Kumaram Bheem Asifabad: ‘పది’ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
ABN, Publish Date - Dec 22 , 2023 | 11:27 PM
ఆసిఫాబాద్, డిసెంబరు 22: విద్యార్థుల భవితకు తొలిమెట్టు పదవ తరగతి. విద్యాశాఖ, ఉపాధ్యాయుల పనితీరుకు ఎస్సెస్సీ పరీక్షలు కీలకం. 2023-24 విద్యాసంవత్సరంలో పదో తరగతి పరీక్షలకు ప్రణాళికలు సిద్ధం చేసి కార్యాచరణ అమలు చేస్తున్నారు.
- వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
- ఉత్తమ ఫలితాల సాధనకు కసరత్తు
- విద్యార్థులకు కొనసాగుతున్న ప్రత్యేక తరగతులు
ఆసిఫాబాద్, డిసెంబరు 22: విద్యార్థుల భవితకు తొలిమెట్టు పదవ తరగతి. విద్యాశాఖ, ఉపాధ్యాయుల పనితీరుకు ఎస్సెస్సీ పరీక్షలు కీలకం. 2023-24 విద్యాసంవత్సరంలో పదో తరగతి పరీక్షలకు ప్రణాళికలు సిద్ధం చేసి కార్యాచరణ అమలు చేస్తున్నారు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు నవంబరు1 నుంచి ఉదయం8:30 నుంచి9:30వరకు గంట పాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. గతేడాది విద్యాశాఖ ప్రణాళికలు పకడ్బందీగా అమలు చేయడంతో జిల్లాలో పదోతరగతి విద్యార్థులు 76.36 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది వందశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా విద్యాశా ఖాధికారులు కసరత్తు చేస్తున్నారు.
వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం..
జిల్లాలో 155ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. అన్ని యాజమాన్యలకు సంబంధించిన పాఠశాలల్లో సుమారుగా 6500 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయనున్నారు. వారికి బోధించే అంశాలపై ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. పాఠ్యాంశాల వారీగా ఏ రోజు ఏ పాఠ్యాంశం బోధించాలో, నిష్ణాతులైన ఉపాధ్యాయులతో మాదిరి ప్రశ్నపత్రాలను తయారు చేయించారు. పాఠశాలల్లో ప్రస్తుతం ఉదయం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. చదువులో వెనకబడిన విద్యా ర్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. గ్రూపులుగా విభజించి విద్యాబోధన సాగిస్తున్నారు. వందశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.
ఉత్తీర్ణత పెంచేలా..
రాష్ట్ర విద్యాశాఖఆదేశాల మేరకు విద్యార్థులకు విషయ పరి జ్ఞానాన్ని పెంపొందించేందుకు వర్క్‌బుక్ మోడల్ పేపర్స్ పంపిణీ, ప్రతి రోజు స్లిప్ టెస్టులు నిర్వహిస్తున్నారు. జనవరి1 నుంచి ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. పదవ తరగతి వార్షికపరీక్షలు మార్చిలో నిర్వహించేందుకు విద్యా శాఖ కసరత్తు చేస్తోంది.
ఆరు పేపర్ల విధానం..
పదవ తరగతి పరీక్షలు గతేడాది నుంచి ఆరు పేపర్ల విధానంలో కొనసాగుతున్నాయి. రెండు పేపర్లు ఉన్న స్థానంలో వందశాతం సెలబస్‌తో ఒకేపేపర్ తీసుకువచ్చారు. దీంతో ఈ ఏడాది కూడా ఆరు పేపర్ల విధానంలోనే పరీక్షలు జరుగనున్నాయి.
వందశాతం ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక దృష్టి..
-ఎం ఉదయ్‌బాబు, జిల్లా ఇన్‌చార్జ్ విద్యాధికారి
పదవ తరగతిలో వందశాతం ఫలితాలను సాధించేందుకు ప్రత్యేకదృష్టి సారిస్తున్నాం. విద్యార్థులకు ప్రత్యేకతరగతులు కొనసాగు తున్నాయి. విద్యార్థుల్లో సబ్జెక్టుల వారిగా విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గతేడాది కంటే ఈ ఏడాది మెరుగైన ఫలితాలను సాధించేందుకు ప్రయత్నిస్తున్నాం.
Updated Date - Dec 22 , 2023 | 11:33 PM