economic situation : ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం?
ABN, Publish Date - Dec 14 , 2023 | 03:42 AM
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలయిందంటున్న కాంగ్రెస్ సర్కారు..
అసెంబ్లీలో ప్రవేశపెట్టే యోచనలో సర్కారు
సీఎం రేవంత్ పవర్ పాయింట్ ప్రజంటేషన్
గతంలో కేసీఆర్ ఇరిగేషన్‌పై ఇచ్చినట్లుగానే..
బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపైనే దృష్టి
నేటి నుంచి శాసనసభ పునఃప్రారంభం
ప్రమాణ స్వీకారాలు, తదుపరి స్పీకర్ ఎన్నిక
ఇంకా ప్రమాణం చేయాల్సిన సభ్యులు 18
రేపు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం
16న ప్రసంగంపై చర్చ, సర్కారు జవాబు
17న శాసనసభ కొనసాగింపు?
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ?
హైదరాబాద్, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలయిందంటున్న కాంగ్రెస్ సర్కారు.. ఈ విషయాన్ని శాసనసభ వేదికగా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి శ్వేతపత్రాన్ని సిద్ధం చేసినట్లు, దీనిని అసెంబ్లీ సాక్షిగా విడుదల చేయనున్నట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక రంగం గతి తప్పిందని, ఆర్థిక క్రమశిక్షణ లోపించిందని కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా ఆరోపిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ ఖజానా వట్టిపోతున్న విషయాన్ని గుర్తించింది. కానీ, ఇప్పటికే ప్రజలకు ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ పార్టీ హామీలిచ్చినందున.. వీటిని అమలు చేయాలంటే ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టి, సాధ్యమైనన్ని వనరులను సమీకరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే గత ప్రభుత్వం చేసిన అప్పులు ఎన్ని? ప్రస్తుతం సమకూరుతున్న రాబడులు ఎలా ఉన్నాయి? వేటికి అధిక వ్యయాలు అవుతున్నాయి? వంటి వివరాలను ప్రభుత్వం వెల్లడించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర అప్పులతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన వ్యయం, తెచ్చిన అప్పులు, విద్యుత్తు సంస్థల రుణాలు, పౌరసరఫరాల సంస్థ అప్పులన్నింటినీ వివరించే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో రాష్ట్ర ఆర్థిక రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న భావనతో కాంగ్రెస్ సర్కారు ఉంది. ఈ మేరకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని సిద్ధం చేసిందని సమాచారం. శ్వేతపత్రం విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్తు శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే ప్రకటించారు. ఎలాగూ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నందున.. అసెంబ్లీలోనే దీనిని విడుదల చేసి, శాసనసభ్యులకు వివరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.
రూ.5.50 లక్షల కోట్ల అప్పు!
బీఆర్‌ఎస్ ప్రభుత్వం అత్యుత్సాహంతో అప్పులు చేసి, రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర అప్పులు రూ.5 లక్షల కోట్లను మించిపోయాయని చెబుతోంది. నిజానికి తెలంగాణ ఆవిర్భావం నాటికి రాష్ట్ర అప్పులు రూ.61,711 కోట్లుగా ఉన్నాయి. కానీ, బీఆర్‌ఎస్ సర్కారు ఏడాదికి సగటున రూ.40 వేల కోట్లు అప్పుగా తెచ్చిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర అప్పులు రూ.5.50 లక్షల కోట్ల వరకు ఉన్నాయంటూ భట్టి విక్రమార్క ఇటీవల వెల్లడించారు. కాగా, అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 వరకు కొనసాగవచ్చని, అదేరోజు సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తారని సమాచారం. శ్వేతపత్రంలో పేర్కొన్న అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి సభ్యుల దృష్టికి తెచ్చే అవకాశాలున్నాయి. 2016 మార్చిలో అప్పటి సీఎం కేసీఆర్ కూడా ఇలాగే సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అదే ‘మోడ్’లో తానూ ఇవ్వాలన్న ఉద్దేశంతో రేవంత్‌రెడ్డి సిద్ధమవుతున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపైనే ప్రధానంగా ఫోకస్ ఉంటుందని, ఆ అప్పుల కారణంగా రాష్ట్రం ఎంత దివాలా తీసిందన్న వివరాలను అంకెలతో సహా వివరిస్తారని సమాచారం.
నేటి నుంచి అసెంబ్లీ పునఃప్రారంభం
అసెంబ్లీ సమావేశాలు గురువారం (14న)న పునఃప్రారంభం కానున్నాయి. కొత్తగా ఎన్నికైన శాసన సభ్యుల ప్రమాణ స్వీకారం కోసం ఈ నెల 9న అసెంబ్లీ సమావేశమైన సంగతి తెలిసిందే. అదే రోజు 101 మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. ఇంకా 18 మంది ప్రమాణం చేయాల్సి ఉంది. వీరిలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌తోపాటు బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి ఉన్నారు. వీరు ముగ్గురు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయాల్సి ఉన్నందున..ప్రమాణం చేయలేదు. ఇక బీజేపీ ఎమ్మెల్యేలు ఎనిమిది మంది.. ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఉండడంతో తాము ప్రమాణ స్వీకారం చేయబోమంటూ దూరంగా ఉన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితర ఐదుగురు ఎమ్మెల్యేలు ప్రమాణం చేయాల్సి ఉంది. ఉదయం 10.50 గంటలకు సభ ప్రారంభం కాగానే... ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ వీరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నిక ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్ స్పీకర్ పదవి కోసం బుధవారం నామినేషన్ వేశారు. దీనికి బీఆర్‌ఎస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. ఈ దృష్ట్యా ఆయన ఎన్నిక ఏకగ్రీవం కావడం లాంఛనమే. ఈ ఎన్నిక పూర్తి కాగానే... సభ కొంత సేపు కొనసాగే అవకాశాలున్నాయి. కొత్త స్పీకర్‌గా ప్రసాద్‌కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బీజేపీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి.
గవర్నర్ ప్రసంగం...
స్పీకర్ ఎన్నిక, ప్రమాణ స్వీకారాలన్నీ ముగిసిన తర్వాత సభ శుక్రవారాని(15)కి వాయిదా పడుతుంది. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు గవర్నర్ తమిళిసై ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగంలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరించే అవకాశాలు లేకపోలేదు. గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే సభ వాయిదా పడుతుంది. 16న సభ సమావేశం కాగానే గవర్నర్ ప్రసంగంపై చర్చ జరుగుతుంది. ఇందులో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ సభ్యులకు మాట్లాడే అవకాశం కల్పిస్తారు. అనంతరం ప్రభుత్వం తరపున సీఎంగానీ, డిప్యూటీ సీఎంగానీ సమాధానం ఇస్తారు. అయితే.. ఈ సమావేశాలు 17 వరకు కొనసాగవచ్చని, ఆ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసి, సీఎం రేవంత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారని సమాచారం.
Updated Date - Dec 14 , 2023 | 03:42 AM