వండర్ మాల్
ABN, Publish Date - Dec 17 , 2023 | 12:52 PM
వందల కొద్దీ దుకాణ సముదాయాలు, థియేటర్లు, ఫుడ్ కోర్టులు, ఎంటర్ టైన్‌మెంట్...
వందల కొద్దీ దుకాణ సముదాయాలు, థియేటర్లు, ఫుడ్ కోర్టులు, ఎంటర్ టైన్‌మెంట్... ఇలా ఒక్కచోటే అన్నీ కొలువుదీరి ఉండే మాల్స్ సంస్కృతి నగరాల్లోనే కాదు... పట్టణాల్లో కూడా విస్తరిస్తోంది. పలు దేశాలకు చెందిన నగరాల్లో ఏర్పాటవుతున్న అతి పెద్ద మాల్స్ అద్భుతమైన షాపింగ్ అనుభూతిని అందిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్‌లో ఉన్న ‘ఇరాన్ మాల్’ ప్రపంచంలోనే అతి పెద్ద షాపింగ్ మాల్‌గా పేరొందింది. రిటైల్ వండర్‌ల్యాండ్‌గా పిలుస్తోన్న ఈ మాల్ విశేషాలివి...
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఉన్న ఇరాన్ మాల్ ప్రపంచంలోనే అతి పెద్ద షాపింగ్ మాల్‌గా గుర్తింపు పొందింది. దాదాపు 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పర్షియన్ సంస్కృతి ఉట్టిపడేలా నిర్మించిన ఈ మాల్‌లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఫ్యాషన్ ఎవెన్యూ, డైమండ్ ఆర్టియం, క్రిస్టల్ ఆర్టియం, బుక్ గార్డెన్ వంటివి విశేషంగా ఆకట్టుకుంటాయి.
2014 నుంచి 1200 మంది కాంట్రాక్టర్లు, 25 వేల మంది వర్కర్లు 24 గంటలు పనిచేస్తే 2018 కల్లా ఈ షాపింగ్‌మాల్ నిర్మాణం పూర్తయింది. మే నెలలో 708 దుకాణ సముదాయాలు ప్రారంభోత్సవం జరుపుకొన్నాయి. ఇందులో అనేక జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌ల షాపులున్నాయి.
6 రోజుల పాటు ఏకధాటిగా కాంక్రీట్ పని జరిగిన నిర్మాణంగా ఈ మాల్ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది.
ఈ మాల్‌లో 12 ఐమ్యాక్స్ థియేటర్లు ఉన్నాయి. 2 వేల మంది కూర్చునే సామర్థ్యం ఉన్న ఆర్ట్ థియేటర్ హాల్ ఉంది. సైట్ మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీలు సందర్శకులను ఆకట్టుకుంటాయి.
ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్‌కు కొదవలేదు. అమ్యూజ్‌మెంట్ పార్క్, రూఫ్‌టాప్ టెన్నిస్ కోర్టులు, కన్వెన్షన్ సెంటర్, స్విమ్మింగ్‌పూల్స్, హోటల్, కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ సెంటర్, 5 స్టార్ హోటల్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి.
ఇరాన్‌మాల్‌లో మరో ప్రత్యేక ఆకర్షణ మిర్రర్ హాల్. ఇరాన్‌లోని అత్యుత్తమ కళాకారులు 3 కోట్ల 80 లక్షల అద్దాలను ఉపయోగించి ఈ మిర్రర్ హాల్‌ను నిర్మించారు.
అతి పెద్ద షాపింగ్ మాల్‌లో పార్కింగ్ సదుపాయం కూడా విశాలమైనదే! ఇక్కడ 20 వేల కార్లను పార్క్ చేయొచ్చు.
టాబ్రిజ్ మార్కెట్, ఇస్ఫాహన్, షిరాజ్ మార్కెట్ల స్ఫూర్తితో ఈ మాల్‌లో ట్రెడిషనల్ బజార్‌ను నిర్మించారు. పామ్ ట్రీలు, వాటర్ ఫౌంటెన్లతో కనువిందు చేసేలా ఉంటుంది. అతిపెద్ద ఇండోర్ ఐస్ రింక్ అదనపు ఆకర్షణ.
ఈ మాల్‌లో చూడదగిన మరో ప్రదేశం జోడిషాపూర్ లైబ్రరీ. ఇందులో 45 వేలకు పైగా పుస్తకాలు, రాతప్రతులు, డాక్యుమెంట్లు ఉన్నాయి.
Updated Date - Dec 17 , 2023 | 01:07 PM