ప్రజాప్రతినిధుల కేసులు త్వరగా తేల్చండి
ABN, First Publish Date - 2023-11-10T03:29:58+05:30
ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేయాలని, ఈ మేరకు ప్రత్యేక ధర్మాసనాలను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఎంపీలు, ఎమ్మెల్యేలపై 5 వేలకుపైగా క్రిమినల్ కేసులు
ప్రజాస్వామ్యంపై తీవ్ర ప్రభావం చూపే అంశం ఇది
కేసుల విచారణను వేగవంతం చేసే బాధ్యత హైకోర్టులదే
ప్రత్యేక బెంచ్‌లు ఏర్పాటుచేయాలి.. సీజే పర్యవేక్షించాలి
సీజేఐ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేయాలని, ఈ మేరకు ప్రత్యేక ధర్మాసనాలను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన ఐదు వేలకుపైగా క్రిమినల్ కేసుల విచారణ పెండింగులో ఉందని, ఇది దేశ రాజకీయ ప్రజాస్వామ్యంపైనే ప్రత్యక్ష ప్రభావం చూపించే తీవ్ర అంశమని పేర్కొంది. ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, అరుదైన, తప్పనిసరి కారణాలుంటే తప్ప వాటి విచారణను వాయిదా వేయకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టులకు, జిల్లా, ప్రత్యేక కోర్టుల న్యాయాధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ‘తమ ప్రజాప్రతినిధిపై (ఎంపీగానీ, ఎమ్మెల్యేగానీ) ప్రజలకు విశ్వాసం ఉండటం అనేది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం సమర్థవంతంగా, ప్రభావవంతంగా పని చేయటానికి అత్యవసరం. కానీ, ప్రజాప్రతినిధులపై ఏకంగా 5 వేలకుపైగా క్రిమినల్ కేసులు విచారణలో ఉండటం అనేది ఈ విశ్వాసానికి పెద్ద అడ్డంకిగా మారుతుంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవ్యవస్థ సభ్యులపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసి ఏడాదిలోగా పరిష్కరించాలని, దోషులుగా తేలిన వారిపై జీవితకాల నిషేధం విధించాలని అశ్విని ఉపాధ్యాయ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపి మార్గదర్శకాలను జారీ చేసింది.
స్థానికంగా నెలకొన్న భిన్న పరిస్థితులు, కారణాల వల్ల అన్ని రాష్ట్రాలకు వర్తించే విధంగా దేశవ్యాప్తంగా ఒకే విధమైన మార్గదర్శకాలను రూపొందించడం సుప్రీంకోర్టుకు కుదరదు. ఆర్టికల్ 227 ప్రకారం విచారణ (ట్రయల్) కోర్టులపై అధికారం హైకోర్టులకు ఉంటుంది. కాబట్టి, ఈ కేసుల్లో విచారణను వేగవంతం చేసే బాధ్యత సహజంగా హైకోర్టులపైనే ఉంటుంది. కేసులపై సమర్థవంతమైన పర్యవేక్షణ, సత్వర విచారణ జరిగేలా అవసరమైన ప్రక్రియ లను హైకోర్టులే రూపొందించాలి.
ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగులో ఉన్న క్రిమినల్ కేసులను సత్వరం పరిష్కరించేందుకు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు ‘ఇన్ రీ డిజిగ్నేటెడ్ కోర్టుల’ పేరుతో సుమోటోగా కేసులను నమోదు చేయాలి. ఈ కేసులపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్న ప్రత్యేక ధర్మాసనంగానీ, లేదా ప్రధాన న్యాయమూర్తి నియమించిన జడ్జీలతో కూడిన ధర్మాసనంగానీ విచారణ జరపాలి. నిర్ణీత వ్యవధిలో ఇది కొనసాగాలి.
జూ ప్రత్యేక అంశానికి సంబంధించిన (సబ్జెక్టు) కేసులను ఆయా అంశాలకు సంబంధించిన ప్రత్యేక కోర్టులకు కేటాయించే బాధ్యతను ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జికి హైకోర్టులు అప్పగించవచ్చు. ఎంపీకి/ఎమ్మెల్యేకు మరణశిక్ష లేదా జీవితఖైదు పడే కేసుల విచారణకు ఈ ప్రత్యేక కోర్టులు ప్రాధాన్యత ఇవ్వాలి. అరుదైన, తప్పనిసరి కారణాలు ఉంటే తప్ప విచారణను ప్రత్యేక కోర్టులు వాయిదా వేయటానికి వీల్లేదు. జిల్లాల వారీగా కేసుల వివరాలను, విచారణను హైకోర్టు వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా పొందుపరచాలి.
తెలంగాణలో 17.. ఏపీలో 92
దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై 2022 నవంబరు నాటికి 5175 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. వీటిలో 40 శాతానికిపైగా, అంటే 2116 కేసులు ఐదేళ్లకు మించి పెండింగ్‌లో ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఏపీలో 2022 నవంబరు నాటికి 92 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, తెలంగాణలో 17 కేసులు పెండింగ్ కేసులు ఉన్నాయని వివరించింది.
సుప్రీం జడ్జిలుగా ముగ్గురి ప్రమాణం
సుప్రీంకోర్టు జడ్జిలుగా గురువారం మూడు హైకోర్టులకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ (ఢిల్లీ), జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసీ (రాజస్థాన్), జస్టిస్ సందీప్ మెహతా (గువాహటి)లు ఈ బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు సీజే జస్టిస్ చంద్రచూడ్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానంలోని మొత్తం 34 జడ్జీల పదవులు భర్తీ అయినట్టయింది. వారి పేర్లను సోమవారమే సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేయగా వెంటనే కేంద్ర ఆమోదించింది.
Updated Date - 2023-11-10T03:29:59+05:30 IST