Hair Care : మందారంతో జుట్టుకు ఆరోగ్యం...
ABN, Publish Date - Dec 14 , 2023 | 05:03 AM
మందారంలో విటమిన్-సి, అమినోయాసిడ్లు ఉంటాయి. ముఖ్యంగా ఇవి జుట్టులో ఉండే కెరోటిన్‌ను పెంచటం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. మందారంతో ఇలా హెయిర్ ప్యాక్స్ చేసుకోవచ్చు..
మందారంలో విటమిన్-సి, అమినోయాసిడ్లు ఉంటాయి. ముఖ్యంగా ఇవి జుట్టులో ఉండే కెరోటిన్‌ను పెంచటం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. మందారంతో ఇలా హెయిర్ ప్యాక్స్ చేసుకోవచ్చు..
గుప్పెడు మందారం ఆకులు, మూడు మందారాలు కలిపి గ్రైండ్ చేసి మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమానికి రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె కలిపి మెత్తగా చేయాలి. జుట్టు మాడుకు పట్టేట్లు ఈ పేస్ట్‌ను పట్టించి.. కనీసం అరగంట నుంచి నలభై నిముషాల వరకు ఉంచి మంచి నీళ్లతో కడిగేయాలి. ఇలా రెండువారాలకోసారి చేస్తుంటే జుట్టు పెరుగుదల బావుంటుంది.
మందారం ఆకులు, పూలను రెండు పిడికిళ్లు తీసుకోవాలి. వీటిని గ్రైండ్‌లో వేశాక.. గుప్పెడు కరివేపాకును కూడా వేయాలి. ఈ చూర్ణానికి కొబ్బరినూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తుంటే తెల్లని జుట్టు సమస్య తగ్గుతుంది.
ఎలాంటి ఆయిల్ కలపకుండా కేవలం మందారం ఆకులు లేదా మందారం పూల పేస్ట్‌ను పట్టించుకుంటే సరి. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
బౌల్‌లో రెండు టేబుల్ స్పూన్ల ఎండిన మందారాలతో చేసిన పొడి వేయాలి. అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి మిశ్రమంగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఆరిన తర్వాత మైల్డ్ షాంపూతో కడిగేస్తే తల చల్లగా ఉంటుంది. కురులు గట్టిపడతాయి.
బౌల్‌లో రెండు టేబుల్ స్పూన్ల ఉసిరిపొడి, అంతే స్థాయిలో మందారం ఆకుల పొడిని కలిపి మిశ్రమంగా చేసి పట్టించాక గంట పాటు ఉంచాక శుభ్రపరచుకోవాలి. అలా తరచూ చేస్తుంటే జుట్టులో పెరుగుదల ఉంటుంది.
రెండు టేబుల్ స్పూన్ల మందారం పొడి, రెండు టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ రసం కలిపి చూర్ణం చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తే జుట్టు ఊడిపోదు.
బౌల్‌లో రెండు టేబుల్ స్పూన్ల అలొవెరా జెల్, అందులోకి రెండు టేబుల్ స్పూన్ల మందారం ఆకుల పొడిని తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా రెండు వారాలకోసారి చేస్తుంటే జుట్టు కుదుళ్లు గట్టిగా ఉంటాయి.
Updated Date - Dec 14 , 2023 | 05:03 AM