Governor Tamilisai : గోమూత్రం కాదు అవి గోముద్ర రాష్ట్రాలు
ABN, First Publish Date - 2023-12-09T04:18:15+05:30
ఉత్తరాది రాష్ట్రాలు గోమూత్ర రాష్ట్రాలు కాదని పవిత్రమైన గోముద్రకు సంకేతమని తెలంగాణ గవర్నర్ తమిళిసై
తెలంగాణ గవర్నర్ తమిళిసై
అహ్మదాబాద్, డిసెంబరు8: ఉత్తరాది రాష్ట్రాలు గోమూత్ర రాష్ట్రాలు కాదని పవిత్రమైన గోముద్రకు సంకేతమని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. రాజకీయాల కోసం ప్రజల మధ్య ప్రాంతీయ విభేదాలు తేవడం తగదని పేర్కొన్నారు. దేశంలో సాంస్కృతిక వ్యవస్థను బలోపేతం చేయాలని, ఆలయాల పునఃనిర్మాణాలతో స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని తెలిపారు. యాత్రలను ప్రోత్సహించేందుకు తీర్థయాత్ర కార్డులు తీసుకురావాలని సూచించారు. ఈ మేరకు గుజరాత్ విశ్వవిద్యాలయంలో శుక్రవారం జరిగిన కల్చరల్ ఎకానమీ కాన్‌క్లేవ్‌ల్ తమిళిసై ప్రసంగించారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలిచిన హిందీ బెల్ట్ ప్రాంతాలను గోమూత్ర రాష్ట్రాలంటూ డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ లోక్‌సభలో మంగళవారం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఖండించారు. తమిళనాడుకు చెందిన ఓ ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని వాపోయారు.
ఉత్తరాది రాష్ట్రాలు గోముద్ర రాష్ట్రాలని గోమూత్ర రాష్ట్రాలు కాదని, దేశాన్ని ప్రాంతాలుగా విభజించడం తగదని స్పష్టం చేశారు. కొన్నేళ్ల క్రితం వరకు తమిళనాడు ప్రజలు తమ ఇంట్లోని దేవుని మండపంలో హుండీ ఉంచి నిత్యం అందులో ఎంతోకొంత డబ్బు వేసేవారని తెలిపారు. అలా దాచిన డబ్బుతో జీవితంలో ఒక్కసారైనా కాశీ(వారాణసి) సందర్శించాలనే తమ కోరిక తీర్చుకునేవారని వివరించారు. కాగా, గత వందేళ్లలో దేశంలో 20,000 దేవాలయాలను ధ్వంసం చేశారని, ఇటీవల వాటిని తిరిగి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. గుజరాత్‌లోని పావగద్‌లో ఇటీవల పునర్నిర్మాణం అయిన కాళీమాత ఆలయం వాటిల్లో ఒకటని పేర్కొన్నారు. ఆలయాల అభివృద్ధితో స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని తెలిపారు.
Updated Date - 2023-12-09T04:18:24+05:30 IST