పెట్టుబడిదారులకు ఎర్రతివాచీ
ABN, Publish Date - Dec 22 , 2023 | 04:14 AM
రాష్ట్రంలో పెట్టుబడిదారులకు పూర్తి అనుకూల వాతావరణం కల్పిస్తామని టి పారుదల, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఎలాంటి సందేహాలూ అవసరం లేదని, తెలంగాణ ప్రభుత్వం తరఫున తమది హామీ అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేవారిని ప్రోత్సహిస్తాం..
ఆర్‌ఆర్‌ఆర్ సమీపంలో అభివృద్ధిపై దృష్టి ఇందుకే..!
ఆటా బిజినెస్ సమ్మిట్‌లో మంత్రి ఉత్తమ్
హైదరాబాద్ టిహబ్‌లో ఘనంగా ఆటా-సీఐఐ సదస్సు
ఉన్నత స్థాయికి అమెరికాలో తెలుగువారు
యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెట్టుబడిదారులకు పూర్తి అనుకూల వాతావరణం కల్పిస్తామని టి పారుదల, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఎలాంటి సందేహాలూ అవసరం లేదని, తెలంగాణ ప్రభుత్వం తరఫున తమది హామీ అని పేర్కొన్నారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) వేడుకల్లో భాగంగా భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)తో కలిసి గురువారం మాదాపూర్ టీ హబ్‌లో నిర్వహించిన సెమినార్‌కు ఉత్తమ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అమెరికా-తెలంగాణ మధ్య వర్తక, వాణిజ్యం పెంపునకు ఏర్పాటు చేసిన ఈ సదస్సులో హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మరో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉత్తమ్ మాట్లాడుతూ పెట్టుబడిదారులకు ఏ సమస్యలున్నా తీర్చే బాధ్యత తమదని అన్నారు. హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణలో ఎక్కడ పెట్టుబడులకు వచ్చినా ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానిస్తామన్నారు. అభివృద్ధిలో వ్యాపార, పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని కోరారు. హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలున్నాయని.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధికి బీజాలు పడ్డాయని చెప్పారు. వ్యాపారులు, స్టార్ట్‌పలు అడిగిన పలు ప్రశ్నలకు స్పందించిన మంత్రి హైదరాబాద్ తరహా తెలంగాణలో మరే ప్రాంతమూ అభివృద్ధి చెందలేదని అంగీకరించారు. రీజనల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) దగ్గర్లో అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించడం దీనిలో భాగమేనని పేర్కొన్నారు.
అమెరికా- భారత్ మధ్యన ముఖ్యంగా తెలంగాణతో చక్కటి సంబంధాలున్నాయని, వాటిని విస్తరించేందుకు కృషి చేస్తామన్నారు. జెన్నిఫర్ లార్సన్ మాట్లాడుతూ వీసా ప్రాసెసింగ్ కోసం అత్యధిక కౌంటర్లు హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశామన్నారు. స్పౌజ్ వీసాల ప్రాసెసింగ్‌ను ప్రారంభించే ప్రణాళికలేవీ లేవన్నారు. అమెరికాలో తెలుగు వారు ఎక్కువగా ఉన్నారని, వారంతా ఎంతో ఉన్నతంగా ఎదిగారని పేర్కొన్నారు. వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటా కార్యక్రమానికి హాజరు కావడం ఆనందంగా ఉందన్నారు. హైదరాబాద్, అమెరికా మధ్య సంధానకర్తగా ఆటా వ్యవహరించడం అభినందనీయమని కొనియాడారు. నగరానికి అమెరికా పెట్టుబడులు రావడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని మాట్లాడుతూ ఆటా వేడుకల్లో భాగంగా ఈ బిజినెస్ సెమినార్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇది తెలంగాణ, అమెరికా మధ్య సంబంధాలు మరింత పెంపొందించడానికి ఉపయోగపడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ 7, 8, 9న నిర్వహించే ఆటా మహాసభలకు అతిథిగా మంత్రి ఉత్తమ్‌ను ఆహ్వానించారు. సదస్సులో సీఐఐ తెలంగాణ అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, ఆటా వేడుకల చైర్, ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 22 , 2023 | 04:14 AM