Palamuru : పాలమూరు పంతం!
ABN, First Publish Date - 2023-11-25T04:56:35+05:30
మేధావులు, విద్యావంతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నెలవైన నియోజకవర్గం మహబూబ్‌నగర్. అంతేస్థాయిలో చైతన్యవంతమైన సమాజంతో కూడిన ప్రాంతం.
ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకం మహబూబ్‌నగర్
హ్యాట్రిక్ లక్ష్యంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రచారం
చేజారిన సీటును తిరిగి దక్కించుకోవాలని యెన్నం
తండ్రి ఇమేజ్ గెలిపిస్తుందని మిథున్ ధీమా
హోరాహోరీగా మూడు పార్టీల ముక్కోణపు పోటీ
ఇద్దరూ ఉద్యమకారులు.. ఉద్యోగాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చినవారు. వారిలో ఒకరు తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఎమ్మెల్యేగా ఎన్నికవగా, మరొకరు తెలంగాణ రాష్ట్రంలో వరుసగా రెండుసార్లు అసెంబ్లీకి వెళ్లడంతోపాటు మంత్రి పదవినీ చేపట్టి రాణించారు. ఇద్దరూ ఇప్పుడు మరోసారి తలపడుతుండగా.. ఇంకోవైపు మరో ఉద్యమకారుడైన సీనియర్ నేత కుమారుడు వీరిని ఢీకొట్టేందుకు సిద్ధమయ్యారు. దీంతో మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో హోరాహోరీ ముక్కోణ పోటీ జరుగుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
మేధావులు, విద్యావంతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నెలవైన నియోజకవర్గం మహబూబ్‌నగర్. అంతేస్థాయిలో చైతన్యవంతమైన సమాజంతో కూడిన ప్రాంతం. ఉద్యమ సమయంలోనూ, ఆ తరువాతా విలక్షణ తీర్పులతో ఇక్కడి ప్రజలు ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఇలాంటి చోట వరుసగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించాలని మంత్రి శ్రీనివా్‌సగౌడ్ ప్రయత్నిస్తుండగా, తొమ్మిదేళ్ల క్రితం స్వల్ప తేడాతో చేజార్చుకున్న సీటును తిరిగి దక్కించుకోవాలని కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివా్‌సరెడ్డి పట్టుదలతో ఉన్నారు. మరోవైపు బీజేపీ సీనియర్ నేత ఏపీ జితేందర్‌రెడ్డి కుమారుడిగా రాజకీయ అరంగేట్రం చేస్తున్న మిథున్‌కుమార్‌రెడ్డి.. తండ్రి ఇమేజ్, పార్టీ సంప్రదాయ ఓటుబ్యాంకుతో విజయం సాధిస్తానన్న ధీమాతో ఉన్నారు. పట్టణ ప్రాంతం ఎక్కువగా ఉన్న మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో గత నాలుగు ఎన్నికల్లో బహుముఖ పోటీ జరగగా.. ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, స్వతంత్ర, బీఆర్‌ఎస్, బీజేపీ, ప్రజారాజ్యం తదితర పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో నిలవగా.. ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రాజేశ్వర్‌రెడ్డి గెలుపొందారు. అయితే ఆయన అకాల మరణం చెందడంతో 2012లో ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికలో యెన్నం శ్రీనివా్‌సరెడ్డి బీజేపీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. అనంతరం 2014, 2018 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు బీఆర్‌ఎస్ అభ్యర్థి శ్రీనివా్‌సగౌడ్ గెలుపొందారు. ఈ ఐదు ఎన్నికల్లో పలువురు స్వతంత్ర అభ్యర్థులు, చిన్నపార్టీల నుంచి పోటీ చేసినవారు చీల్చిన ఓట్లే ప్రధాన పార్టీల అభ్యర్థుల జాతకాలను తలకిందులు చేశాయి. తాజా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థుల బెడద లేకపోవడం, మూడు ప్రధాన పార్టీలు తమ ఓటు బ్యాంకు చీలకుండా చూసుకుంటుండటం, ముగ్గురూ హొరాహోరీగా పోరాడుతుండటంతో ఈ ఎన్నికపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
హ్యాట్రిక్ లక్ష్యంగా శ్రీనివా్‌సగౌడ్.
