NRI: ప్రపంచవ్యాప్తంగా చంద్రమోహనునికి ఘన నివాళి
ABN, First Publish Date - 2023-12-04T17:24:16+05:30
వంశీ ఇంటర్నేషనల్, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల స్వర్గస్తులైన ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్‌కు నివాళిగా, అంతర్జాల మాధ్యమంగా శనివారం సంస్మరణ సభ జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: వంశీ ఇంటర్నేషనల్, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల స్వర్గస్తులైన ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్‌కు నివాళిగా, అంతర్జాల మాధ్యమంగా శనివారం సంస్మరణ సభ జరిగింది. పలువురు సినీ ప్రముఖులు చంద్రమోహన్ కుటుంబ సభ్యులు, ఆప్తులు, వివిధ దేశాల తెలుగు సంస్థల ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో చంద్రమోహన్ నటనా విశిష్టతను గురించి, వారి వ్యక్తిత్వాన్ని గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు.
చంద్రమోహన్‌తో 21 సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు తనకు వారితో ఉన్న అనుబంధాన్ని ఈ వేదికపై తలచుకున్నారు. ప్రముఖ సినీ గేయ రచయిత భువనచంద్ర మాట్లాడుతూ చంద్రమోహన్, వారి సతీమణి జలంధరతో తమకున్న ప్రత్యక్ష స్నేహ సంబంధాన్ని గురించి తెలిపారు. తాను రాసిన మొట్టమొదటి గీతం చంద్రమోహన్‌కే రచించానని తెలియజేశారు. చంద్రమోహన్ మేనల్లుడు ప్రముఖ సినీ నిర్మాత అయిన శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ తన మామయ్య ఉన్నత వ్యక్తిత్వాన్ని గురించి, ఆదిత్య 369 సినిమా అనుభవాలను గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు.
కళాతపస్వి కె. విశ్వనాథ్ తనయుడు చంద్రమోహన్‌కు బంధువులు అయిన కాశీనాధుని నాగేంద్ర మాట్లడుతూ తమ రెండు కుటుంబాల మధ్య ఉన్న అపురూప బంధాన్ని తలచుకున్నారు.
కల్చర్ టీవీ వారి సాంకేతిక సహకారంతో ఈ కార్యక్రమం యూట్యూబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.
Updated Date - 2023-12-04T17:24:20+05:30 IST