Parliament incident : ఫైర్ ప్రూఫ్ జెల్ రాసి.. నిప్పంటించుకోవాలని..!
ABN, Publish Date - Dec 17 , 2023 | 05:49 AM
పార్లమెంట్‌లో అలజడి రేపిన కేసులో నిందితులు తొలుత తమకు తాము నిప్పంటించుకుని.. కరపత్రాలు వెదజల్లి తమ నిరసనను తెలపాలని ప్లాన్ చేసుకున్నారని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అయితే చివరకు అది వద్దనుకుని.. పొగ డబ్బాలతోనే నిరసన తెలిపారని
పార్లమెంట్ ఘటనలో నిందితుల తొలి ప్లాన్ ఇదే
బీజేపీ ఎంపీ వాంగ్మూలం నమోదుకు నిర్ణయం
ఆరో నిందితుడి అరెస్టు.. 7 రోజుల పోలీసు కస్టడీకి
మా కొడుకు అమాయకుడు: లలిత్ తల్లిదండ్రులు
ఘటన వెనుక నిరుద్యోగం, ధరల పెరుగుదల!
మోదీ విధానాలతో రగులుతున్న యువత: రాహుల్
ఆయనవి చెత్త మాటలు.. బీజేపీ మండిపాటు
న్యూఢిల్లీ, డిసెంబరు 16: పార్లమెంట్‌లో అలజడి రేపిన కేసులో నిందితులు తొలుత తమకు తాము నిప్పంటించుకుని.. కరపత్రాలు వెదజల్లి తమ నిరసనను తెలపాలని ప్లాన్ చేసుకున్నారని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అయితే చివరకు అది వద్దనుకుని.. పొగ డబ్బాలతోనే నిరసన తెలిపారని శనివారం చెప్పారు. ‘లోక్‌సభ చాంబర్‌లోకి దూకి తమ నిరసనను బలంగా తెలిపేందుకు నిర్ణయించుకున్న నిందితులు అన్ని మార్గాలనూ అన్వేషించారు. మొదట ఒంటికి ఫైర్ ప్రూఫ్ జెల్ రాసుకొని తర్వాత నిప్పంటించుకొని దూకాలనుకున్నారు. అలాగే కరపత్రాలు వెదజల్లాలనుకున్నారు. చివరికి ఆ ప్రయత్నాన్ని విరమించుకుని బుధవారం ప్లాన్‌తోనే ముందుకుసాగారు’ అని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఇక ఇద్దరు నిందితులకు విజిటర్ పాసులను జారీ చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా వాంగ్మూలాన్ని నమోదు చేయాలని పోలీసులు నిర్ణయించారు. దాడి ఘటన సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝాను రాజస్థాన్‌లోని నాగౌర్‌కు తీసుకెళ్లాలని యోచిస్తున్నారు. ఈ కేసులో ప్రమేయమున్న మరో నిందితుడు మహేశ్ కుమావత్‌ను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. దీంతో నిందితుల సంఖ్య ఆరుకు చేరింది. కుమావత్‌ను కూడా పాటియాలా కోర్టు ఏడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. కాగా, పార్లమెంటు భవన సముదాయంలో భద్రతకు సంబంధించిన వివిధ అంశాలను సమీక్షించి డిసెంబరు 13నాటి ఘటన పునరావృతం కాకుండా కార్యాచరణను రూపొందించడానికి తాను ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశానని సభ్యులకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి దర్యాప్తు కమిటీ నివేదికను త్వరలో సభలో సమర్పించనున్నట్లు ఎంపీలకు రాసిన లేఖలో ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా, తమ కొడుకు అమాయకుడని.. అతడికేమీ తెలియదని లలిత్ ఝా తల్లిదండ్రులు వాపోయారు. ‘మా కొడుకు అరెస్టు గురించి తెలిసిన వాళ్లు చెబుతుంటే విని షాక్ అయ్యాం. ఉన్నత చదువులు చదివినా మా వాడికి ఉద్యోగం రాలేదు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యపై ప్రధానిని కలిసి విన్నవించాలనుకున్నాడు. మా వాడు తప్పుడు పనుల్లో తల దూర్చడు. లలిత్‌పై తీవ్రమైన కేసులు పెట్టారని తెలిసింది. మా కొడుకుపై దయచూపి విడుదల చేయాలని కోర్టును వేడుకుంటాం’ అని అన్నారు.
