ప్రకృతి వరం.. సీతాఫలం
ABN, First Publish Date - 2023-12-10T13:52:40+05:30
ఈ సీజన్ వస్తేచాలు.. రోడ్ల పక్కన గంపల్లో నిండుగా పెట్టుకుని సీతాఫలాలు అమ్మే మహిళలు కనిపిస్తారు.....
ఈ సీజన్ వస్తేచాలు.. రోడ్ల పక్కన గంపల్లో నిండుగా పెట్టుకుని సీతాఫలాలు అమ్మే మహిళలు కనిపిస్తారు. కొందరైతే వాటిని చూడగానే వాహనాలు ఆపేసి మరీ కొనుగోలు చేస్తుంటారు. సీతాఫలాలను అమితంగా ఇష్టపడేవాళ్లు ఎక్కువ. మనం ఏళ్ల తరబడి ఈ పండును తింటున్నా ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి.. అవేంటో చూద్దాం.. ఆ ఫలంలోని పోషకాల గురించి కూడా తెలుసుకుందాం..
సీతాఫలం తింటే కడుపుబ్బరం చేస్తుందా..
అలాగేం ఉండదు. కడుపుబ్బరం అనేది కేవలం అపోహ. ఇందులో బి కాంప్లెక్స్‌తో పాటు విటమిన్ బి6 అధికం. నిజానికి ఇలాంటి విటమిన్లు కడుపుబ్బరాన్ని తగ్గిస్తాయి.
గుండె జబ్బులు ఉన్న వాళ్లు తినొచ్చా..
కచ్చితంగా తినొచ్చు. సీతాఫలంలో మాంగనీసుతో పాటు విటమిన్ సి లభిస్తుంది. ఇవన్నీ గుండె ఆరోగ్యానికి మేలు చేసేవే!. రక్తప్రసరణ సాఫీగా సాగేందుకు ఇవన్నీ ఔషధాలుగా పనిచేస్తాయి.
తినగానే కడుపునొప్పి వస్తుందన్నది నిజమా..
అది నిజం కాదు. వాస్తవానికి ఈ పండులో అత్యధికంగా పీచుపదార్థం ఉంటుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరిచి, మలబద్దకాన్ని తగ్గిస్తుంది. పేవుల్లోని మలినాలను శుభ్రం చేస్తుంది.
మధుమేహంతో బాధపడేవాళ్లు తినొచ్చా..
పరిమితంగా తినొచ్చు. ఇది ఆయా సీజన్లలో కొన్ని ప్రాంతాల్లో పండే పంట. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. అంటే అంత వేగంగా జీర్ణం కాని పండు అన్నమాట. కాబట్టి మధుమేహం ఉన్నవాళ్లు కూడా సీతాఫలాన్ని తినొచ్చు.
పిల్లలు తినడానికి ఇష్టపడరు..
చిన్నపిల్లలు సీతాఫలాన్ని నేరుగా తినడానికి ఇష్టపడరు కానీ దాంతో చేసిన రకరకాల పదార్థాలను మాత్రం ఇష్టంగా తింటారు. సీతాఫలం గుజ్జుతో చేసిన మిల్క్‌షేక్‌లు, స్మూతీలు, ఐస్‌క్రీమ్, ఫిర్నీ, హల్వా, మిఠాయిలు.. ఇలా రకరకాల రూపాల్లో తినొచ్చు. సీతాఫలంలో సూక్ష్మపోషకాలు అధికం. వాపును తగ్గించే గుణాలు మెండు. గుండె, క్యాన్సర్‌వంటి మొండి వ్యాధుల కారకాలను అడ్డుకుంటాయి. చర్మసౌందర్యం, మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా..
సీతాఫలంలో పాస్ఫరస్‌తోపాటు విటమిన్ కె కూడా ఉంటుంది. ఎముకలు ధృడంగా మారడానికి, ఆస్టియోపొరోసిస్ రాకుండా అడ్డుకుంటాయవి.
మూడ్‌ను మార్చేసే గుణాలు ఉన్నాయంటారు..
నేటి ఉద్యోగాలు ఒత్తిళ్లతో కూడుకున్నవి. ఫలితంగా భావోద్వేగాల్లో అసమతుల్యత ఏర్పడుతున్నది. మెదడుకు కావాల్సిన తిండి తినక పోవడం కూడా అందుకు కారణం. ఎక్కువమందిలో విటమిన్ బీ6 లోపం తలెత్తుతోంది. దీనివల్ల నాడీసంబంధిత రుగ్మతలు పెరుగుతున్నాయి. సీతాఫలాల్లోని బీ6 ఈ లోపాన్ని సరిచేస్తుంది. సెరొటోనిన్, డొపమైన్‌ల విడుదలకు ఉపకరిస్తుంది. తద్వారా నాడీవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మానసిక స్థితిని ప్రశాంతంగా ఉంచుతుంది.
అధిక రక్తపోటును నియంత్రిస్తుందా..
బీపీని అదుపులో పెట్టడానికి సీతాఫలం ఎంతో ఉపకరిస్తుంది. ఈ పండులోని పొటాషియం, మెగ్నీషియం అధికరక్తపోటును నియంత్రిస్తాయి.
సీతాఫలం పోషకాల ఘని. వంద గ్రాములు మాగిన పండు తింటే 94 క్యాలరీలు లభిస్తాయి. కార్బొహైడ్రేట్స్ ఎక్కువ, ప్రొటీన్‌లు తక్కువ.
ఆపిల్‌తో పోలిస్తే కస్టర్డ్‌ఆపిల్ (సీతాఫలం)లోనే విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియం, ఐరన్, విటమిన్ బి2, విటమిన్ బి1 ఉంటాయి.
ఆపిల్‌లో కంటే సీతాఫలంలో ఆరు రెట్లు ఎక్కువ ఐరన్ ఉంటుంది.
ఆపిల్‌లో కేవలం పది గ్రాముల పొటాషియం ఉంటే, సీతాఫలంలో 34 శాతం ఉంది.
సీతాఫలాలను భారతీయులు చాలా ఇష్టపడతారు. ప్రత్యేకించి ఈ సీజన్ కోసం ఎదురుచూసేవాళ్లు ఎందరో. పురాణాల్లో కూడా ఈ ఫలాల ప్రస్తావన ఉంది. రకాలను బట్టి సీతా, రామ, లక్ష్మణ ఫలాలు అన్న పేర్లు ఉన్నాయి.
సీతాఫలాలను మనకు పరిచయం చేసింది పోర్చుగీసువాళ్లు. ద.అమెరికా, ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో మొదట పండినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పదహారో శతాబ్దం నాడు భారత్ చేరింది సీతాఫలం.
తమిళనాడు, కర్నాటక, తెలంగాణ, ఆంధ్ర, చత్తీస్‌గడ్‌లలో సీతాఫలాలు ఎక్కువగా పండుతాయి. అడవుల్లో సహజంగా పెరిగే పండ్లను అమ్ముకుని వేలమంది పేదలు, గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు హైబ్రిడ్ పండ్ల సాగు పెరిగింది.
Updated Date - 2023-12-10T13:52:41+05:30 IST