Sobhanbabu : శోభన్‌బాబు ఆ మూడే చూసుకొనేవారు
ABN, Publish Date - Dec 17 , 2023 | 06:03 AM
సోగ్గాడు శోభన్‌బాబు నటించిన ‘మనుషులు మారాలి’ చిత్రంతోనే దర్శకత్వ శాఖలోకి అడుగుపెట్టారు ఎ.కోదండరామిరెడ్డి. అప్పటి నుంచి వారిద్దరి మధ్య స్నేహం
సోగ్గాడు శోభన్‌బాబు నటించిన ‘మనుషులు మారాలి’ చిత్రంతోనే దర్శకత్వ శాఖలోకి అడుగుపెట్టారు ఎ.కోదండరామిరెడ్డి. అప్పటి నుంచి వారిద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఒరే అంటే ఒరే అనుకునే చనువు ఏర్పడింది. హీరోగా శోభన్‌బాబు, దర్శకుడిగా ఎ.కోదండరామిరెడ్డి ఉన్నత స్థాయికి ఎదిగినా వీరిద్దరి అనుబంధం మాత్రం అలాగే కొనసాగింది. శోభన్‌బాబు గురించి ‘చిత్రజ్యోతి’ అడిగినప్పుడు కోదండరామిరెడ్డి ఇలా చెప్పుకొచ్చారు. ‘మనిషి చాలా మంచి వాడు. అందగాడు కూడా. మహిళల్లో అతనికి విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. తన పక్కన పలానా వాళ్లని హీరోయిన్‌గా పెట్టమని ఎప్పుడూ చెప్పలేదు. ఎందులోనూ తను జోక్యం చేసుకొనేవాడు కాదు. సబ్జెక్ట్ లైన్, తన పాత్ర, పారితోషికం... ఇవి మాత్రమే చూసుకునేవాడు. దర్శకనిర్మాతలమీద నమ్మకంతో మిగిలిన విషయాలు పట్టించుకునేవాడుకాదు. షూటింగ్‌లో ఎప్పుడన్నా ఇంకో టేక్ చేద్దామా అని అడిగితే ‘చాల్లేరా.. ఎన్నిసార్లు చేసినా ఇంతకంటే ఎక్కువ రాదు’ అనేవాడు. అలాగని వళ్లు దాచుకునేవాడు కాదు. కాకపోతే రిస్కీ షాట్స్‌కు దూరంగా ఉండేవాడు. అతను చేసింది ఎక్కువగా ఫ్యామిలీ డ్రామాలే కదా. ఫైట్లు తక్కువగా ఉండేవి. ‘కోడెత్రాచు’ వంటి కొన్ని సినిమాల్లో ఫైట్లు పెట్టాను. ‘నా మీద ఫైట్లు ఎందుకురా.. ఎవరన్నా చూస్తారంటావా?’ అనేవాడు. ‘ఎప్పుడూ ఫ్యామిలీ డ్రామాలేనా.. యాక్షన్ సినిమాలు కూడా చేస్తే వెరైటీగా ఉంటుందయ్యా’ అనేవాడిని. ‘అంతేనంటావా’ అని ఒప్పుకొనేవాడు. మద్రాసులో నేను తొలిసారిగా ఇల్లు కొనుక్కున్నప్పుడు శోభన్‌బాబును ఇంటికి పిలిపించి చూపించాను. ‘బాగుందిరా.. నీకు అటుపక్క, ఇటు పక్క ఉన్న స్థలాలు కొనుక్కోమని అడుగుతారు. ఆలోచించకుండా కొనేసెయ్యి’ అని సలహా ఇచ్చాడు. అతను చెప్పినట్లుగానే ఆ స్థలాలు కొనమని నన్ను అడిగారు. అయితే వాస్తు దోషం ఉందని కొనడానికి వెనుకడుగు వేశాను. మనం అడిగినా, అడగకపోయినా ఎదుటి వాళ్లకు ఓ మంచి మాట చెబుదాం అనుకునే మనస్తతం శోభన్‌బాబుది. అంతే తప్ప ఎదుటివాడు బాగుపడకూడదు, నాశనం అయిపోయాలి అని కోరుకునేవాడు కాదు. ఎటువంటి కల్మషం లేని మనిషి. చెబితే మంచి చెబుదాం. లేకపోతే కామ్‌గా ఉందాం అనుకునేవాడు. పాలిటిక్స్ గురించి కానీ, సినిమా పాలిటిక్స్ గురించి కానీ మాట్లాడేవాడు కాదు. ఎవరన్నా ఆ ప్రస్తావన తెస్తే ‘అవన్నీ మనకెందురా.. మన పని చేసుకుపోదాం’ అనేవాడు’.
Updated Date - Dec 17 , 2023 | 06:03 AM