Won.. stood : గెలిచి.. నిలిచారు
ABN, First Publish Date - 2023-11-10T02:42:40+05:30
వరుసగా నాలుగు విజయాలతో సెమీస్ వైపు వేగంగా దూసుకెళ్లిన కివీస్.. ఆ తర్వాత వరుసగా నాలుగు ఓటములతో తమ అవకాశాలను ప్రమాదంలో పడేసుకుంది...
రాణించిన బౌలర్లు
కివీస్ ఘనవిజయం
బెంగళూరు: వరుసగా నాలుగు విజయాలతో సెమీస్ వైపు వేగంగా దూసుకెళ్లిన కివీస్.. ఆ తర్వాత వరుసగా నాలుగు ఓటములతో తమ అవకాశాలను ప్రమాదంలో పడేసుకుంది. ఈ దశలో వీరి ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిన పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు సరైన సమయంలో ఆల్‌రౌండ్‌షో కనబర్చి స్థాయికి తగ్గ ప్రదర్శనతో అదరగొట్టింది. బౌలర్లు అద్భుతంగా రాణించడంతో గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కివీస్ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అలాగే 10 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి, మెరుగైన రన్‌రేట్‌తో సెమీస్ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంది. ఈ రిజల్ట్‌తో అఫ్ఘానిస్థాన్ దాదాపుగా నిష్క్రమించినట్టే. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 46.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. కుశాల్ పెరీర (28 బంతుల్లో 51), తీక్షణ (38 నాటౌట్) మాత్రమే రాణించారు. పేసర్ బౌల్ట్‌కు మూడు.. రచిన్, శాంట్నర్, ఫెర్గూసన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత స్పల్ప ఛేదనలో కివీస్ 23.2 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసి గెలిచింది. కాన్వే (45), రచిన్ రవీంద్ర (42), మిచెల్ (43) వేగంగా ఆడారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా బౌల్ట్ నిలిచాడు. స్వల్ప ఛేదనను కివీస్ ధాటిగా ఆరంభించి అవలీలగా ముగించింది. వర్షాన్ని, రన్‌రేట్‌ను దృష్టిలో ఉంచుకుని ఓపెనర్లు కాన్వే, రచిన్ చెలరేగి తొలి వికెట్‌కు 86 పరుగులు జోడించారు. అయితే వరుస ఓవర్లలో వీరు వెనుదిరిగినా కివీస్ ఇబ్బందిపడలేదు. మిచెల్ మరింత జోరు కనబర్చి విజయాన్ని ఖరారు చేశాడు.
బౌలర్ల హవా: ఓవైపు పేసర్ బౌల్ట్.. మరోవైపు స్పిన్నర్ శాంట్నర్‌ల ధాటికి శ్రీలంక బ్యాటర్లు కుదేలైపోయారు. దీంతో జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమైంది. కానీ 23.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయినా.. చివర్లో తీక్షణ-మధుశంక జోడీ కివీస్ బౌలర్లను విసిగిస్తూ మ్యాచ్‌ను 46.4 ఓవర్ల వరకు తీసుకెళ్లడంతో ఆ మాత్రం పరుగులైనా వచ్చాయి. ఓ దశలో 150 కూడా అసాధ్యమే అనిపించింది.
స్కోరుబోర్డు
శ్రీలంక: నిస్సాంక (సి) లాథమ్ (బి) సౌథీ 2; కుశాల్ పెరీర (సి) శాంట్నర్ (బి) ఫెర్గూసన్ 51; కుశాల్ మెండిస్ (సి) రచిన్ (బి) బౌల్ట్ 6; సమరవిక్రమ (సి) మిచెల్ (బి) బౌల్ట్ 1; అసలంక (ఎల్బీ) బౌల్ట్ 8; మాథ్యూస్ (సి) మిచెల్ (బి) శాంట్నర్ 16; ధనంజయ (సి) మిచెల్ (బి) శాంట్నర్ 19; కరుణరత్నె (సి) లాథమ్ (బి) ఫెర్గూసన్ 6; తీక్షణ (నాటౌట్) 38; చమీర (సి) బౌల్ట్ (బి) రచిన్ 1; మధుశంక (సి) లాథమ్ (బి) రచిన్ 19; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 46.4 ఓవర్లలో 171 ఆలౌట్. వికెట్ల పతనం: 1-3, 2-30, 3-32, 4-70, 5-70, 6-104, 7-105, 8-113, 9-128, 10-171. బౌలింగ్: బౌల్ట్ 10-3-37-3; సౌథీ 8-0-52-1; ఫెర్గూసన్ 10-2-35-2; శాంట్నర్ 10-2-22-2; రచిన్ 7.4-0-21-2; ఫిలిప్స్ 1-0-3-0.
