ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Diya Kumari : మహిళల పాలిట దియా

ABN, Publish Date - Dec 14 , 2023 | 05:14 AM

రాజస్థాన్‌ కొత్త ఉప ముఖ్యమంత్రిగా బిజెపి నియమించిన దియా కుమారి, రాజ వంశానికి చెందిన మహిళ అనే విషయం అందరికీ తెలిసిందే! ఆవిడ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకుందాం!

రాజస్థాన్‌ కొత్త ఉప ముఖ్యమంత్రిగా బిజెపి నియమించిన దియా కుమారి, రాజ వంశానికి చెందిన మహిళ అనే విషయం అందరికీ తెలిసిందే! ఆవిడ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకుందాం!

1970, జనవరిలో పుట్టిన దియా కుమారి తాతయ్య రెండవ మాన్‌సింగ్‌... బ్రిటిష్‌ కాలంలో జైపూర్‌ను పరిపాలించిన చిట్టచివరి మహారాజు. దియా తండ్రి బ్రిగేడియర్‌ సవాయి భవానీ సింగ్‌ 1971లో భారత్‌, పాకిస్తాన్‌ యుద్ధంలో ప్రదర్శించిన సాహసానికి గుర్తింపుగా మహావీర చక్ర అవార్డును పొందడం విశేషం. దియా, జైపూర్‌లోని మహారాణి గాయత్రీ దేవి స్కూల్‌, మహారాణి కాలేజీలో చదువుకుంది. కళల పట్ల తనకున్న ఆసక్తికొద్దీ లండన్‌లోని సుప్రసిద్ధ ‘పార్సన్స్‌ ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ స్కూల్‌’ నుంచి ఫైన్‌ ఆర్ట్స్‌ డెకరేటివ్‌ పెయింటింగ్‌లో డిప్లొమా పూర్తి చేసింది. దియా కుమారి బాల్యమంతా విలాసవంతమైన రాజభవనాలకే పరిమితం కాలేదు. తండ్రి ఆర్మీ అధికారి కావడంతో, అత్యంత సాధారణమైన సైనిక వాతావరణాల్లో బాల్యం గడవడంతో దియాకు ఒదిగి ఉండే స్వభావం అలవడింది. తన బాల్యం గురించి ప్రస్తావిస్తూ... ‘నేను గారాబంగా పెరగలేదు. నా బాల్యమంతా ఎంతో క్రమశిక్షణతో సాగింది. నేనొక రాజ కుటుంబానికి చెందిన ప్రత్యేకమైన వ్యక్తిననే ఆలోచన నాకెప్పుడూ ఉండేది కాదు’ అంటూ చెప్పుకొచ్చింది దియా.

ప్రేమ, పెళ్లి

నరేంద్ర సింగ్‌ రజావత్‌ అనే ఒక సాధారణ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ను ప్రేమించిన దియా కుమారి 1997 ఆగస్టు 6న అతడిని పెళ్లాడింది. వీరికి ముగ్గురు సంతానం. పెద్ద కొడుకు పద్మనాభ సింగ్‌ ప్రస్తుత జైపూర్‌ మహారాజు. ఇతను పోలో క్రీడాభిమాని. దియా కుమారి తండ్రి భవానీ సింగ్‌, బాలుడైన పద్మనాభ సింగ్‌ను దత్తత తీసుకోవడం చెప్పుకోదగిన విశేషం. 2011లో భవానీ సింగ్‌ హఠాన్మరణంతో, దియా కుమారి, రాజ కుటుంబ వ్యవహారాలను నిర్వహించే బాధ్యతను కౌమారంలో ఉన్న పద్మనాభుడి భుజస్కంధాల మీద మోపక తప్పలేదు. అయినప్పటికీ ఆ బాధ్యతలను ఎంతో హూందాగా నిర్వర్తించి, పద్మనాభ్‌ సింగ్‌ రాజ కుటుంబంలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే రాజవంశ బాధ్యతలను కుమారుడికి అప్పగించడంతో దియా బాధ్యతలు పూర్తి కాలేదు. సామాజిక అంశాల పట్ల కలిగి ఉన్న ఆసక్తితో దియా తన పేరుతో ‘ప్రిన్సెస్‌ దియా కుమారి ఫౌండేషన్‌’ను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించింది. ఆవిడ కూతురు, సుప్రసిద్ధ ఫెమినిస్ట్‌ అయిన యువరాణి గౌరవి కుమారి ఆ ఫౌండేషన్‌కు జనరల్‌ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తూ, అట్టడుగు వర్గాల మహిళల స్వావలంబన కోసం కృషి చేస్తోంది.

