WhatsApp: జనవరిలో వాట్సాప్ ఇంత పనిచేసిందా?
ABN, First Publish Date - 2023-03-02T19:40:30+05:30
గ్లోబల్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ (WhatsApp) భారత యూజర్లకు గట్టి షాకిచ్చింది.
న్యూఢిల్లీ: గ్లోబల్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ (WhatsApp) భారత యూజర్లకు గట్టి షాకిచ్చింది. జనవరిలో ఏకంగా 29 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించింది. గతేడాది డిసెంబరులో బ్లాక్ చేసిన ఖాతాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ కావడం గమనార్హం. ఆ నెలలో వాట్సాప్ 36.77 లక్షల ఖతాలను బ్లాక్ చేసింది. 2021 ఐటీ చట్టాలకు అనుగుణంగానే వాట్సాప్ ఈ నిర్ణయం తీసుకుంది.
జనవరి 1-31 మధ్య వాట్సాప్ 29,18,000 ఖాతాలను నిషేధించింది. యూజర్ల(WhatsApp Users) నుంచి ఎలాంటి ఫిర్యాదులకు రాకుండానే వీటిలో 10,38,000 ఖాతాలపై నిషేధం విధించినట్టు వాట్సాప్ తన నెలవారీ కాంప్లియెన్స్ నివేదికలో పేర్కొంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్ 2021లోని రూల్ 4(1)(డి) ప్రకారం ఈ ఖాతాలను నిషేధించినట్టు తెలిపింది.
దేశంలో 500 మిలియన్ యూజర్లను కలిగిన వాట్సాప్ జనవరిలో మొత్తం 1,461 ఫిర్యాదులు అందుకుంది. వీటిలో ఖాతాలను బ్యాన్ చేయాలంటూ 1337 అభ్యర్థులు వచ్చాయి. అయితే, వాట్సాప్ మాత్రం 191 ఖాతాలపై మాత్రమే చర్యలు తీసుకుంది. అలాగే, భద్రతకు సంబంధించి ఏడు అభ్యర్థనలు రాగా వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
డిసెంబరులో 1,607 ఫిర్యాదులు వచ్చాయని, వాటిలో 166 ఖాతాలపై చర్యలు తీసుకున్నట్టు వివరించింది. మిలియన్ల మంది ఖాతాదారులకు సాధికారత కల్పించే ప్రయత్నంలో భాగంగా కంటెంట్, ఇతర సమస్యలకు సంబంధించి వారి ఆందోళనను పరిశీలించేందుకు ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మంగళవారం గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ (GAC)ని ప్రారంభించారు. ఈ ప్యానెల్ దేశంలోని డిజిటల్ చట్టాలను మరింత పటిష్ఠం చేసేందుకు కృషి చేస్తుంది.
Updated Date - 2023-03-02T19:54:39+05:30 IST