Prime Minister Modi : పార్లమెంటులో భద్రతా ఉల్లంఘన తీవ్ర అంశమే
ABN, Publish Date - Dec 18 , 2023 | 03:47 AM
పార్లమెంటులో భద్రతా ఉల్లంఘన తీవ్ర అంశమేనని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇది బాధాకరం, ఆందోళనకరమని.. కానీ దీనిపై వాదులాటలు తగవని అన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు
కానీ, వాదులాటలొద్దు.. ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి
దీని వెనకున్న వారెవరో తేలాలి
ఆ ముగ్గురు ముఖ్యమంత్రులు అనామకులు కాదు
3 రాష్ట్రాల్లో గెలుపు.. 2024లో చరిత్రాత్మక విజయానికి మార్గం
మా ఓట్లు చీల్చేందుకే విపక్షాల ‘కూటమి’ కుట్రలు
ప్రజలు భగ్నం చేశారు: మోదీ
న్యూఢిల్లీ, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటులో భద్రతా ఉల్లంఘన తీవ్ర అంశమేనని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇది బాధాకరం, ఆందోళనకరమని.. కానీ దీనిపై వాదులాటలు తగవని అన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో మోదీ ఆదివారం ‘దైనిక్ జాగరణ్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. ఇద్దరు ఆగంతకులు లోక్‌సభ చాంబర్లోకి దూకి పొగబాంబులు ప్రయోగించిన వైనం, మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయం, సీఎంల ఎంపిక, 2024 లోక్‌సభ ఎన్నికలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. పార్లమెంటు ఘటనపై కేంద్ర ఏజెన్సీలు దర్యాప్తు జరుపుతున్నాయని, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నాయని, లోక్‌సభ స్పీకర్ కూడా తగు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఈ ఘటన తీవ్రతను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదన్నారు. సమష్టి స్ఫూర్తితో దీనికి పరిష్కారం కనుక్కోవాలని, ఇలాంటి అంశంపై జగడాలను నివారించాలని హితవు పలికారు. నిందితుల వెనుక ఉన్నవారెవరు.. వారి ఉద్దేశాలు తెలుసుకోవాల్సిన అవసరముందన్నారు.
వారిది సంకుచిత బుద్ధి..
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ సీఎంలుగా పెద్దగా ఎవరికీ తెలియని విష్ణుదేవ్ సాయ్, మోహన్ యాదవ్, భజన్‌లాల్ శర్మలను నియమించారంటూ వస్తున్న విమర్శలను ప్రధాని తోసిపుచ్చారు. ఈ ముగ్గురికీ చాలా అనుభవం ఉందని.. కఠోర శ్రమ చేసి ఈ స్థాయికి ఎదిగారని స్పష్టం చేశారు. దీనిని ప్రశ్నిస్తున్నవారిని ఆక్షేపించారు. సమాజాన్ని ప్రభావితం చేయగల కొందరు పెద్దలు ఇలా సంకుచిత బుద్ధితో వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. ఇది రాజకీయ రంగానికే పరిమితం కాదని.. ప్రతి రంగంలోనూ ఇలాంటి వైఖరి సమస్యాత్మకంగా మారిందని చెప్పారు. ‘దురదృష్టవశాత్తూ మీడియా దృష్టి కొన్ని దశాబ్దాలుగా కొన్ని కుటుంబాలపైనే ఉంది’ అని తెలిపారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత ప్రదర్శన.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ చరిత్రాత్మక విజయం సాధించబోతోందని చాటిందన్నారు. ఈ ఎన్నికలను లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్నారా అని అడుగగా.. ‘బీజేపీకి జాతీయ స్థాయిలో ఎలాంటి సవాల్ ఎదురు కాదు.. కానీ రాష్ట్రాల్లో మద్దతు లభించడం లేదని ఓ రాజకీయ వర్గం చెబుతూ ఉంటుంది. ఈ భ్రమను తాజా ఫలితాలు పటాపంచలు చేశాయి’ అని బదులిచ్చారు. దక్షిణ భారతం-ఉత్తర భారతం అంటూ విపక్షాలు అబద్ధాల బుడగను ప్రారంభించాయని మోదీ మండిపడ్డారు. నిరాశానిస్పృహలతో విభజన రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారంలోకి రావడానికి వీరు ఏం చేయడానికైనా సిద్ధమవుతున్నారని.. దీనిని యావద్దేశం, ప్రజలు గమనిస్తున్నారని.. వారి అవగాహనపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, జమ్మూకశ్మీరుకు స్వయంప్రతిపత్తిని కల్పించే 370 అధికరణ రద్దుపై సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసిందని మోదీ చెప్పారు. ప్రపంచంలో ఏ శక్తీ ఇక దానిని పునరుద్ధరించజాలదన్నారు.
2వ దశ కాశీ- తమిళ్ సంగమం
కాశీ తమిళ్ సంగమం రెండవ దశను మోదీ ఆదివారం వారాణసీలోని నమో ఘాట్‌లో ప్రారంభించారు. వారాణసీ, కన్యాకుమారి మధ్య నడిచే కాశీ తమిళ్ సంగమం ఎక్స్‌ప్రె్‌సను కూడా మోదీ జెండా ఊపి ప్రారంభించారు. కాశీ తమిళ్ సంగమం ఈనెల 31 వరకు కొనసాగనుంది. తమిళనాడు, పుదుచ్చేరిలకు చెందిన 1,400 మంది ప్రతినిధులు ఈ సంగమంలో పాల్గొంటారని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. వారాణసీ, ప్రయాగ్‌రాజ్, అయోధ్యలను వారంతా సందర్శిస్తారని పేర్కొంది. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని వారాణసీలో ఆదివారం నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో మోదీ ప్రసంగించారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా? లేదా? అనేది నేరుగా తెలుసుకునేందుకు ఒక ఫీడ్‌బ్యాక్ మెకానిజంగా ఈ యాత్ర ఉపయో గపడుతుందన్నారు.
అంబులెన్స్‌కు దారి..
ప్రధాని మోదీ కాన్వాయ్ అంబులెన్స్‌కు దారి ఇచ్చింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారాణసీ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులను మోదీ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనను చూసేందుకు రోడ్లపై జనం బారులు తీరారు. అదే సమయంలో అంబులెన్స్ రావడంతో దానికి ప్రధాని వాహనశ్రేణి దారి ఇచ్చింది. దీంతో ప్రధాని వాహనశ్రేణిని దాటుకుంటూ అంబులెన్స్ వెళ్లిపోయింది. అనంతరం నాదేసర్ ప్రాంతంలోని కటింగ్ మెమోరియల్ స్కూల్ విద్యార్థులతోనూ, సం క్షేమ పథకాల లబ్ధిదారులతోనూ మోదీ మాట్లాడారు.
చర్చకు రాకుండా ప్రధాని పరార్
పార్లమెంటులో భద్రతా ఉల్లంఘనపై చర్చకు రాకుండా ప్రధాని పారిపోతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఆగంతులకు పాస్ మంజూర ుచేయించిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహపై అడిగిన ప్రశ్నలను దాటవేసేందుకే ఇలా చేస్తున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ‘లోక్‌సభలో ఈ నెల 13న జరిగిన అసాధారణ ఘటనపై మోదీ ఎట్టకేలకు మౌనం వీడారు. అసలేం జరిగిందో వివరిస్తూ హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని ఇండియా కూటమి పార్టీలు మొదటి నుంచీ అడుగుతున్నాయి. ఇక ముందూ అడుగుతాయి’ అని స్పష్టం చేశారు.
Updated Date - Dec 18 , 2023 | 03:47 AM