బీఆర్‌ఎస్ స్వేదపత్రం
ABN, Publish Date - Dec 23 , 2023 | 03:07 AM
తెలంగాణలో గత తొమ్మిదిన్నరేళ్లలో సాధించిన అభివృద్ధి, సృష్టించిన సంపదను తెలిపేందుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటుచేసినట్టు బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు.
ప్రభుత్వ శ్వేతపత్రానికి పోటీగా నేడు విడుదల
తమ పాలనపై తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ప్రెజెంటేషన్
రాత్రింబవళ్లు చెమటోడ్చి తెలంగాణ ప్రతిష్ఠను నిర్మించాం
విఫల రాష్ట్రంగా చూపిస్తే సహించబోమని హెచ్చరిక
హైదరాబాద్, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో గత తొమ్మిదిన్నరేళ్లలో సాధించిన అభివృద్ధి, సృష్టించిన సంపదను తెలిపేందుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటుచేసినట్టు బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ భవన్ వేదికగా శనివారం ఉదయం 11 గంటలకు ‘స్వేద పత్రం’ విడుదల చేయనున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయమన్నారు. పగలు రాత్రి తేడాలేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్ఠను దెబ్బతీస్తే సహించబోమన్నారు. విఫల రాష్ట్రంగా చూపిస్తే భరించమని, అందుకే జరిగిన అభివృద్ధిని గణాంకాలతో సహా వివరించేందుకు తాను ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్టు కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం శ్వేతపత్రాల రూపంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వరుస నివేదికలు ఇవ్వగా, తమకు కూడా సభలో గణాంకాలు ప్రవేశపెట్టే అవకాశం ఇవ్వాలని బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు కోరారు. అందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే స్వేదపత్రం విడుదలకు కేటీఆర్ పూనుకున్నారు.
ఆటో డ్రైవర్ల సమస్యలపై అధ్యయనం
ఆటో డ్రైవర్ల సమస్యలపై విస్తృతంగా అధ్యయనం చేసేందుకు బీఆర్‌ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో కమిటీ వేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఆదేశాల మేరకు వారి సమస్యలు, పరిష్కార మార్గాలు తెలుసుకునేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్మిక నేతలు రూప్ సింగ్, రామ్ బాబు యాదవ్, మారయ్యలు ఆటో డ్రైవర్ల ప్రతినిధులతో మాట్లాడతారన్నారు. ఓలా, ఉబెర్, ఇతర ట్యాక్సీ డ్రైవర్లతోనూ చర్చించి నివేదిక రూపొందిస్తారని చెప్పారు. దాని ఆధారంగా ప్రభుత్వానికి సూచనలు ఇస్తామన్నారు.
ఎట్ హోమ్‌కు కేటీఆర్ డ్రైవింగ్‌లో హరీశ్
రాష్ట్రపతి ముర్ము ఇచ్చిన విందుకు బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణ భవన్ నుంచి వెళ్లారు. కేటీఆర్.. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డికి చెందిన కారును కేటీఆర్ స్వయంగా నడుపుతూ బొల్లారంలో రాష్ట్రపతి ఆతిథ్యం ఇచ్చే ఎట్ హోమ్ రిసెప్షన్‌కు హాజరయ్యారు. కేటీఆర్ పక్కన.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు కూర్చున్నారు.
Updated Date - Dec 23 , 2023 | 03:07 AM