంగాణ అభివృద్ధిని తాము బాధ్యతగా తీసుకుంటామన్నారు. జహీరాబాద్ చక్కెర కర్మాగారం సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మల్కాజిగిరి రోడ్డు షోలో రాహుల్‌గాంధీతో కలిసి ప్రియాంక పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్‌ను ఫాంహౌ్‌సకు సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మీకు ప్రజల సర్కారు కావాలా? దొరల సర్కారు కావాలా? అని ప్రజల్ని ప్రశ్నించారు. ఇక కేసీఆర్‌కు బైబై చెబుతారా? అంటూ ప్రజలతోనే ‘కేసీఆర్ బైబై’ అని చెప్పించారు.
Updated Date - 2023-11-29T03:36:36+05:30 IST