ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

government institutions a curse : సర్కారు సంస్థలు కావటమే.. శాపమా?

ABN, Publish Date - Dec 31 , 2023 | 03:23 AM

తెలంగాణ విద్యుత్‌ సంస్థలు వేల కోట్ల నష్టాలతో, రుణభారంతో కునారిల్లుతున్నాయని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం వెల్లడించిన సంగతి తెలిసిందే.

బకాయిల భారంలో తెలంగాణ జెన్‌కోలు

వాటికి డిస్కమ్‌లు చెల్లించాల్సిన

మొత్తం రూ.20 వేల కోట్లు

పదేళ్లుగా పేరుకుపోయిన బిల్లులు

సింగరేణి పరిస్థితీ అదే..

డిస్కమ్‌లకు కరెంటు అమ్మినా రాని బిల్లులు

ప్రైవేటు కరెంటు కంపెనీలకు, కేంద్ర ఎన్‌టీపీసీకి

మాత్రం ఠంచనుగా చెల్లింపులు

అడ్వాన్సు ఇచ్చి మరీ వాటి నుంచి కొనుగోళ్లు

పకడ్బందీ ఏర్పాట్లు, విధానాలే వాటికి రక్షణ

హైదరాబాద్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ విద్యుత్‌ సంస్థలు వేల కోట్ల నష్టాలతో, రుణభారంతో కునారిల్లుతున్నాయని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కరెంటును ఉత్పత్తి చేసే అత్యంత కీలకమైన ప్రభుత్వ జెన్‌కోలను పరిశీలిస్తే పూర్తి నిరాశజనక పరిస్థితి కనిపిస్తోంది. వాటి నుంచి ప్రభుత్వం కరెంటును కొనటం, బిల్లులు చెల్లించకపోవటం వాటికి శాపంగా మారింది. తెలంగాణ డిస్కమ్‌లు జెన్‌కోలకు ఏకంగా రూ.20 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ, అతీగతీ లేదు. కరెంటును ఉత్పత్తి చేసి ఇస్తున్న సింగరేణి పరిస్థితి కూడా ఇదే. డిస్కమ్‌లు సింగరేణికి కూడా రూ.20 వేల కోట్లకు పైగా బకాయిపడ్డాయి. విచిత్రమేమిటంటే, ప్రభుత్వ సంస్థలు కావటమే వీటికి శాపంగా మారితే, ప్రైవేటు విద్యుత్తు సంస్థలకు, కేంద్ర ప్రభుత్వ జెన్‌కోలకు మాత్రం అడ్వాన్సుగా డబ్బులు చెల్లించి కరెంటు కొనే పరిస్థితి ఉంది. వాటికి నిబంధనలు ఆ విధంగా పకడ్బందీ రక్షణ కల్పిస్తున్నాయి. ప్రైవేట్‌ కంపెనీల నుంచి, ఎన్‌టీపీసీ వంటి కేంద్రప్రభుత్వ సంస్థల నుంచి కరెంట్‌ కొంటే వాటికి విధిగా చెల్లింపులు జరపాలి. ఎంత కరెంట్‌ కావాలో ఆ మేరకు లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌సీ)ని బ్యాంకుల్లో తీసి, దానిని ముందే సమర్పించాలి.

అంతేకాదు, విద్యుత్‌ కొనుగోళ్లలో పారదర్శకత కోసం కేంద్రం మరింత కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తూ, జాతీయస్థాయిలో ఒక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. ‘పేమెంట్‌ రాటిఫికేషన్‌ అండ్‌ ఎనాలిసిస్‌ ఇన్‌ పవర్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ఫర్‌ బ్రింగింగ్‌ ట్రాన్స్‌పరెన్సీ ఇన్‌ ఇన్‌వాయిసింగ్‌ ఆఫ్‌ జన రేటర్‌’ (ప్రాప్తి) పేరుతో ఉన్న ఈ వెబ్‌సైట్‌లో కొనుగోళ్ల వివరాలు పూర్తిగా నమోదు చేస్తారు. ఏదైనా విద్యుదుత్పత్తి సంస్థ నుంచి కరెంటు కొనుగోలు చేసిన డిస్కం.. నిర్ణీత వ్యవధిలోగా చెల్లింపులు చేయకపోతే ఈ వెబ్‌సైట్‌లో సదరు డిస్కమ్‌పై నిషేధం విధిస్తారు. జాతీయ స్థాయిలో మరే కరెంటు కంపెనీ నుంచి కూడా విద్యుత్తు కొనకుండా నిషేధం అమలు చేస్తారు. ఇంత పకడ్బందీ ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టే ప్రైవేటు, కేంద్ర ప్రభుత్వ జెన్‌కోలు నిక్షిప్తంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని జెన్‌కోలు మాత్రం నష్టాలతో.. ఆ నష్టాలను పూడ్చుకోవటానికి చేసే రుణాలతో ఆపసోపాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ జెన్‌కోలను కాపాడుకోవాలంటే వాటికి కూడా కరెంటు కొనుగోళ్ల చెల్లింపులు తక్షణం జరిపేలా కఠిన విధానాలు తీసుకురావాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సొంతంగా ఉత్పత్తి సగమే..

