సులువుగా స్నాక్స్
ABN, Publish Date - Dec 30 , 2023 | 03:46 AM
కొత్త అనే మాట ఎప్పటికీ హాయి భావనే. కొత్త సంవత్సరం అంటే..
కొత్త అనే మాట ఎప్పటికీ హాయి భావనే. కొత్త సంవత్సరం అంటే.. సరికొత్త ఉత్సాహం, ఎన్నో కలలు కళ్లముందు కనపడుతుంటాయి. ఇలా పాజిటివ్ ఆలోచనల ప్రవాహంలో మునిగివేళ.. ఆనందమే మరి! న్యూ ఇయర్ రోజున సులువుగా ఈ స్నాక్స్ చేసుకోవచ్చు ఇలా..
చికెన్ 65
కావాల్సిన పదార్థాలు: బోన్‌లెస్ చికెన్- 600 గ్రాములు (చిన్న ముక్కలుగా తరగాలి), కారం పొడి- టేబుల్‌స్పూన్, గరం మసాలా- ముప్పావు టీ స్పూన్, ధనియాల పొడి- టీస్పూన్, అల్లం-వెల్లుల్లి పేస్ట్- టీస్పూన్, జీలకర్ర పొడి- 1 టీస్పూన్, ఉప్పు- తగినంత, పసుపు- కొద్దిగా, నిమ్మరసం- 1 టీస్పూన్, నూనె- ఒకటిన్నర టేబుల్ స్పూన్, ఎగ్‌వైట్- 1, కార్న్ ఫ్లోర్- రెండున్నర టీస్పూన్లు, మైదాపిండి- రెండున్నర టీస్పూన్లు, డీప్ ఫ్రైకి తగినంత నూనె కూడా తీసుకోవాలి.
తయారీ విధానం: బౌల్‌లో చికెన్ ముక్కలు వేశాక.. అందులో కారంపొడి, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు వేసిన తర్వాత మిశ్రమాన్ని బాగా కలపాలి. దీనివల్ల మిశ్రమం చికెన్ ముక్కలకు బాగా పడుతుంది. ఇందులోకి నూనె, నిమ్మరసం వేసిన తర్వాత మిశ్రమాన్ని బాగా కలపాలి. దీన్ని గంటపాటు ఫ్రిజ్‌లో ఉంచి మారినేట్ చేసుకోవాలి. ఫ్రిజ్‌లోంచి తీసిన వెంటనే ఇందులో ఎగ్‌వైట్‌తో పాటు కార్న్‌ఫ్లోర్, మైదాపిండి వేశాక బాగా కలపాలి. ఈ మిశ్రమం అంతా చికెన్ ముక్కలకు బాగా పడుతుంది. ఆ తర్వాత డీప్‌ఫ్రై చేసుకుని చికెన్ 65 తింటుంటే.. ఆ రుచికి ఎంత తిన్నామో లెక్కే ఉండదు మరి!
ఫిష్ ఫింగర్స్
కావాల్సిన పదార్థాలు: బోన్‌లెస్ ఫిష్- 300 గ్రాములు, ఉప్పు- రుచికి తగినంత, నల్ల మిరియాల పొడి- అర టీస్పూన్, నిమ్మరసం- 1 టీస్పూన్, కోడిగుడ్డు- 1, కొత్తిమీర- కొద్దిగా, అల్లం ముక్కలు- టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి- 2 (సన్నగా తరగాలి), మస్టర్డ్ పేస్ట్- పావు టీస్పూన్, మైదా- 300 గ్రాములు, నూనె- డీప్ ఫ్రైకి తగినంత
తయారీ విధానం: బోన్‌లెస్ ఫిష్‌ను ఫింగర్స్‌లా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మంచినీటితో శుభ్రం చేసి బౌల్‌లో వేయాలి. నల్ల మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం వేసి కలిపిన తర్వాత నలభై ఐదు నిముషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఫ్రిజ్‌లోంచి తీసిన తర్వాత కోడిగుడ్డు సొన, కొత్తిమీర, మస్టర్డ్ పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు వేసిన తర్వాత మైదా వేయాలి. ఆ తర్వాత బాగా కలిపితే చేప ముక్కలకు మిశ్రమం పడుతుంది. ఈ బౌల్‌ను అరగంట పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఫ్రిజ్‌లోంచి తీశాక సన్నటి బ్రెడ్ క్రంబ్స్‌లో చేప ముక్కలు ఒక్కోటి అద్దుకోవాలి. దీని వల్ల సన్నటి బ్రెడ్ ముక్కలు ముక్కలకు అంటుకుంటాయి. దీనివల్ల క్రిస్పీగా ఉంటాయి. చివరగా డీప్‌ఫ్రైలో అదికూడా మీడియం ఫ్లేమ్‌లో లైట్‌గా రంగు మారేంత వరకు ఫిష్ ఫింగర్స్‌ను ఫ్రై చేసుకోవాలి.