కివీస్: కాన్వే (సి) ధనంజయ (బి) చమీర 45; రచిన్ (సి) ధనంజయ (బి) తీక్షణ 42; విలియమ్సన్ (బి) మాథ్యూస్ 14; మిచెల్ (సి) అసలంక (బి) మాథ్యూస్ 43; చాప్‌మన్ (రనౌట్) 7; ఫిలిప్స్ (నాటౌట్) 17; లాథమ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 23.2 ఓవర్లలో 172/5. వికెట్ల పతనం: 1-86, 2-88, 3-130, 4-145, 5-162. బౌలింగ్: మధుశంక 6.2-0-58-0; తీక్షణ 7-0-43-1; ధనంజయ 2-0-22-0; చమీర 4-1-20-1; మాథ్యూస్ 4-0-29-2.
రచిన్ అరంగేట్ర రికార్డు
వన్డే ప్రపంచకప్ అరంగేట్రంలోనే అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా కివీస్ ఓపెనర్ రచిన్ రవీంద్ర రికార్డు సృష్టించాడు. తాజా టోర్నీలో 23 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండర్ 565 రన్స్ సాధించాడు. గతంలో ఈ రికార్డు బెయిర్‌స్టో (532) పేరిట ఉండేది.
తొలి బౌలర్ బౌల్ట్
వన్డే వరల్డ్‌క్‌పల్లో 50 వికెట్లు తీసిన తొలి కివీస్ బౌలర్‌గా ట్రెంట్ బౌల్ట్ నిలిచాడు. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో కివీస్ తరఫున 600కు పైగా వికెట్లు తీసిన మూడో బౌలర్ అయ్యాడు. సౌథీ (732), వెటోరి (705) ముందున్నారు.
పాయింట్ల పట్టిక
జట్లు ఆ గె ఓ ఫ.తే పా ర.రే.
భారత్ 8 8 0 0 16 2.456
దక్షిణాఫ్రికా 8 6 2 0 12 1.376
ఆస్ట్రేలియా 8 6 2 0 12 0.861
న్యూజిలాండ్ 9 5 4 0 10 0.743
పాకిస్థాన్ 8 4 4 0 8 0.036
అఫ్ఘానిస్థాన్ 8 4 4 0 8 -0.338
ఇంగ్లండ్ 8 2 6 0 4 -0.885
బంగ్లాదేశ్ 8 2 6 0 4 -1.142
శ్రీలంక 9 2 7 0 4 -1.419
నెదర్లాండ్స్ 8 2 6 0 4 -1.635
గమనిక: ఆ- ఆడినవి; గె- గెల్చినవి; ఓ-ఓడినవి; ఫ.తే- ఫలితం తేలనివి; పా-పాయింట్లు; ర.రే-రన్‌రేట్
పాక్, అఫ్ఘాన్ ఇంటికే ?
కివీస్ నాలుగో బెర్త్‌ను దాదాపుగా ఖాయం చేసుకొంది. న్యూజిలాండ్ నెట్ రన్‌రేట్‌ను అధిగమించాలంటే తమ చివరి లీగ్ మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ అద్భుతం చేయాల్సి ఉండగా.. అఫ్ఘాన్ దారులు మూసుకుపోయినట్టే. ఆడిన 8 మ్యాచ్‌ల్లో 4 గెలిచిన పాక్ నెట్ రన్‌రేట్ 0.036 మాత్రమే. ఒక వేళ పాక్ తొలుత బ్యాటింగ్‌చేసి 300 రన్స్ చేస్తే.. ఇంగ్లండ్‌ను 13 పరుగులకే ఆలౌట్ చేయాలి. అంటే పాక్ 287 రన్స్ తేడాతో గెలవాలన్నమాట. ఒకవేళ ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్‌చేసి 50 పరుగులు చేస్తే...పాక్ దాన్ని 2.3 ఓవర్లలో ఛేదించాలి. ఇక అఫ్ఘాన్ జట్టు కివీస్, పాక్‌తో పోల్చితే రన్‌రేట్ విషయంలో ఎంతో వెనుకబడింది. ప్రస్తుతం అఫ్ఘాన్ నెట్ రన్‌రేట్ -0.338. సెమీస్ చేరాలంటే సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో అఫ్ఘాన్ సఫారీలపై 439 పరుగుల తేడాతో నెగ్గితేనే నాకౌట్ చాన్స్ దక్కుతుంది. ఇది దాదాపు అసాధ్యం కాబట్టి.. అఫ్ఘాన్ కథ ముగిసినట్టే..!
వరల్డ్‌కప్‌లో నేటి మ్యాచ్
దక్షిణాఫ్రికా X అఫ్ఘానిస్థాన్
(మ.2.గం -అహ్మదాబాద్)
Updated Date - 2023-11-10T02:42:42+05:30 IST