బ్రిజ్‌భూషణ్ అనుచరుడికే భారత రెజ్లింగ్ పగ్గాలు
ABN, Publish Date - Dec 22 , 2023 | 04:28 AM
ఎంతో కాలంగా వాయిదా పడుతూ వచ్చిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎ్‌ఫఐ) ఎన్నికలు ఎట్టకేలకు గురువారం జరిగాయి. ఈ ఎన్నికల్లో మాజీ చీఫ్, మహిళా రెజ్లర్లపై లైంగిక ఆరోపణలతో పదవిని కోల్పోయిన...
డబ్ల్యూఎ్‌ఫఐ చీఫ్‌గా సంజయ్ సింగ్
15 పదవుల్లో 13 ఆ వర్గానివే
సంయుక్త కార్యదర్శిగా పురుషోత్తం
న్యూఢిల్లీ: ఎంతో కాలంగా వాయిదా పడుతూ వచ్చిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎ్‌ఫఐ) ఎన్నికలు ఎట్టకేలకు గురువారం జరిగాయి. ఈ ఎన్నికల్లో మాజీ చీఫ్, మహిళా రెజ్లర్లపై లైంగిక ఆరోపణలతో పదవిని కోల్పోయిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అనుంగు అనుచరుడు సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. మొత్తం 15 పదవులకు ఎన్నికలు జరగ్గా..13 పోస్టులను సంజయ్ సింగ్ వర్గం గెలుచుకోవడం గమనార్హం. సంజయ్ సింగ్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ సంఘం ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్నాడు. వారణాసికి చెందిన అతడు.. రెజ్లర్, 2010 కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత అనితా షెరాన్‌తో డబ్ల్యూఎ్‌ఫఐ చీఫ్ పదవికి పోటీపడ్డాడు. సంజయ్‌కు 40 ఓట్లు రాగా, అనితకు ఏడు ఓట్లే పోలయ్యాయి. అయితే, అనిత వర్గం కీలకమైన సెక్రటరీ జనరల్ పదవిని దక్కించుకుంది. ఆమె ప్యానెల్ అభ్యర్థి ప్రేమ్‌చంద్ లోచబ్ 27-19 ఓట్ల తేడాతో దర్శన్‌లాల్‌ను ఓడించాడు. బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన రెజ్లర్లకు సన్నిహితుడైన దేవేందర్ సింగ్ కడియన్ సీనియర్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 4 ఉపాధ్యక్ష పదవులకు సంజయ్ వర్గానికి చెందిన జై ప్రకాశ్, అసిత్ కుమార్, కర్తార్ సింగ్, పోనీ ఎన్నికయ్యారు. బ్రిజ్‌భూషణ్ వర్గానికే చెందిన సత్యపాల్ సింగ్ కోశాధికారిగా గెలిచాడు. సంయుక్త కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు పురుషోత్తం ఎన్నికయ్యాడు. మరో సంయుక్త కార్యదర్శిగా గుణరంజన్ గెలిచాడు. ఐదుగురు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు కూడా బ్రిజ్‌భూషణ్ వర్గానికి చెందిన వారే ఎన్నికయ్యారు. మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మోహన్ యాదవ్ ఉపాధ్యక్షుడిగా పోటీ చేశారు. అయితే, ఆయనకు ఐదు ఓట్లే వచ్చాయి.
నా సత్తా చూశారా..!
‘నేనే విజయం సాధించా..మున్ముందూ గెలుస్తాను కూడా’ ఇదీ..సంజయ్ సింగ్ విజయం అనంతరం బ్రిజ్‌భూషణ్ స్పందన. తాను బరిలో లేకపోయినా, తన సత్తా ఏమిటో తెలిసిందా..అన్న కోణంలో అతడు మాట్లాడాడు. సంజయ్ సింగ్ కచ్చితంగా తన ముఖ్య అనుచరుడేనని తేల్చి చెప్పాడు. ‘భారత్ రెజ్లింగ్‌కు 11 నెలలకు పట్టిన గ్రహణం వీడింది’ అని వ్యాఖ్యానించాడు. నిరసన తెలిపిన రెజ్లర్లపై కక్ష సాధింపు చర్యలు ఉండబోవని హామీ ఇచ్చాడు. ‘రెజ్లర్లందరికీ డబ్ల్యూఎ్‌ఫఐ మద్దతుగా ఉంటుంది. ఎవరిపట్లా పక్షపాతం ఉండబోదు. 2023 జనవరిలో కొత్త, పాత రెజ్లర్లు ఎందరో నిరసనలో పాల్గొన్నారు. వారిలో ఎవరిపైనా కక్ష సాధింపులు ఉండవు’ అని బ్రిజ్‌భూషణ్ చెప్పాడు.
సమాఖ్యపై నిషేధం ఎత్తివేత?
సమాఖ్య ఎన్నికలు పూర్తవడంతో..డబ్ల్యూఎఫ్‌ఐపై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (డబ్ల్యూడబ్ల్యూయూ) విధించిన నిషేధం తొలగిపోయేందుకు మార్గం సుగమమైంది. ఎన్నికలు నిర్వహించకపోవడంతో డబ్ల్యూఎ్‌ఫఐపై గత ఆగస్టులో యునైటెడ్ రెజ్లింగ్ నిషేఽధం విధించిన సంగతి తెలిసిందే. దాంతో 2023 ప్రపంచ చాంపియన్‌షి్‌పలో భారత రెజ్లర్లు తటస్థ అథ్లెట్లుగా తలపడాల్సిన దుస్థితి ఏర్పడింది.
మాజీ చీఫ్ ప్రభావం ఉంటుందా?
నిర్మాణ రంగ వ్యాపారంలో ఉన్న సంజయ్ సింగ్‌కు ఆర్‌ఎ్‌సఎ్‌సతో అనుబంధం ఉంది. బ్రిజ్‌భూషణ్‌కు ప్రధాన అనుచరుడు కావడంతో భవిష్యత్‌లో సమాఖ్య నిర్ణయాలను మాజీ అధ్యక్షుడు తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదని రెజ్లింగ్ వర్గాలు అంటున్నాయి. ‘గత ఏడెనిమిది నెలలుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న దేశంలోని వేలాదిమంది రెజ్లర్ల విజయమిది’ అని ఎన్నిక అనంతరం సంజయ్ సింగ్ వ్యాఖ్యానించాడు. సమాఖ్యలో రాజకీయ జోక్యంపై అడిగిన ప్రశ్నకు అతడు..‘రాజకీయాలకు రాజకీయాలతో..రెజ్లింగ్‌కు రెజ్లింగ్‌తో బదులిస్తాం’ అని బదులిచ్చాడు.
Updated Date - Dec 22 , 2023 | 04:28 AM