ఉద్యోగ సంఘాల నేతగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, స్వరాష్ట్ర సాధనతో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన వి.శ్రీనివా్‌సగౌడ్ మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో వరుసగా మూడోసారి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. 2014లో మొదటిసారి ఎన్నికల్లో నిలిచిన శ్రీనివా్‌సగౌడ్ తన ప్రత్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డిపై 3139 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తిరిగి 2018లో మహాకూటమి తరఫున బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థి, మరాఠి చంద్రశేఖర్‌పై 57,775 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. రెండోసారి గెలుపొందాక సీఎం కేసీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా గెలుపొందాక ఈ తొమ్మిదేళ్లలో సాధించిన అభివృద్ధే తనను మరోసారి గెలిపిస్తుందనే ధీమాతో శ్రీనివా్‌సగౌడ్ ఉన్నారు.
‘చే’జారిన సీటును దక్కించుకోవాలని..
తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన యెన్నం శ్రీనివా్‌సరెడ్డి.. తొలుత మహబూబ్‌నగర్ కేంద్రంగా బీఆర్‌ఎస్‌లోనే పనిచేశారు. బీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్‌గానూ వ్యవహరించారు. 2012 ఉప ఎన్నికల సమయంలో బీజేపీలో చేరి.. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 1879 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014లో తిరిగి బీజేపీ నుంచే బరిలో నిలిచి బీఆర్‌ఎస్ అభ్యర్థి శ్రీనివా్‌సగౌడ్ చేతిలో ఓడిపోయారు. అనంతరం బీజేపీని వీడిచెరుకు సుధాకర్‌తో కలిసి తెలంగాణ ఇంటి పార్టీని ఏర్పాటు చేశారు. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ మహాకూటమిలో చేరడంతో మహబూబ్‌నగర్‌లో కూటమి అభ్యర్థికి మద్దతు పలికారు. అనంతరం 2019లో తిరిగి బీజేపీలో చేరి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఇటీవల కాంగ్రె స్‌లో చేరి.. టికెట్ దక్కించుకున్నారు. యెన్నం శ్రీనివా్‌సరెడ్డి రాకతో ఇక్కడ కాంగ్రెస్ బలమైన పోటీదారుగా నిలిచింది. 6 గ్యారంటీలు, హామీలకు తోడు యెన్నం వ్యక్తిగత ప్రతిష్ఠతో.. ఈ సీటును తిరిగి దక్కించుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ ఉంది.
మహబూబ్‌నగర్- ఆంధ్రజ్యోతి
జితేందర్‌రెడ్డి తనయుడిగానే..
జనసంఘ్ కాలం నుంచి సంప్రదాయ ఓటుబ్యాంకు కలిగిన బీజేపీ తరఫున మహబూబ్‌నగర్‌లో మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి తనయుడు, యువనేత ఏపీ మిథున్‌కుమార్‌రెడ్డి పోటీలోకి వచ్చారు. పార్టీ ఓటుబ్యాంకుతోపాటు తండ్రి జితేందర్‌రెడ్డికి ఉన్న వ్యక్తిగత కరిష్మాతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులిద్దరికీ గట్టి సవాల్ విసురుతున్నారు. దాదాపు పాతికేళ్లకు పైగా మహబూబ్‌నగర్ కేంద్రంగా రాజకీయాల్లో ఉన్న జితేందర్‌రెడ్డికి ఈ నియోజకవర్గంలో రాజకీయాలకతీతంగా అన్నివర్గాలతో సన్నిహిత సంబంధాలున్నాయి. బీజేపీలో అత్యున్నత స్థాయి నేతలతో జితేందర్‌రెడ్డికి సాన్నిహిత్యం ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించిన మిథున్‌రెడ్డి తండ్రి బాటలో రాజకీయాల్లోకి వచ్చి మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచారు. తెరవెనుక జితేందర్‌రెడ్డి క్షేత్రస్థాయిలో వ్యూహాలను అమలు చేస్తున్నారు.
1నే ఎమ్మెల్యేలకు జీతాలు!
