రూ.400 కోట్లతో 1,060 డీజిల్ బస్సులు
ABN, Publish Date - Dec 30 , 2023 | 03:09 AM
ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24)లో రూ.400 కోట్లతో 1,060 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని టీఎ్‌సఆర్టీసీ నిర్ణయించింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో కొనుగోలుకు ఆర్టీసీ నిర్ణయం
వీటిలో 400 ఎక్స్‌ప్రెస్, 512 పల్లెవెలుగు బస్సులు
నేడు 80 కొత్త బస్సులు ప్రారంభించనున్న మంత్రి పొన్నం
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24)లో రూ.400 కోట్లతో 1,060 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని టీఎ్‌సఆర్టీసీ నిర్ణయించింది. వీటిలో 400 ఎక్స్‌ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయి. వీటితోపాటు హైదరాబాద్‌లో 540, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు 500 పర్యావరణహిత ఎలక్ర్టిక్ వాహనాలను అందుబాటులోకి తెస్తోంది. ఈ బస్సులన్నీ విడతల వారీగా మార్చి నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేలా సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుక్రవారం ట్వీట్ చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల బస్సులు కిక్కిరిసిపోతున్న నేపథ్యంలో.. రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను సంస్థ వినియోగించుకోనుంది.
నేడు రోడ్లపైకి 80 కొత్త బస్సులు...
ప్రయాణికుల కోసం ఆర్టీసీ 80 కొత్త బస్సులను అందుబాటులోకి తెస్తోంది. ఈ బస్సుల్లో 30 ఎక్స్‌ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్(నాన్ ఏసీ) ఉన్నాయి. ఈ బస్సులను హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లో ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం ఉదయం 10 గంటలకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు.
Updated Date - Dec 30 , 2023 | 03:09 AM