Kumaram Bheem Asifabad: ఇలా జరిగిందేమిటీ?
ABN, First Publish Date - 2023-12-04T22:34:56+05:30
ఆసిఫాబాద్, డిసెంబరు 4: యాభై రోజుల పాటు హోరాహోరీగా సాగిన ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వెలువడ్డాయి. జిల్లాలో మిశ్రమ ఫలితాలు రావడంతో గెలుపొందిన అభ్యర్థుల్లో విజయదరహాసం కనిపిస్తుంటే ఓటమి పాలైన అభ్యర్థుల్లో అంతర్మథనం మొదలైంది.
- ఓటమి అభ్యర్థుల్లో మొదలైన అంతర్మథనం
- దెబ్బతీసిన అంశాలపై లోతైన చర్చ
- కార్యకర్తల పని తీరుపైనా సమీక్షా
- పో(ల్)స్ట్‌మార్టం
ఆసిఫాబాద్, డిసెంబరు 4: యాభై రోజుల పాటు హోరాహోరీగా సాగిన ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వెలువడ్డాయి. జిల్లాలో మిశ్రమ ఫలితాలు రావడంతో గెలుపొందిన అభ్యర్థుల్లో విజయదరహాసం కనిపిస్తుంటే ఓటమి పాలైన అభ్యర్థుల్లో అంతర్మథనం మొదలైంది. తప్పక గెలుస్తామన్న ధీమాతో ఉన్న అభ్యర్థులు ఓటమి పాలు కావడం, కష్టం అనుకున్న అభ్యర్థులు విజయ తీరాలకు చేరడం వెనక దోహదపడిన కారణాలు ఏమిటి..? ఇందులో డబ్బు పాత్రేమిటి..? మౌలికంగా పార్టీ క్యాడర్ సహకరించిందా లేదా? అన్న అంశాలపైన అటు అభ్యర్థులు, ఇటు రాజకీయ వర్గాల్లోనూ అంతర్మథనం మొదలైంది. ఎవరికీ అంతుచిక్కని రీతిలో కొనసాగిన ఈ ఎన్నికల్లో ప్రచారం మొదలు ఫలితాల వరకు ఓటరు నాడి ఏమిటన్నది ఎవరికీ అంతుచిక్కలేదు. దీంతో ఇటు అధికార, అటు విపక్షాల అభ్యర్థులను ఆల్ ఇజ్ వెల్ అన్న రీతిలో పరిస్థితులు కనిపించాయి. అయితే ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, వ్యక్తిగత ఇమేజ్ రెండు కలగలిపి జిల్లాలో ఫలితాలను ప్రభావితం చేయడం రాజకీయ విశ్లేషకులను సైతం నివ్వెరపోయేలా చేసింది. ఆసి ఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి స్థానికేతరుడు కావడం, గోండు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు గంపగుత్తగా కోవ లక్ష్మికి పడటంతో ఆమె గెలుపుకు దారి తీసింది. ఇటు సిర్పూర్‌లో బలమైన కోనేరు కోనప్పను ఢీ కొనేందుకు బీజేపీ నుంచి రంగంలోకి దిగిన హరీష్‌బాబుకు తల్లిదండ్రుల ఇమేజ్‌తోపాటు తనకు ఉన్న సానుభూతి ఓటుగా మారి గెలుపునకు దారి తీసింది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీర శ్యాంనాయక్, సిర్పూర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప ఇద్దరు ఓటమి పాలు కావడానికి గల కారణలపై పోస్టుమార్టం మొదలైంది.
గెలుపోటములను శాసించిన పరిస్థితులివే..
ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీర శ్యాంనాయక్, సిర్పూర్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప విజయం సాధిస్తారని అందరూ అంచనా వేసినా వారి ఓటమితో పార్టీ శ్రేణుల్లో విషాధచాయలు నెలకొన్నాయి. అభ్యర్థులు ఓటర్లు ఇచ్చిన షాక్ నుంచి ఇంకా తేరుకోవడం లేదు. మితిమీరిన ధన ప్రవాహం జరిగిన ఈ ఎన్నికల్లో గెలుపుపై చివరి వరకు పెట్టుకున్న అంచనాలు వమ్ము కావడంతో ఈ ఇరువురు అభ్యర్థుల్లోనూ నిర్వేదం కనిపిస్తోంది. ఆసిఫాబాద్‌లో ఈసారి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. ఆసిఫాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న నేపథ్యంలో ఈసారి ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టకుండా విలక్షణ తీర్పును ఇచ్చారు. దీంతో బీఆర్‌ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మి తన సమీప ప్రత్యర్థి అయిన ఆజ్మీర శ్యాం నాయక్‌పై 22వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. రాష్ట్రమంతటా కాంగ్రెస్ హవా కొనసాగగా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మాత్రం ఇందుకు భిన్నంగా ఓటర్లు బీఆర్‌ఎస్ వైపు మొగ్గుచుపారు. ఇందుకు గల కారణాలను పరిశీలిస్తే నియోజకవర్గంలో గోండు సామాజికవర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉండడమేనని తెలుస్తోంది. ఆ ఓట్లన్నీ గంపగుత్తగా కోవ లక్ష్మికే మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా సంక్షేమ పథకాలు కూడా కొంత మేర కలిసి వచ్చినట్లు అర్థమవుతోంది. ఇక సిర్పూర్ నియోజకవర్గం విషయానికి వస్తే మొదటి నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థి కోనప్ప, బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్‌బాబు, బీఎస్పీ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. నువ్వా?నేనా? అన్న విధంగా సిర్పూర్‌లో హోరాహోరీ నెలకొంది. అయితే ఇక్కడ కౌంటింగ్ తీరును పరిశీలిస్తే హరీష్‌బాబు, కోనేరు కోనప్ప మధ్యే హోరాహోరీ పోరుసాగింది. మొత్తం 21రౌండ్లలో జరిగిన ఓట్ల లెక్కింపులో నువ్వానేనా అన్న విధంగా ఓటింగ్ సరళి కొనసాగింది. బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న హరీష్‌బాబుకు నియోజకవర్గంలోని బీజేపీ అభి మానుల ఓట్లు భారీగా దక్కించుకోగా ఆయన తల్లిదండ్రులు గతంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా పనిచేసి ఉండటం వారిపై నియోజకవర్గం లోని కొన్నివర్గాల సానుభూతి అధికంగా ఉండటంవల్ల తన సమీప ప్రత్యర్థి బీఆర్‌ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్పపై 3వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప ఓటమికి కారణాలను పరిశీలిస్తే నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొన్న నేపథ్యంలో ఓట్లు భారీగా చీలడమే కారణమని తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతతో నియోజక వర్గంలోని యువత ఈసారి బీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపకపోవడం ఆ ఓట్లు బీఎస్పీ ఇతర పార్టీలకు పడడంతో బీఆర్‌ఎస్ అభ్యర్థి ఓటమికి కారణాలుగా తెలుస్తోంది.
Updated Date - 2023-12-04T22:34:57+05:30 IST