Nihang Sikhs:165 ఏళ్ల నాటి ఘటన..అయోధ్య రామమందిర ఉద్యమానికి బీజం ఇదే! చాలా తక్కువ మందికి తెలిసిన చరిత్ర!
ABN, Publish Date - Dec 22 , 2023 | 06:35 PM
అయోధ్య రామమందిరానికి సంబంధించి చాలా తక్కువ మందికి తెలిసిన చరిత్ర ఇది.
ఇంటర్నెట్ డెస్క్: మరి కొన్ని రోజుల్లో అయోధ్యలో శ్రీరామ మందిరం (Sri Ram Mandir, Ayodhya) ఆవిష్కృతం కానుంది. అయోధ్యలో కొలువుదీరిన సీతారామలక్ష్మణులను దర్శించుకునే క్షణం కోసం యావత్ దేశం కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తోంది. ఈ కల వెనకున్న చాలామటుకు చరిత్ర నేటి తరానికి తెలుసు. ముఖ్యంగా 1980ల తరువాత జరిగిన పరిణామాలు, సుప్రీంకోర్టు అనుకూల తీర్పులపై యువతరానికి అవగాహన ఉంది. కానీ, ఈ పరిణామాలకు బీజం165 ఏళ్ల క్రితం ఓ నిహంగ్ సిక్కు పెద్ద సాహసోపేత చర్య ఉందన్న విషయం మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు.
ఇది 1858 నాటి మాట. అప్పట్లో బాబ్రీ మసీదు ఔధ్ (ఇప్పటి అయోధ్య, పరిసర ప్రాంతాలకు ఔధ్ అని పేరు) రాజ్యంలో ఉండేది. ఆ సమయంలో నిహంగ్ ఖల్సా సిక్కు వర్గానికి చెందిన బాబా ఫకీర్ సింగ్ ఖల్సా ఓ రోజు బాబ్రీ మసీదులోకి వెళ్లి ఏకంగా హవన్ (హిందూ మతపరమైన కార్యక్రమం) నిర్వహించారు. ‘శ్రీభగవాన్’ (శ్రీరాముడు) అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ మసీదులో పూజలు చేశారు. మసీదు గోడలపై రామ్ రామ్ అంటూ రాశారు. పూజ జరగుతున్నంత సేపూ మసీదులోకి ఎవరూ రాకుండా సుమారు 25 మంది నిహంగ్ సిక్కులు బయట కాపలా కాశారు. ఈ క్రమంలో మసీదులో లోపల శ్రీరాముడి విగ్రహం కోసం ఓ వేదిక కూడా ఏర్పాటు చేశారు.
ఈ ఘటనపై ఔద్ ప్రాంత థానేదార్ (పోలీసు అధికారి) 1858 డిసెంబర్ 1న ఓ నివేదిక కూడా తయారు చేశారు. బాబా ఫకీర్ సింగ్ ఖల్సా..మస్జిద్ జన్మస్థానంలోనే ఉంటున్నారని, ఆయనకు సమన్లు తీసుకెళ్లి ఇచ్చానని కూడా చెప్పారు. మసీదులో ఉన్న ఆయనపై తాను ఆగ్రహం వ్యక్తం చేశానని తన నివేదికలో పేర్కొన్నారు. దీనికి బాబా సమాధానమిస్తూ..భూమ్మీద ప్రతిప్రాంతాం ఆ నిరంకరుడితే (నిరాకారుడైన భగవంతుడు) అని అన్నారని నివేదికలో పొందుపరిచాడు. ఈ ఘటనపై బాబ్రీ మస్జిద్ మువజ్జిన్ కూడా ఓధ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ముస్లింలపై హిందువుల అజమాయిషీకి ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఔధ్ అధికారుల కుట్ర కూడా ఉందని ఆరోపించారు. ఇంజంక్షన్ ఆర్డర్స్ వచ్చే సరికే మసీదులో విగ్రహ ఏర్పాటుకు అవసరమైన వేదిక సిద్ధమైందని అన్నారు. దీని వెనుక ఔధ్ పాలనాధికార కుట్ర కూడా ఉందని ఆరోపించారు.
ఆ తరువాత కొంత కాలం పాటు బాబ్రీ మసీద్ పరిసరాల్లో ఘర్షణాత్మక వాతావరణం కొనసాగింది. అంతిమంగా నిహంగ్ సిక్కులను అక్కడి నుంచి పంపించేయడంతో ఈ వివాదానికి ముగింపు పడింది. ఆ తరువాత కాలక్రమంలో ఔధ్ రాజ్యం కనుమరుగైంది. బ్రిటీష్ రాజ్యమూ కాలగర్భంలో కలిసిపోయింది. కానీ, ఆ నిహంగ్ సిక్కు సాహసోపేత చర్యకు సాక్ష్యంగా నాటి పోలీసు రిపోర్టు మాత్రం చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఇటీవల రామమందిర నిర్మాణ అనుకూల తీర్పు రావడానికి కీలకంగా మారిందది. అయితే, అంతకు సుమారు మూడు శతాబ్దాలకు మునుపు..అంటే 1510-11లో సిక్కు గురువు గురు నానాక్ దేవ్ ఆ ప్రాంతాన్ని సందర్శించారన్న విషయాన్ని కూడా సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రస్తావించింది. ఫలితంగా ఆ స్థలానికి, హిందువులకు ఉన్న సుదీర్ఘబంధం తేటతెల్లమైంది.
బాబా ఫకీర్ సింగ్ ఖల్సా తరువాత ఎనిమిదో తరం వారైన బాబా హర్జీత్ సింగ్ రసుల్‌పుల్ నాటి ఘటనల గురించి కళ్లకు కట్టినట్టు వివరించారు. శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం రోజున ఆ ప్రాంత వాసులందరి కోసం లంగర్ సేవ (సామూహిక భోజనాలు) ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
ఎవరీ నిహంగ్ సిక్కులు (Nihang Sighs)..
సిక్కుల్లో ఓ ముఖ్యవర్గమైన నిహంగ్ సిక్కులకు తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. యుద్ధ విద్యల్లో ఆరితేరిన వారిగా పేరుపొందారు. సిక్కుల 10వ గురువు గురుగోబింద్ సింగ్ నాటి నుంచీ వారు తమ సేవలు అందిస్తున్నారు. నీలి రంగు దస్తులు, పెద్ద తలపాగాలు, స్టీల్ చక్రాలు వారి వస్త్రధారణలోని ప్రత్యేకతలు. గట్కా అనే యుద్ధ విద్యలో వీరు నిష్ణాతులు. సిక్కు మతపరంగా ప్రాముఖ్యత ఉన్న ప్రాంతాలకు కాపలాగా ఉండటం గతంలో వీరి బాధ్యతలు. ‘‘సనాతన ధర్మం కోసం గురు తేజ్ బహదూర్ ఢిల్లీలోని చాందినీ చౌక్ వద్ద ఆత్మార్పణ చేశారు. వారి అడుగుజాడల్లోనే మేమూ నడుస్తున్నాం’’ అని బాబా హర్జిత్ సింగ్ ఈ సందర్భంగా తెలిపారు.
Updated Date - Dec 22 , 2023 | 06:47 PM