తందూరి ఆలు
కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు- 8 (చిన్నవి), గట్టి పెరుగు- అర కప్పు, ధనియాల పొడి- 1 టీస్పూన్, రోస్టెడ్ జీరా పొడి- అర టీస్పూన్, కారం పొడి- 1 టీస్పూన్, జింజర్-గార్లిక్ పేస్ట్- 2 టీస్పూన్లు, గరం మసాలా- 1 టీ స్పూన్, పసుపు- కొద్దిగా, శనగపిండి- 1 టీస్పూన్, ఉప్పు- రుచికి తగినంత, తాజా క్రీమ్- 1 టేబుల్ స్పూన్, చాట్‌మసాలా- 1 టీస్పూన్, నిమ్మరసం- 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి- 1 టేబుల్ స్పూన్, వాము గింజలు- పావు టీస్పూన్, నూనె- అర టేబుల్ స్పూన్
తయారీ విధానం: మొదట బంగాళాదుంపలను ఉడకబెట్టాలి. ఆ తర్వాత వాటి తోలు తీసి టూత్ పిక్‌తో నాలుగైదు చోట్ల గుచ్చాలి. వీటిని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత బౌల్‌లో గట్టిపెరుగు, ధనియాల పొడి, వేయించిన జీరాతో చేసిన పొడి, కారం పొడి, జింజర్- గార్లిక్ పేస్ట్, గరం మసాలా, పసుపు, శనగపిండి, ఉప్పు, తాజా క్రీమ్ వేసిన తర్వాత మిశ్రమాన్నంతా బాగా మిక్స్ చేయాలి. పేస్ట్‌లా అవుతుంది. ఇందులోకి చాట్ మసాలా, నిమ్మరసం, కసూరి మేతి వేసిన తర్వాత మిశ్రమాన్ని కలిపి అందులోకి ఉడికిన బంగాళదుంపలు వేయాలి. బంగాళదుంపలకు మిశ్రమం పట్టేట్లు కలపాలి. ఆ తర్వాత వాముతో పాటు నూనె వేశాక బంగాళదుంపలకు పట్టేల్లు కలపాలి. దీనికి మూత పెట్టి ఫ్రిజ్‌లో గంటపాటు ఉంచాలి.
ఫ్రిజ్‌నుంచి తీశాక బేకింగ్ ట్రేలో వీటిని సర్దాలి. ప్రతి బంగాళదుంప ఉండకు బ్రష్‌తో నూనె పట్టించాలి. ఓవెన్ మిడిల్‌ర్యాక్‌లో ఉంచి 200 డిగ్రీల్లో కనీసం 10 నిముషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత బయటకు తీసి నూనెను బ్రష్‌తో పట్టించి తిరిగి పైన ర్యాక్‌లో ఉంచి కనీసం ఎనిమిది నిముషాల పాటు ఉంచాలి. తందూరి ఆలు రెడీ. ప్లేట్‌లో సర్ది టూత్‌పిక్‌ను గుచ్చి ఎంచక్కా స్నాక్స్‌లా తినేయాలి. అవసరం అనుకుంటే కొత్తిమీర చట్నీతో లాగించొచ్చు.
Updated Date - Dec 30 , 2023 | 03:46 AM