Viral: కూల్ డ్రింక్ టిన్నులో ఇరుక్కుపోయిన పాము.. హృదయాలను మెలిపెట్టే ఘటన!
ABN, First Publish Date - 2023-11-30T22:18:56+05:30
కూల్ డ్రింక్ టిన్నులో ఇరుక్కుపోయిన పాము. కాపాడిన జంతు ప్రేమికుడు, నెట్టింట వైరల్ అవుతున్న ఘటన.
ఇంటర్నెట్ డెస్క్: ప్లాస్టిక్ డబ్బాలు, కవర్లు, కూల్ డ్రింక్ టిన్నుల వంటి వాటిని ఇష్టారీతిన వీధుల్లో పడేస్తే జంతువులకు ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో చెప్పే ఘటన ఇది. ఆస్ట్రేలియాలో వెలుగు చూసిన ఈ ఘటన నెట్టింట పెద్ద చర్చనీయాంశమైంది(Trending). పూర్తి వివరాల్లోకి వెళితే..
టాస్మేనియాకు చెందిన ఓ పాముల సంరక్షకుడు కూల్ డ్రింక్ టిన్నులో చిక్కుకుపోయిన పామును కాపాడాడు. ఎండ వేడికి దాహంతో అలమటిస్తున్న ఆ పాము టిన్నులో మిగిలున్న పానీయం కోసం లోపల తలపెట్టింది. ఆటుపై అందులోంచి బయటకు రాలేక ఇబ్బంది పడుతుంటే చూసిన కొందరు ఆ పాముల సంరక్షకుడికి సమాచారం ఇచ్చారు. దీంతో, అతడు వచ్చి..టిన్నులో ఇరుక్కున్న పాము తలను జాగ్రత్తగా బయటకు తీసి పామును రక్షించాడు(Snake catcher save serpent struck in Energy drink can).
కాగా, ఈ ఘటన తాలూకు ఫొటోలు నెట్టింట షేర్ చేస్తూ అతడు ప్రజలను అప్రమత్తం చేశాడు. ఎండ వేడి, దాహం తట్టుకోలేక పాములు ఇలా ఖాళీ కూల్ డ్రింక్ టిన్నుల్లో దూరేందుకు ప్రయత్నించి ఇరుక్కుపోతాయని వివరించాడు. ఇలాంటి ప్రమాదాల నివారణకు ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరాడు. ఖాళీ టిన్నులను పూర్తిగా నలిపాక మాత్రమే పడేయాలని విజ్ఞప్తి చేశాడు. ఎన్నో ఏళ్లుగా జంతు ప్రేమికులు ఈ విషయంలో హెచ్చరికలు చేస్తున్నా ఇప్పటికీ అనేక మందిలో అవగాహన కొరవడిందని అతడు విచారం వ్యక్తం చేశాడు.
కాగా, ఈ ఘటనపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. పాముకు కలిగిన ఇబ్బంది అనేక మందిని కదిలించింది. మన దేశంలో కూడా ఆవులు, గేదెలు వంటి జంతువుల వీధుల్లో ఆహారం వెతుక్కునే క్రమంలో పొరపాటును ప్లాస్టిక్ వ్యర్థాలు తిని ఇక్కట్ల పాలవుతున్న విషయం తెలిసిందే.
Updated Date - 2023-11-30T22:19:00+05:30 IST