BJP CT Ravi: అతిపెద్ద అపశకునం ఎవరో ఇప్పుడు చెప్పగలరా? రాహుల్ గాంధీపై బీజేపీ నేత సీటీ రవి పంచ్!
ABN, First Publish Date - 2023-12-03T13:43:16+05:30
మూడు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ ముందంజ.. రాహుల్ గాంధీపై బీజేపీ నేత సీటీ రవి విమర్శలు..
ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు దిశగా దూసుకుపోతున్న తరుణంలో ఆ పార్టీ నేతల్లో సంబరాలు మిన్నంటుతున్నాయి. పార్టీకి దక్కుతున్న ప్రజాదరణకు మోదీయే కారణంటూ స్మృతీ ఇరానీ, శివరాజ్ సింగ్ చౌహాన్ సహా బీజేపీ కీలక నేతలు ఘనంగా ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో మరో బీజేపీ నేత సీటీ రవి(CT Ravi) రాహుల్ గాంధీని (Rahul Gandhi) టార్గెట్ చేశారు. అపశకునం(Panauti) కారణంగా భారత్ ప్రపంచకప్ ఫైనల్లో ఓడిదంటూ రాహుల్ గతంలో చేసిన కామెంట్‌ను గుర్తుచేస్తూ ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ పెట్టారు. ఇప్పుడు అతిపెద్ద అపశకునం ఎవరో చెప్పగలరా? అని ప్రశ్నిస్తూ రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని ట్యాగ్ చేశారు.
గతంలో రాజస్థాన్‌లోని ఓ ప్రచార ర్యాలీ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రధానిని పరోక్షంగా ఉద్దేశిస్తూ ‘అపశకునం’ గురించి మాట్లాడిన విషయం తెలిసిందే. ‘‘మన కుర్రాళ్లు అక్కడ మ్యాచ్ గెలిచుండే వారే కానీ అపశకునం వారిని ఓటమి పాలు చేసింది’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ వివరణ కోరుతూ ఎన్నికల సంఘం లేఖ కూడా రాసింది.
ప్రస్తుతం బీజేపీ..మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో విజయం దిశగా దూసుకుపోతోంది. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఏకంగా 163 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 64 సీట్లలో లీడ్‌లో ఉంది. రాజస్థాన్‌లో 199 సీట్లకు గాను 110 సీట్లలో కాషాయం పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్‌ఘడ్‌లో బీజేపీ 53 స్థానాల్లో, కాంగ్రెస్ 34 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.
Updated Date - 2023-12-03T13:51:04+05:30 IST