రోడ్డు ప్రమాదంలో2 కుటుంబాలు ఛిద్రం
ABN, Publish Date - Dec 23 , 2023 | 03:27 AM
దైవ దర్శనానికి బయలుదేరిన వారి ప్రయాణం విషాదాంతమైంది. ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.
ఏడుగురితో వెళ్తున్న కారును ఢీకొన్న లారీ
ఐదుగురి మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఘటన
దైవ దర్శనానికి వెళుతుండగా విషాదం
ఎల్కతుర్తి/ఏటూరునాగారం రూరల్, డిసెంబరు 22: దైవ దర్శనానికి బయలుదేరిన వారి ప్రయాణం విషాదాంతమైంది. ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. కారులో ఉన్న ఏడుగురిలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు ఆస్పత్రిలో చనిపోయారు. మృతుల్లో భార్యాభర్తలు, వారి కూతురు.. మరో ఇద్దరు తండ్రీకొడుకులు ఉన్నారు. ఇద్దరు తీవ్ర గాయాలతో ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. హనుమకొండ జిల్లాలో ఈ విషాద ఘటన జరిగింది. రోడ్డు పనులు జరుగుతుండటం, దట్టమైన పొగమంచు ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఎల్కతుర్తి పోలీసుల వివరాల ప్రకారం.. ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన మంతెన కాంతయ్య (65), మంతెన శంకరాచారి (60) వరుసకు అన్నదమ్ములవుతారు. కాంతయ్యకు భార్య రేణుక, కుమార్తె రాధ చందన (16) ఉన్నారు. శంకరాచారికి భార్య శ్రీదేవి, కుమారులు భార్గవ్, భరత్ (29) ఉన్నారు. ఈ రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు కలిసి కారులో వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడానికి గురువారం రాత్రి ఇంటి నుంచి బయలుదేరారు. శంకరాచారి కుమారుడు, అయ్యప్పమాల ధరించిన భరత్ కారు నడిపాడు. అర్ధరాత్రి దాటాక రెండు గంటలకు వీరు ప్రయాణిస్తున్న కారు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్‌పేట గ్రామ శివారు వద్ద ప్రమాదానికి గురైంది.
కారును ఎదురుగా వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయి రోడ్డు కిందికి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో కాంతయ్య, ఆయన కూతురు రాధ చందన, శంకరాచారి, ఆయన చిన్నకుమారుడు భరత్ తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందారు. కాంతయ్య భార్య రేణుక, శంకరాచారి భార్య శ్రీదేవి, ఆయన పెద్ద కుమారుడు భార్గవ్ తీవ్ర గాయాలతో కారులో ఇరుక్కుపోయి బయటకు తీయాలంటూ హాహాకారాలు చేశారు. అనంతరం ముగ్గురినీ ఆంబులెన్స్‌లో చికిత్స కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. రేణుక చికిత్స పొందుతూ చనిపోయింది. భార్గవ్, శ్రీదేవిని వరంగల్‌లోనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. అక్కడ బంధువుల రోదనలు మిన్నంటాయి. ప్రమాద ఘటన పట్ల మంత్రి సీతక్క దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు. రెండు కుటుంబాల్లో కొందరు మృతిచెందడం.. మిగిలినవారు తీవ్ర గాయాలతో చావుబతుకుల్లో ఉండటంతో అంత్యక్రియల బాధ్యతను గ్రామస్థులు భుజానెత్తుకున్నారు. అంత్యక్రియలకు తమకుతాముగా ముందుకొచ్చి రూ.30వేలు పోగేశారు.
Updated Date - Dec 23 , 2023 | 03:27 AM