విలాసవంతమైన భవనాలు, కార్లు

రాజ కుటుంబం మొత్తం ఆస్థిని అంచనా వేయలేకపోయినా, పద్మనాభ సింగ్‌ ఒక్కడి ఆస్థి ఏకంగా 6.97 నుంచి 8.55 కోట్ల డాలర్లు ఉండవచ్చని బిజినెస్‌ ఇన్‌సైడర్‌ అంచనా. తరతరాలుగా ఒక తరం నుంచి ఇంకొక తరానికి వారసత్వంగా సంక్రమించిన ఆస్థుల్లో రాంబాగ్‌ ప్యాలెస్‌ ఒకటి. 8 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ రాజభవనం 1835లో యువరాజు రెండవ రామ్‌సింగ్‌కు పాలిచ్చి పెంచిన వెట్‌ నర్స్‌, గార్డెన్‌ కాటేజ్‌గా ఉపయోగపడుతూ ఉండేది. కాలక్రమేణా ఈ స్థిరాస్థి 20వ శతాబ్దంలో అద్భుతమైన రాజభవనంగా రూపం పోసుకుంది. ప్రస్తుతం ఈ రాజభవనం కుటుంబ ప్రధాన నివాసంగా ఉపయోగపడుతోంది. తాజ్‌ హోటల్స్‌ రిసార్ట్స్‌ అండ్‌ ప్యాలెసెస్‌ ఈ రాజ భవనం నిర్వహణ బాధ్యతలను చేపట్టి, సంరక్షించి, భారత దేశంలోని ఉన్నతమైన ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో ఒకటిగా దీన్ని తీర్చిదిద్దింది. ఈ రాజ కుటుంబానికే చెందిన మరొక రాజభవనం, రాజ్‌మహల్‌ ప్యాలెస్‌. ఇక విలాసవంతమైన వాహనాల విషయానికొస్తే, మహారాణి గాయత్రీ దేవికి చెందిన 1937 నాటి బెంట్లీ 4.25 లీటర్‌ ఎమ్‌ఎక్స్‌ సిరీస్‌ కార్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తన కుటుంబానికి చెందిన స్థలాన్ని షాజహాన్‌ కబ్జా చేసి, దాని మీద తాజ్‌మహల్‌ను నిర్మించినట్టు గత ఏడాది, దియా కుమారి బహిరంగంగా ప్రకటించి అందర్నీ అవాక్కయ్యేలా చేయడం మరొక విశేషం!

రాజకీయ ప్రస్థానం

2013లో, సవాయి మాధోపూర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎంపికవడంతో, దియా కుమారి రాజకీయ ప్రయాణం మొదలైంది. దియా ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే, నగరం చుట్టుపక్కల ఉన్న అభివృద్ధికి నోచుకోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి మీదే దృష్టి సారించింది. 2019లో దియా కుమారి రాజ్‌సమంద్‌ నుంచి అత్యధిక మెజారిటీతో గెలుపొంది పార్లమెంట్‌ సభ్యురాలిగా జాతీయ వేదికను అధిరోహించింది. దియా రాజకీయాలకే పరిమితం కాకుండా, రెండు స్కూళ్లు, ట్రస్టులు, మ్యూజియంలు, హోటళ్లు, ప్రభుత్వేతర సంస్థలు మొదలైన ఎన్నో రకాల వెంచర్లను నిర్వహిస్తూ ఉంటుంది. అలాగే ఆవిడ పేరుతో ఉన్న, ది ప్రిన్సెస్‌ దియా కుమారి ఫౌండేషన్‌ కూడా ఈవిడ ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉంటుంది. ఈ సంస్థ మహిళలు, ఆడపిల్లల స్వయం స్వావలంబనే లక్ష్యంగా వారికి వొకేషనల్‌ ట్రైనింగ్‌, విద్య, ఉపాథులను అందిస్తోంది. ఎన్నో ఎన్‌జీవోలతో మమేకమై వారసత్వ నిర్వహణ కోసం కృషి చేసినందుకు గాను రాజస్థాన్‌, అమిటీ యూనివర్శిటీ నుంచి దియా డాక్టరేట్‌ను అందుకుంది. వీధుల్లో నడిచే యువరాణిగా పేరు పొందిన దియా మహిళల రక్షణ, యువతకు ఉద్యోగావకాశాలు, రైతుల సంక్షేమాలే లక్ష్యంగా పని చేస్తానని ప్రమాణం చేయడం విశేషం!

Updated Date - Dec 14 , 2023 | 05:14 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising