స్టాఫ్‌నర్స్ పోస్టులు 7,094
ABN, Publish Date - Dec 17 , 2023 | 04:17 AM
: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న 5,204 స్టాఫ్‌నర్స్ పోస్టులకు అదనంగా 1,890 కలిపి మొత్తం 7,094 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అదనంగా 1,890 కలిపిన సర్కారు
గతేడాది 5,204 పోస్టులకు నోటిఫికేషన్
ముగిసిన పరీక్ష.. వారంలో ఫలితాలు?
హైదరాబాద్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న 5,204 స్టాఫ్‌నర్స్ పోస్టులకు అదనంగా 1,890 కలిపి మొత్తం 7,094 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖాళీల బ్రేకప్ వివరాలను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సెక్రటరీ గోపీకాంత్‌రెడ్డి శనివారం విడుదల చేశారు. నిజానికి గతేడాది డిసెంబరు 30న దవాఖానాల్లో ఖాళీగా ఉన్న 5,204 స్టాఫ్‌నర్స్ పోస్టుల భర్తీకి మెడికల్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే భర్తీ సమయానికి ఖాళీలు పెరిగితే ఆ పోస్టులకు నియామకాలు జరుపుతామని అందులో పేర్కొంది. ఇక ఈ ఏడాది ఆగస్టు 2న రాత పరీక్ష కూడా నిర్వహించింది. ఆ తర్వాత మరో 1,890 ఖాళీ పోస్టులను గుర్తించింది. వాటి భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం కూడా లభించింది. అయితే రాత పరీక్ష ముగిసి, ఫలితాలు ప్రకటించే సమయానికి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దాంతో ఫలితాల ప్రకటనను మెడికల్ బోర్డు వాయిదా వేసింది. అలాగే ప్రభుత్వం కూడా మారింది. రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్యశాఖపై సమీక్ష నిర్వహించారు. వారంలోపే ఫలితాలను ప్రకటించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదించిన 1,890 పోస్టులను కూడా పాత నోటిఫికేషన్‌లో కలపాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు మెడికల్ బోర్డు ఈ పోస్టులను కూడా కలిపింది. ఆ వివరాలను జోన్ వారీగా విడుదల చేసింది.
ఏ హెచ్‌వోడీ పరిధిలో ఎన్ని పోస్టులంటే?
మెడికల్ బోర్డు భర్తీ చేయనున్న పోస్టుల్లో సింహభాగం డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, వైద్య విద్య సంచాలకుల పరిఽధిలోనే ఉన్నాయి. ఆ రెండు విభాగాల పరిధిలోనే 5,650 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో జోన్-1లో 842, జోన్-2లో 875, మూడులో 829, నాలుగులో 884, ఐదులో 545, ఆరులో 888, ఏడులో 787 పోస్టులున్నాయని మెడికల్ బోర్డు వివరించింది. అలాగే తెలంగాణ వైద్యవిధాన పరిషత్ పరిఽధిలో 757, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి పరిధిలో 81, దివ్యాంగుల శాఖలో 8, తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఇన్‌స్టిట్యూషనల్ సోసైటీలో 127, బీసీ గురుకులాల్లో 260, ఎస్టీ గురుకులాల్లో 74, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 124, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషనల్ సోసైటీలో 13 పోస్టులున్నట్లు వెల్లడించింది.
Updated Date - Dec 17 , 2023 | 04:17 AM