ఆర్టీఐ కింద వెల్లడించిన శాసనసభ సచివాలయం
శాసనసభ్యులకు ప్రతి నెల ఠంఛన్‌గా ఒకటో తేదీనే జీతాలు అందుతున్నాయి. వారి జీతాలు ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా ఫస్టునే ఇస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ శాసన సభ సచివాలయం వెల్లడించింది. మేడ్చల్ జిల్లాకు చెందిన ఆర్టీఐ కార్యకర్త సురేశ్ కుమార్ ఎమ్మెల్యేల జీతాలు ప్రతీనెలా ఎప్పుడు చెల్లిస్తున్నారో వెల్లడించాలని సమాచార హక్కు చట్టం కింద కోరారు. దానికి తెలంగాణ శాసన సభ సచివాలయం సమాధానమిచ్చింది. ఎమ్మెల్యేల జీతాలను ప్రతీ నెల మొదటి పని రోజున వారి సంబంధిత బ్యాంకు ఖాతాలలో జమ చేస్తున్నట్లు తెలిపింది.
హైదరాబాద్- ఆంధ్రజ్యోతి
ఈవీఎంలు రెడీ!
మరొక్క ఐదు రోజులు! పోలింగ్ పండుగ వచ్చేస్తోంది! అందుకు, అత్యంత కీలకమైన ఈవీఎంలు సిద్ధమవుతున్నాయి! ప్రతి నియోజకవర్గంలోనూ.. ఆయా అభ్యర్థుల పేర్లను ముద్రించిన బ్యాలెట్ పేపర్‌తో కూడిన ఈవీఎంలు.. వాటికి అనుసంధానంగా వీవీ ప్యాట్‌లు కావాలి కదా! ఆ తర్వాత వాటికి సీల్ వేయాలి కదా! హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్‌లో ఇప్పుడు ఈ ప్రక్రియ జోరుగా సాగుతోంది. అనంతరం ఆయా నియోజకవర్గాలకు ఈవీఎంలను తరలించనున్నారు!!
కోవర్టుల కాలం!
ఇది అసలే ఎన్నికల కాలం! అందులోనూ.. నాయకులను ఆకర్షించే కాలం! నాలుగు డబ్బులు సంపాదించుకునే కాలం కూడా! అందుకే, కొంతమంది కిందిస్థాయి నాయకులు వ్యూహాత్మకంగా, లౌక్యంగా వ్యవహరిస్తున్నారు! పార్టీ అభ్యర్థికి అండగా ఉంటూనే.. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి కూడా భరోసా ఇస్తున్నారు! ప్రస్తుతం ‘ఆపరేషన్ ఆకర్ష్’ జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే! ఒక పార్టీలో.. ఒక నేతకు అనుచరులుగా ఉన్నవారు.. మరో గంటలో ఎక్కడ ఉంటారో.. ఏ పార్టీ కండువా కప్పుకొంటారో తెలియని పరిస్థితి! ప్రత్యర్థి పార్టీల్లోని కీలక నేతలను ఆకర్షించేందుకు ఆయా పార్టీలూ జోరుగా ప్రయత్నాలు చేస్తున్నాయి! వ్యూహాలు ఫలించిన చోట కొంతమంది నేరుగానే ఆయా పార్టీల్లో చేరుతున్నారు. మరికొంతమందిని ఆయా పార్టీల్లో ఉంటూనే తమకు పని చేయాలని కోరుతున్నారు. ఇంకా కొంతమంది విషయంలో డీల్ సెట్ కావడం లేదు! అది సెట్ అయ్యే వరకూ సదరు పార్టీతో ఆ నాయకులు టచ్‌లో ఉంటూనే ఉన్నారు. వారిని ఒప్పించేందుకు పార్టీలూ శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. ‘అన్నా.. యూ డోంట్ వర్రీ! నేనెక్కడున్నా మీకు హెల్ప్ చేస్తా’ అంటూ అభయ హస్తం ఇస్తున్నారు. డీల్ కుదరకపోయినా.. డీల్ కుదిరినా పార్టీ మారే పరిస్థితులు లేకపోయినా ఇలా తెర వెనక మంతనాలు జరుపుతున్నారు!!
హైదరాబాద్-ఆంధ్రజ్యోతి
Updated Date - 2023-11-25T06:02:15+05:30 IST