రాష్ట్రంలో సగటున ప్రతి రోజు 220 మిలియన్‌ యూనిట్ల దాకా వినియోగం ఉంటే... అందులో 80 మిలియన్‌ యూనిట్లను ప్రభుత్వ జెన్‌కోలు ఉత్పత్తి చేస్తున్నాయి. సింగరేణి 27 మిలియన్‌ యూనిట్ల దాకా అందిస్తోంది. మిగిలిన 113 మిలియన్‌ యూనిట్ల కరెంటును ఎన్‌టీపీసీ, ప్రైవేటు, ఇతర రాష్ట్రాల విద్యుత్‌ కంపెనీల నుంచి కొంటున్నారు. విద్యుత్‌ కొనుగోళ్లు ప్రధానంగా మూడు రకాలు. మొదటివి, దీర్ఘకాలిక ఒప్పందాలు. 25 ఏళ్ల పాటు అమలులో ఉంటాయివి. కొనుగోలు ఒప్పందం చేసుకొని, వినియోగదారులకు కరెంట్‌ సరఫరా చేసిన 45 రోజులు లేదా రెండునెలల్లోపు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. రెండో రకం, మధ్యతరహా ఒప్పందాలు. రెండేళ్లు లేదా అంతకంటే తక్కువ కాలంపాటు ఉనికిలో ఉంటాయి. వీటిల్లో కూడా బిల్లు జారీ చేసిన 45 రోజులు లేదా రెండునెలల్లోపు చెల్లింపులు జరపాలి. ఇక మూడోది.. స్వల్పకాలిక కొనుగోళ్లు. నెల, 15 రోజులు, ఒక రోజు, చివరికి 15 నిమిషాల కోసం కూడా ఈ విధానంలో కరెంటు కొంటారు. అయితే ఇందులో చెల్లింపులు ముందుస్తుగానే చేయాలి.

ఉమ్మడి వేదిక.. ఓపెన్‌ యాక్సెస్‌

విద్యుత్‌ క్రయవిక్రయాల కోసం కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (సీఈఆర్‌సీ) 2008లో ఓపెన్‌ యాక్సె్‌సను ప్రారంభించింది. కరెంట్‌ విక్రేతలు, కొనుగోలుదార్లకు ఇది ఒక వేదిక. చేతిలో డబ్బుంటే అప్పటికప్పుడు కరెంటు దొరుకుతుంది. కొనుగోళ్లన్నీ పారదర్శకంగా జరుగుతుంటాయి. తెలంగాణ డిస్కమ్‌లు గత పదేళ్లలో 78,970 మిలియన్‌ యూనిట్ల కరెంట్‌ను కొనుగోలు చేశాయి. ఇందులో 70 శాతానికి పైగా ఓపెన్‌ యాక్సె్‌సలో కొనగా, మిగిలిన 30 శాతాన్ని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి స్వల్పకాలిక విధానంలో కొనుగోలు చేశాయి.