10న ఢిల్లీకి వెళ్లిన మనోరంజన్
లోక్‌సభలో అలజడి సృష్టించిన కర్ణాటకకు చెందిన మనోరంజన్ ఈ నెల 10న బెంగళూరు నుంచి విమానంలో ఢిల్లీకి వెళ్లినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. పార్లమెంట్‌లో ఘటనకు 3 రోజులు ముందు వెళ్లినట్టు వివరాలు సేకరించారు. కేంద్ర హోంశాఖ సూచన మేరకు మైసూరు నగరం విజయనగర్ రెండో స్టేజ్‌లో ఉన్న మనోరంజన్ గదిని పోలీసులు సీజ్ చేశారు. మైసూరు బీజేపీ ఎంపీ ప్రతా్‌పసింహాకు చెందిన మైసూరు కార్యాలయంలోనూ పోలీసులు తనిఖీలు నిర్వహించారని విశ్వసనీయంగా తెలిసింది. పార్లమెంటు ఘటన అనంతరం అరెస్టయిన ఆరుగురు నిందితులకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఆయన కార్యాలయంలో లభించలేదని తెలుస్తోంది. కాగా మనోరంజన్ కుటుంబీకులు ఎవరూ మైసూరు వదిలి వెళ్లరాదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
పార్లమెంటు ఘటన వెనుక నిరుద్యోగం, ధరల పెరుగుదల!
లోక్‌సభలో ఈ నెల 13న జరిగిన ఘటన వెనుక నిరుద్యోగం, ధరల పెరుగుదల అంశాలున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానాలతో ధరలు మండిపోతున్నాయని, నిరుద్యోగం తాండవిస్తోందని, యువత రగిలిపోతోందని అన్నారు. ఇదే పార్లమెంటులో భద్రతను దాటుకుని మరీ వచ్చి దాడి చేయడానికి దారితీసిందన్నారు. ఢిల్లీలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పార్లమెంటులో భద్రతా ఉల్లంఘన నిజంగానే జరిగింది. కానీ, ఇది ఎందుకు జరిగింది? అసలు కారణం నిరుద్యోగం’’ అని రాహుల్ అన్నారు. నిరుద్యోగంతో పాటు మోదీ విధానాల వల్ల ఏర్పడిన ద్రవ్యోల్బణం కూడా పార్లమెంటు భద్రతా ఉల్లంఘనకు కారణమన్నారు. రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ తోసిపుచ్చింది. ‘ఆయనవన్నీ చెత్తమాటలు’ అని కొట్టిపారేసింది. దేశంలో నిరుద్యోగిత కేవలం 3.2 శాతం మాత్రమే ఉందని బీజేపీ ఐటీ ఇన్‌చార్జి అమిత్ మాల్వీయ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ‘‘రాహుల్‌ను పక్కన పెట్టి, పార్లమెంటు ఘటనలో పాల్గొన్న వారికి ‘ఇండియా’ కూటమి పార్టీలతో ఉన్న సంబంధాన్ని వివరించాలి. నిందితులకు న్యాయసహాయం అందించేందుకు ముందుకు వచ్చిన అసిమ్ సరోదేతో రాహుల్‌కు ఉన్న బంధాన్ని తేటతెల్లం చేయాలి. ఈయన జోడో యాత్రలోనూ పాల్గొన్నారు’’ అని అమిత్ ఆరోపించారు.
Updated Date - Dec 17 , 2023 | 05:49 AM