Seaman: ఆమె ఆరోపణలు వాస్తవమైతే.. ఈపాటికి అరెస్టయి ఉండేవాణ్ణి
ABN, First Publish Date - 2023-08-30T10:25:59+05:30
వివాహం చేసుకుని మోసగించానంటూ నటి విజయలక్ష్మి(Actress Vijayalakshmi) చేస్తున్న ఆరోపణలు వాస్తవమైతే ఈపాటికి తనను పోలీసులు
- నామ్ తమిళర్ కట్చి అధినేత సీమాన్
చెన్నై, (ఆంధ్రజ్యోతి): వివాహం చేసుకుని మోసగించానంటూ నటి విజయలక్ష్మి(Actress Vijayalakshmi) చేస్తున్న ఆరోపణలు వాస్తవమైతే ఈపాటికి తనను పోలీసులు అరెస్టు చేసి ఉండేవారని నామ్‌తమిళర్ కట్చి అధినేత సీమాన్(Seaman) అన్నారు. ఈరోడ్‌లో మంగళవారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ... నటి విజయలక్ష్మి పలుమార్లు తనపై తీవ్రమైన ఆరోపణలు చేశారని, ఆమె చెప్పినవన్నీ నిజాలైతే తాను జైలులో ఉండేవాడినన్నారు. విజయలక్ష్మి ఆరోపణలు చేయడం, తాను వాటిని ఖండించడం ఆనవాయితీగా మారిందన్నారు. తనకు భార్యా పిల్లలు ఉన్నారని, తనను నమ్ముకుని లక్షలాది మంది కార్యకర్తల కుటుంబాలున్నాయని, వారి సంక్షేమమే తన ధ్యేయమన్నారు.
ఇకపై విజయలక్ష్మి ఆరోపణలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని రామనాథపురంలో పోటీ చేస్తే తాను తప్పకుండా ఆయనపై పోటీ చేస్తానని ప్రకటించారు. ఏటా రెండు కోట్లమందికి ఉద్యోగాలిస్తానని ప్రకటించిన మోదీ ఇప్పటి వరకూ ఆ హామీని నెరవేర్చలేదన్నారు. దేశవ్యాప్తంగా ఆయనకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. ఈ విషయాన్ని ప్రధాన ప్రతిపక్షాలు ప్రజల్లోకి సక్రమంగా తీసుకెళ్లలేకపోతున్నాయన్నారు. కర్ణాటక ప్రభుత్వం కావేరి జలాలను విడుదల చేయకపోవడం గర్హనీయమని, డీఎంకే మిత్రపక్షమైన కాంగ్రెస్ పరిపాలిస్తున్న ఆ రాష్ట్రం నుంచి నీటి కోసం పోరాడాల్సి వస్తోందంటూ స్టాలిన్‌పై మండాపడ్డారు.
Updated Date - 2023-08-30T10:26:01+05:30 IST