సింగరేణి ఎన్నికలపై వీడని ఉత్కంఠ
ABN, Publish Date - Dec 18 , 2023 | 10:22 PM
సింగరేణి ఎన్నికలపై విచా రణను హైకోర్టు ఈ నెల 21కి వాయిదా వేసింది. ఎన్నికలను డిసెంబరు 21కి బదులు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించాలని రాష్ట్ర ఇంధన శాఖ ఇటీవల హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
మంచిర్యాల, డిసెంబర్ 18 (ఆంధ్రజ్యోతి): సింగరేణి ఎన్నికలపై విచా రణను హైకోర్టు ఈ నెల 21కి వాయిదా వేసింది. ఎన్నికలను డిసెంబరు 21కి బదులు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించాలని రాష్ట్ర ఇంధన శాఖ ఇటీవల హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సమయం కావాలనే ఉద్దేశ్యం తో కోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ విషయమై సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా సింగరేణి ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. గుర్తింపు ఎన్నికలు నిర్వహించడానికి తగిన సమయం కావాలని కోరడంతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.
ఆది నుంచీ అవాంతరాలే....
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు మొదటి నుంచి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ ఎన్నికల విషయంలో నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఒకసారి గుర్తింపు సంఘం వాయిదా కోరగా, ఆ తరువాత యాజమాన్యం, మరోసారి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వేరువేరుగా ఎన్ని కలను వాయిదా వేయించాయి. చివరికి అక్టోబర్‌లో జరిగిన సాధారణ ఎన్నికలు కూడా సింగరేణి గుర్తింపు ఎన్నికలకు అడ్డుగా మారాయి. కాగా ఈ నెల 21న కోర్టు తీర్పు ఎలా ఉంటుందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. కోల్‌బెల్ట్ ఏరియాలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో సింగరేణి గనులు విస్తరించి ఉన్నాయి. ఆయా జిల్లాల్లో మొత్తం 11 ఏరియాలుండగా, 39,748 పై చిలుకు కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. సింగరేణిలో చివరి సారిగా 2017 అక్టోబర్ 5వ తేదీన 6వ దఫా సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ విజయం సాధించింది. రెండేళ్ల కాలపరిమితితో టీబీజీకేఎస్ బాధ్యతలు స్వీకరించగా, 2019 అక్టోబర్ 5 నాటికి పూర్తయింది. అనంతరం గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా వివిధ కారణాలతో నాలుగేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్నాయి.
షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగేనా...?
ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణపై అటు యాజమాన్యం, ఇటు ప్రభుత్వాలు దోబూచులాడు తున్నాయి. నాలుగేళ్లుగా ఎన్నికలను ఉద్దేశపూర్వకంగా వాయిదా వేయిస్తూ వస్తున్న యాజమాన్యం ఎప్పటికప్పుడు అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది. అసెంబ్లీ ఎలక్షన్లు పూర్తయ్యేంత వరకు సింగరేణిలో గుర్తింపు ఎన్నికలు జరుగకూడదన్న ఒకే ఒక కారణంతో ఇంతకాలం పట్టుబట్టింది. చివరగా అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అక్టోబర్‌లో సుప్రీంకోర్టు న్యాయవాది అరవింద్ సూద్‌తో హైకోర్టులో పిటిషన్ వేయించడం ద్వారా షెడ్యూల్ ఖరారైన ఎన్నికలను తిరిగి ఆపడంలో విజయం సాధించింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం అక్టోబర్ 11వ తేదీకి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. సింగరేణిలో రెండేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించి గుర్తింపు సంఘాన్ని ఎన్నుకోవలసి ఉండగా, యాజమాన్యం నిర్లిప్త వైఖరి కార ణంగా నాలుగేళ్ళుగా వాయిదా పడుతూ వస్తున్నాయి. గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసినందున ఎన్నికలు నిర్వహించేలా యాజమాన్యాన్ని ఆదేశించాలంటూ ఏఐటీయూసీ హైకోర్టును ఆశ్రయించింది. ఏఐటీయూసీ కృషి మేరకు గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈనెల 27న సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగాల్సి ఉంది. హైకోర్టు ఆదే శాలతో ఎన్నికల నిర్వహణకు కేంద్ర కార్మికశాఖ సమాయత్తం కాగా, విధిలేని పరిస్థితుల్లో యాజమాన్యం కూడా ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఎన్నికలకు సంబంధించి కార్యాచరణ పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ పూర్తికాగా, కేంద్ర కార్మికశాఖ తుది ఓటరు జాబితాను ఆయా సంఘాల బాధ్యులకు అందజేసింది. తీరా అనూహ్యంగా కాంగ్రెస్ ప్రభు త్వం కూడా గుర్తింపు ఎన్నికలను వాయిదా వేయాలని హైకోర్టును ఆశ్ర యించడంలో కథ మళ్లీ మొదటికే వచ్చినట్లయింది. ఈ క్రమంలో అసలు ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారం సింగరేణిలో 7వ దఫా గుర్తింపు ఎన్నికలు జరుతాయో లేదోనన్న అనుమానం కార్మికులు, కార్మిక సంఘాల నేతల్లోనూ నెలకొంది.
హోరాహోరీగా ప్రచారం...
షెడ్యూల్ ప్రకారమే సింగరేణి ఎన్నికలు జరుగుతాయని భావించిన వివిధ కార్మిక సంఘాలు ముమ్మర ప్రచారం మొదలుపెట్టాయి. పోటా పోటీగా గనులపైకి వెళ్తూ ఓట్లు అభ్యర్థించే పనిలో నిమగ్నమవు తున్నాయి. ఈ క్రమంలో ఆయా సంఘాల్లో చేరికలు ఊపందుకున్నాయి. నిత్యం గనుల వద్ద గేట్ మీటింగ్‌లు ఏర్పాటు చేస్తూ కార్మికులను తమ సంఘాల్లో చేర్పించుకుంటున్నారు. గుర్తింపు ఎన్నికల నిర్వహణకు పలుమార్లు ఏఐటీయూసీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కార్మికుల మద్దతు తమకే ఉంటుందని ఆ సంఘం నేతలు భావిస్తుండగా, ఐఎన్టీయూసీ తనకంటూ ప్రత్యేకంగా రూపొందించిన ఆరు పథకాలతో కూడిన మేనిఫెస్టో ద్వారా కార్మికులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇంతలోనే ఎన్నికలపై మళ్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం, తీర్పును ఈనెల 21వ తేదీకి వాయిదా వేయడంతో కార్మికులతోపాటు, ప్రధాన సంఘాల నేతల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి.
Updated Date - Dec 18 , 2023 | 10:22 PM