ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shivdas Meena: తదుపరి సీఎస్‌ శివదాస్‌ మీనా?

ABN, First Publish Date - 2023-05-18T09:14:53+05:30

రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఇరైఅన్బు, డీజీపీ శైలేంద్రబాబుల పదవీకాలం జూన్‌ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- డీజీపీగా శంకర్‌ జివాల్‌!

- పరిశీలనలో రాష్ట్రప్రభుత్వం

పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఇరైఅన్బు, డీజీపీ శైలేంద్రబాబుల పదవీకాలం జూన్‌ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త ప్రధాన కార్యదర్శిగా శివదాస్‌ మీనా, డీజీపీగా చెన్నై నగర పోలీస్‌ కమిషనర్‌ శంకర్‌ జివాల్‌(Shankar Jival) పేర్లు రాష్ట్రప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇరైఅన్బు పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో, తదుపరి సీఎస్‌ ఎంపికపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఈ రేసులో శివదాస్‌ మీనా, మురుగానందం, అతుల్యామిశ్రా, విక్రమ్‌కపూర్‌, కార్తికేయన్‌, హన్స్‌రాజ్‌ వర్మ, ఎస్‌కే ప్రభాకరన్‌ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో శివదాస్‌ మీనాకే అధిక అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 1989 ఐఏఎస్‌ బ్యాచ్‌కి చెందిన శివదాస్‌ మీనా స్వరాష్ట్రం రాజస్థాన్‌. జైపూర్‌లోని మాళవీయ ప్రాంతీయ ఇంజనీరింగ్‌ కళాశాలలో సివిల్‌ ఇంజనీరింగ్‌ అభ్యసించారు. జపాన్‌లో జరిగిన అంతర్జాతీయ పరిశోధనల్లో మాస్టర్‌ డిగ్రీ సాధించారు. 30 ఏళ్లు ఐఏఎస్‌ అధికారిగా పనిచేసిన అనుభవం ఉంది. దివంగత జయలలిత సీఎంగా ఉన్నప్పుడు ఆమె నలుగురు కార్యదర్శుల్లో ఒకరిగా శివదాస్‌ మీనా బాధ్యతలు నిర్వర్తించారు. జయ మరణానంతరం సీఎంగా ఎడప్పాడి పళనిస్వామి బాధ్యతలు చేపట్టిన సమయంలో శివదా్‌సమీనా కేంద్రప్రభుత్వ విధులకు బదిలీ అయ్యారు. అనంతరం ముఖ్యమంత్రిగా స్టాలిన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తిరిగి రాష్ట్రప్రభుత్వ విధులకు తిరిగొచ్చారు. ప్రస్తుతం ఆయన పురపాలక నిర్వహణ శాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సక్రమంగా విధులు నిర్వహింపజేస్తూ, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేస్తున్న వారికి ఈ పదవి ఎంపికలో ప్రాధాన్యం ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎంకే స్టాలిన్‌(MK Stalin), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజీవ్‌రంజన్‌ స్థానంలో ఇరైఅన్బును నియమించారు. ఈ రెండేళ్ల పాలనలో ఇరైఅన్బు సేవలపై సంతృప్తిగా ఉన్న సీఎం.. ఆయన పదవీకాలం పొడిగించాలని యోచించినట్లు సమాచారం. కానీ, గత అన్నాడీఎంకే హయాంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీల పదవీకాలం పొడిగించడంపై అప్పటి ప్రతిపక్షనేతగా స్టాలిన్‌ తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం అలాంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రతిపక్షాల నురచి తీవ్ర విమర్శలు వచ్చే అవకాశముందని సీఎం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ప్రధాన కార్యదర్శిగా కొత్తవారిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

డీజీపీ పదవి రేసులో...

శైలేంద్రబాబు పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో, కొత్త డీజీపీని నియమించాల్సి ఉంది. రెండేళ్లుగా శైలేంద్రబాబు(Shailendra Babu) పనితీరు పలువురి ప్రశంసలు అందుకుంది. శైలేంద్రబాబు పదవీ విరమణకు నెల రోజుల ముందుగా తదుపరి డీజీపీ నియామకానికి సంబంధించి ముగ్గురు పేర్లతో కూడిన జాబితాను రాష్ట్రప్రభుత్వం కేంద్ర హోంశాఖకు పంపించాల్సి ఉంది. వారిలో ఒకరిని డీజీపీగా నియమించేందుకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది. ప్రస్తుతం ఐపీఎస్‌ అధికారుల సీనియారిటీ ప్రకారం చెన్నై నగర పోలీస్‌ కమిషనర్‌ శంకర్‌ జివాల్‌, ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ సంజయ్‌ అరోరా, తమిళనాడు పోలీసు హౌసింగ్‌ బోర్డు డైరెక్టర్‌, చెన్నై నగర పూర్వ పోలీస్‌ కమిషనర్‌ ఏకే విశ్వనాథన్‌, హోంగార్డ్‌ విభాగ చైర్మన్‌ పీకే రవి, మాజీ ప్రత్యేక డీజీపీ రాజేష్‏దాస్‌ తదితరులు క్యూలో వున్నారు. వీరిలో మరో రాష్ట్రానికి వెళ్లి ఢిల్లీ కమిషనర్‌గా ఉన్న సంజయ్‌ అరోరాను రాష్ట్ర డీజీపీగా నియమించే అవకాశం లేదు. అలాగే, లైంగిక వేధింపుల కేసు విచారణ ఎదుర్కొంటున్న రాజేష్‏దాస్‌ పేరు జాబితాలో చోటుచేసుకొనే అవకాశం లేదు. ఇక, పీకే రవి అగ్నిమాపక శాఖ డీజీపీగా వ్యవహరించిన సమయంలో భవనాల ఏర్పాటులో నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో వెయిలింగ్‌ లిస్ట్‌కు బదిలీ అయి, ప్రస్తుతం హోంగార్డు విభాగ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అందువల్ల ఆయన్ని డీజీపీగా నియమించేందుకు ప్రభుత్వం విముఖత చూపుతున్నట్లు సమాచారం. చివరగా శంకర్‌ జివాల్‌, ఏకే విశ్వనాథన్‌లలో ఒకరు డీజీపీగా నియమితులయ్యే అవకాశముంది. అందులోనూ చెన్నై నగర పోలీస్‌ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న శంకర్‌ జివాల్‌కే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే మాజీ మంత్రి ఎస్పీ వేలుమణికి బంధువైనా, విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తారన్న పేరున్న ఏకే విశ్వనాఽథన్‌ను డీజీపీగా నియమించాలని సీనియర్‌ మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే సీఎం మాత్రం శంకర్‌ జివాల్‌వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. శంకర్‌జివాల్‌ ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ఆల్మోరాకు చెందిన వారు. 1990 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన నిజాయతీకి పరుడిగా మంచి పేరుంది. అంతేగాక నిర్భయంగా విధులు చేపట్టడంతో పాటు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడంతో ఆయనే డీజీపీ అయ్యే అవకాశముందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2023-05-18T09:14:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising