చైనాలో వధువు కట్నం
ABN, Publish Date - Dec 17 , 2023 | 11:28 AM
సొంత ఇల్లు ఉందా? ఉద్యోగం ఏమిటి? జీతం ఎంత? ‘వధువు కట్నం’ (పెళ్లికూతురికి ఇచ్చే కట్నం) ఎంతిస్తావు? ఇలాంటి ప్రశ్నలు...
సొంత ఇల్లు ఉందా? ఉద్యోగం ఏమిటి? జీతం ఎంత? ‘వధువు కట్నం’ (పెళ్లికూతురికి ఇచ్చే కట్నం) ఎంతిస్తావు? ఇలాంటి ప్రశ్నలు నేటి చైనా యువకుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చైనాలో వధువుకట్నం ఏ రేంజ్‌లో ఉందో చూడండి..
గ్వా జియో ... చైనా సోషల్ మీడియాలో ఈ పేరు మారుమోగింది. అతడి పెళ్లి ఆగి పోయింది. వధువుకట్నం ఇవ్వలేనందున ఆ పెళ్లి ఆగిపోయింది. నేటికీ చైనాలో వధువుకట్నం ఆచరణలో ఉందంటే ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఇది వాస్తవమని గ్వా జియో ఓ పోస్ట్ చేశాడు. అతడి అసలు పేరు అది కాదు. కానీ ఆ పేరుతోనే తను పోస్టు చేశాడు.
ఇల్లు తాకట్టు
షాంగ్జి ప్రావిన్సుకు చెందిన 35 ఏళ్ల గ్వా జియో అందరిలానే జీవితం గురించి ఎన్నో కలలు కన్నాడు. భార్య, ఉద్యోగం, పిల్లలు... ఇలా తియ్యటి కలలు ఎన్నో. రెండేళ్ల క్రితం ఓ యువతితో అతడి స్నేహం ప్రేమలా మారింది. రెండిళ్లల్లో చెప్పి లగ్నాలు పెట్టించుకుందామని అనుకున్నారు. అటూ ఇటూ పెద్దలూ అంగీకరించారు. కానీ అమ్మాయి వాళ్లు పెద్ద మొత్తంలో వధువుకట్నం అడిగారు. ఇక్కడే గ్వా పునరాలోచనలో పడిపోయాడు. తన దగ్గర అంత డబ్బు లేదు. ఏడాది కష్టపడితే కానీ అంత సంపాదించలేడు. ప్రేయసి మీద ప్రేమ కొద్దీ దానికి సిద్ధమయ్యాడు. స్నేహితుల దగ్గర కాస్త పోగు చేశాడు. ఓవర్ టైమ్ జాబ్ చేశాడు. ఆఖరికి అమ్మానాన్న ఉంటోన్న ఇల్లునూ తాకట్టు పెట్టాడు. అలా ఎంతో కష్టపడి వధువుకట్నం సిద్ధం చేశాడు. శుభం కార్డు దగ్గర పడుతోన్న సమయంలో పెళ్లి కూతురు తల్లిదండ్రులు ప్లేట్ ఫిరాయించారు. మరో 30 వేల యువాన్లను అదనంగా ఇమ్మని కోరారు. తన జీతం 5 వేల యువాన్లే. ఆ మొత్తాన్ని సంపాదించాలంటే చాలా సమయమే పడుతుంది. అన్ని దారులూ మూసుకుపోయాయి. అందుకే పెళ్లే వద్దను కున్నాడు. వధువుకట్నం ఇవ్వలేక తన ప్రేయసితో విడిపోయాడు. అయితే ఏడాదిగా రాత్రనకా పగలనకా కూడబెట్టిన డబ్బుతో ఏం చేయాలో తోచలేదు. ఉద్యోగానికి రాజీనామా చేశాడు. సంచారిలా ప్రపంచ యాత్ర మొదలుపెట్టాడు. అయిదు నెలల పాటు వివిధ దేశాలు తిరిగి ప్రసిద్ధి చెందిన 40 నగరాలను చుట్టేశాడు. అలా ఒక్కో నగరంలో తిరుగుతూ తన కథ వివరిస్తూ సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాడు. గ్వా జియోనే కాదు చైనాలో వధువుకట్నానికి బలవుతున్న పెళ్లికాని ప్రసాదులు ఎంతో మంది.
అన్ని రకాలుగా ఎంతో ముందున్న చైనాలో ఈనాటికి ‘వధువు కట్నం’ కొనసాగుతోంది. అక్కడ యువతీ యువకుల నిష్పత్తి లో చాలా అంతరం ఉంది. సొంత ఇల్లు, వధువుకట్నం ఇచ్చే స్తోమత, మంచి ఉద్యోగం ఉన్న యువకులకే అక్కడ డిమాండ్. 2050 నాటికి ఆ దేశంలో 35 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న పెళ్లికాని యువకుల సంఖ్య 3 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఒక్క చైనాలో ‘సింగిల్స్’ సంఖ్య ఎక్కువ. ఈ విషయంలో చైనా ఇంకా తిరోగమన స్థితిలోనే ఉంది. ‘నో హౌజ్’, ‘నో మనీ’ ‘నో బ్రైడ్ ప్రైజ్’ ట్యాగ్‌లు యువకుల జీవితాలతో ఆడుకుంటున్నాయి.
Updated Date - Dec 17 , 2023 | 11:29 AM