ఒప్పందాలున్నా... తీరని డిమాండ్‌

తెలంగాణ ఆవిర్భావం నాటికి 7,778 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలుండగా... ప్రస్తుతం 19,475 మెగావాట్ల కొనుగోలు ఒప్పందాలు ఉన్నట్లు ప్రభుత్వం ఇటీవల శ్వేతపత్రంలో ప్రకటించింది. అయినా పీక్‌ (గరిష్ఠ) డిమాండ్‌ ఉన్న సమయంలో దిక్కులు చూడాల్సి వస్తోంది. వ్యవసాయ వినియోగం అధికంగా ఉండే ఉదయం 6-9 గంటల మధ్య విద్యుత్‌ డిమాండ్‌ అఽత్యదికంగా 11,900 మెగావాట్ల మేర ఉంటోంది. తెలంగాణకు 19 వేల మెగావాట్ల ఒప్పందాలున్నా 11,900 మెగావాట్ల డిమాండ్‌ తీర్చే అవకాశాలు లేవు. కారణం, 19 వేల మెగావాట్లు అన్నది పేరుకేగానీ..వాస్తవంలో అందుబాటులో లేదు. దాంట్లో 5,600 మెగావాట్లు సౌరవిద్యుత్‌ ఒప్పందాలు. సూర్యోదయం తర్వాత, ఎండ బాగా ఉన్నప్పుడే వీటి నుంచి విద్యుత్‌ లభిస్తుంది. మరో 807 మెగావాట్లతో గ్యాస్‌ ఆధారిత ఒప్పందం ఉన్నా... ఆచరణలోకి రావటం లేదు. ఛత్తీ్‌సగఢ్‌ నుంచి వెయ్యి మెగావాట్ల ఒప్పందం ఉన్నప్పటికీ, చెల్లింపులు జరపని కారణంగా కరెంట్‌ సరఫరా నిలిచిపోయింది.

రాష్ట్రంలో 2442.76 మెగావాట్ల జలవిద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ, రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నందున ఆ కరెంటూ ఉత్పత్తి కావటం లేదు. అంటే, 19,475 మెగావాట్లలో 9,850 మెగావాట్లకు గ్యారెంటీలేదు. కచ్చితంగా లభ్యమయ్యేది మిగిలిన 9,625 మెగావాట్లే. ఇదంతా థర్మల్‌ విద్యుత్తు. 24 గంటలూ లభ్యమవుతూ ఉంటుంది. ఈ లెక్కన 11,900 మెగావాట్ల పీక్‌ డిమాండ్‌ తీర్చాలంటే అందుబాటులో ఉన్న 9,625 మెగావాట్లు పోను, మరో 2,275 మెగావాట్ల కరెంట్‌ను బహిరంగ విపణిలో కొనుగోలు చేయాల్సిందే. అయితే ఉదయం వ్యవసాయ మోటార్లు పని చేస్తున్నందున.. పీక్‌ డిమాండ్‌ ఉదయం పూటే నెలకొంటోంది. చీకటి పడితే డిమాండ్‌ తగ్గుతోంది. ఈ నెల 22వ తేదీన మధాహ్నం 12:28 గంటలకు 11,929 మెగావాట్ల డిమాండ్‌ ఉంటే... సాయంత్రం 6:37 గంటలకు 7,406 మెగావాట్ల డిమాండ్‌ నమోదైంది. కాబట్టి, పొద్దున్న కోసం కొన్న అదనపు విద్యుత్‌లో మిగిలిన దానిని బహిరంగ విపణిలో అమ్ముకోవాల్సిన పరిస్థితి.

పదేళ్లలో 39,722 కోట్ల వ్యయం

2014-15 నుంచి ఈ ఏడాది నవంబరు 23దాకా 78,970 మిలియన్‌ యూనిట్ల కరెంట్‌ను డిస్కమ్‌లు కొనుగోలు చేశాయి. దీనికి గాను రూ.39,722 కోట్లను వ్యయం చేశాయి. యూనిట్‌కు సగటు ధర రూ.5.03 అని చెబుతున్నా కనిష్ఠంగా రూ.1.00, గరిష్ఠంగా రూ.15 చొప్పున కొనుగోలు చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పదేళ్లలో డిస్కమ్‌లు రూ.50 వేల కోట్ల నష్టాలు చవిచూడగా... వీటిలో కొనుగోళ్ల ఫలితంగానే 39,722 కోట్ల మేర నష్టపోయాయి. లాభాలను ఇచ్చే వినియోగదారుల కోసం కాకుండా... నష్టాలు అందించే వర్గాల కోసమే ప్రధానంగా కరెంట్‌ కొనుగోళ్లు చేపట్టడం డిస్కమ్‌ల నష్టాలకు కారణమని విమర్శలు ఉన్నాయి.

Updated Date - Dec 31 , 2023 | 03:23 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising