Chittoor Nagayya: సారీ నాగయ్య గారూ!
ABN, First Publish Date - 2023-03-08T08:40:10+05:30
1940-60 దశకంలో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో విశేషంగా రాణించిన సకల కళా వల్లభుడు ‘పద్మశ్రీ’ చిత్తూరు వి.నాగయ్య(Chittoor V. Nagaiah).
చెన్నై, (ఆంధ్రజ్యోతి): 1940-60 దశకంలో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో విశేషంగా రాణించిన సకల కళా వల్లభుడు ‘పద్మశ్రీ’ చిత్తూరు వి.నాగయ్య(Chittoor V. Nagaiah). అంతేగాక నేడు కళామతల్లికి వేదికలుగా అలరారుతున్న ‘త్యాగ బ్రహ్మగాన సభ’, ‘వాణీమహల్’ వంటి వాటి సృష్టికర్త. నటుడిగా, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా రాణించిన ఆల్‌రౌండర్ ఆయన. అంతేనా, స్వాతంత్య్ర పోరాటంలోనూ పాల్గొని, భరతమాత దాస్య శృంఖలాలను తెంపడంలో తనవంతు పాత్ర పోషించారు. అపరదాన కర్ణుడిగా పేరుప్రఖ్యాతులు గాంచిన ఆయన విగ్రహం ఇప్పుడు ఏ క్షణంలోనైనా కూలేందుకు సిద్ధంగా వుంది. చెన్నై(Chennai)లో తెలుగువాడి ప్రభకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఈ విగ్రహం ఇప్పుడు.. కనుమరుగు కానుంది. అందుకే తనను కనీసం ఆదుకునే వారి కోసం స్థానిక టి.నగర్ పానగల్ పార్కులో చెట్లు, మెట్రోరైల్ నట్టుల మధ్యన బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తోంది.
1904 మార్చి 28న జన్మించిన చిత్తూరు వి.నాగయ్య 1973 డిసెంబరు 30వ తేదీన చెన్నైలోనే కన్నుమూశారు. మూడు దశాబ్దాల పాటు సినీ పరిశ్రమను ఏలిన ఆయన.. అపర దానకర్ణుడిగా పేరుగాంచారు. ఎంతోమంది నాటి ప్రముఖ నటులు సైతం ఏదో ఒక రూపంలో ఆయన సాయం పొందినవారే, ఆయన ఇంటి భోజనం చేసినవారే. నాగయ్య తెలుగు సినీ, సాంస్కృతిక(Telugu cinema and culture) కళలు, సాహిత్యాలకు ఎనలేని సేవ చేశారు. ‘సినిమాల్లో ఏ వేషం లేకపోతే ఏం?.. నాగయ్య గారి ఇల్లుంది కదా?!’ అనేది నాటి సినీపరిశ్రమలో నానుడి. అంటే ఎవ్వరికి వేషం లేకపోయినా, ఆహారం దొరక్కపోయినా నాగయ్య ఇంటికి వెళ్లేవారట. ఆయన ఇంట్లోని పొయ్యి రేయింబవళ్లు మండుతూనే వుండేదట. అయితే అంతమందికి ఆహారం పెట్టిన ఆయన.. చివరిదశలో తీవ్రమైన పేదరికంతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన ఎంజీఆర్.. స్వయంగా నాగయ్య అంత్యక్రియల్లో పాల్గొన్నారు. శ్మశానానికి వెళ్లి ‘నాగయ్య బాగా బతికిన పెద్దాయన. ఇన్నాళ్లూ పేదరికంతో బాధపడ్డారట. ఆ విషయం నాకు ఆలస్యంగా తెలిసింది. అంత్యక్రియలైనా ఘనంగా చేయండి’ అని నాడు శ్మశానానికి వచ్చిన పండితులను ఆదేశించారట. ఆయన గొప్పదనాన్ని చాటి చెబుతూ టి.నగర్‌లో ఆయన విగ్రహం పెట్టాలని నాటి సినీ ప్రముఖులు ఎంతో కృషి చేశారు. మూడేళ్లపాటు వారు తీవ్ర ప్రయత్నం చేసిన తరువాత 1977 మార్చి 28వ తేదీన నాగయ్య విగ్రహం ఏర్పాటైంది. డైరెక్టర్ పి.పుల్లయ్య, ఆయన సతీమణి శాంతకుమారి, గుమ్మడి, ఇంటూరి వెంకటేశ్వరరావు, జమున, అల్లు రామలింగయ్య, ప్రభాకర్‌రెడ్డి వంటి వారి కృషి ఇందులో చెప్పుకోదగినదని నాటి పెద్దలు గుర్తు చేసుకుంటున్నారు. ఈ విగ్రహాన్ని మాజీ రాష్ట్రపతి డాక్టర్ వీవీ గిరి ప్రారంభించగా, ఆ సందర్భంగా ముద్రించిన ప్రత్యేక సంచికను మద్రాస్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ పీవీ రాజమన్నార్ ఆవిష్కరించారు. అప్పటి నుంచి పానగల్ పార్కులో స్థిరనివాసం ఏర్పరచుకున్న ఆ విగ్రహం ఆలనాపాలనా అంతంతమాత్రమే. కొన్నాళ్లు దానిని మూలనపడేశారు. అయితే ఈ విషయం మీడియాలో రావడంతో అప్పట్లో కొంతమంది జోక్యం చేసుకున్నారు.
మెట్రో తెచ్చిన తంటా!
ప్రస్తుతం పానగల్ పార్కు అంచున మెట్రోరైల్(Metrorail) పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం అక్కడున్న చెట్టుచేమ తీసేశారు. దీంతో పార్కుకు ఓ మూలన వున్న విగ్రహం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. విగ్రహం చుట్టూ ఇనుప కంచె, సామాన్లు వేశారు. దీంతో కనీసం విగ్రహం వద్దకు వెళ్లేందుకు కూడా అవకాశం లేకుండాపోయింది. దీనికి తోడు అక్కడ మెట్రోరైల్ పనులు జరుగుతుండడంతో ఏ క్షణంలోనైనా ఆ విగ్రహాన్ని తొలగించే సూచనలు కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి తొలగించి, మరే ప్రాంతంలో పెట్టినా పర్లేదు గానీ, మెట్రోరైల్ పనులకు ఉపయోగించే భారీ యంత్రాలకు ఇది ఎప్పుడైనా ధ్వంసమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విగ్రహం, దాని దిమ్మె కూడా కొంతమేర దెబ్బతిన్నాయి. నిజానికి ఈనాటి తెలుగువారికి సైతం చిత్తూరు నాగయ్య(Chittoor Nagayya) గురించి అంతగా తెలియదు. ఇక తమిళులకు తెలిసే అవకాశం ఎక్కడిది?.. అందువల్ల ఈ విగ్రహం ప్రాధాన్యం తెలియని అధికారులు, కార్మికులు దీనిని ఎప్పుడైనా కూల్చేయవచ్చని మెట్రోవర్గాలు తెలిపాయి. అందువల్ల తెలుగు ప్రముఖులు ఇప్పటికైనా కాస్త మేల్కొని ఈ విగ్రహాన్ని సంరక్షిస్తే ఇక్కడి తెలుగు చరిత్ర ధ్వంసం కాకుండా కాపాడినవారవుతారు. మేలుకో తెలుగోడా!
Updated Date - 2023-03-08T09:02:14+05:30 IST