MP Lakshman : అందుకే ప్రధాని జమిలీ ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారు
ABN, First Publish Date - 2023-09-01T10:30:35+05:30
పెండింగ్ లో ఉన్న బిల్లులను ఆమోదించడం, పెండింగ్ బిజినెస్ కోసమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారని బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. అజెండాపై ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. యూసీసీ (యూనిఫాం సివిల్ కోడ్) అమలు జరగాలని 99 శాతం ప్రజలు కోరుకుంటున్నారన్నారు.
ఢిల్లీ : పెండింగ్ లో ఉన్న బిల్లులను ఆమోదించడం, పెండింగ్ బిజినెస్ కోసమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారని బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. అజెండాపై ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. యూసీసీ (యూనిఫాం సివిల్ కోడ్) అమలు జరగాలని 99 శాతం ప్రజలు కోరుకుంటున్నారన్నారు. జమిలీ ఎన్నికలతో ప్రజాధనం వృథా అయ్యే అవకాశం తగ్గుతుందని లక్ష్మణ్ అన్నారు. అందుకే జమిలీ ఎన్నికలు నిర్వహించాలనేది ప్రధాని ఆలోచన అని తెలిపారు.
జమిలీ ఎన్నికలపై ప్రధాని చర్చకు తెరలేపగా.. చాలామంది మద్దతు తెలిపారన్నారు. న్యాయపరమైన అడ్డంకులను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దేశప్రజల హితం కోసమే ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్టు లక్ష్మణ్ తెలిపారు. ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. ధరల తగ్గింపుపై రాజకీయాలు సరికాదన్నారు. ప్రజల మేలు కోరే గ్యాస్ ధరలు తగ్గిస్తున్నట్టు లక్ష్మణ్ తెలిపారు. కేంద్రం ధరలు తగ్గిస్తే తెలంగాణలో మాత్రం ప్రజలపై భారం మోపేలా వ్యవహరిస్తున్నారన్నారు.
ఇంకా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘‘విపక్షాలకు ముందస్తు ఎన్నికల జ్వరం పట్టుకుందన్నారు. ఇండియా కూటమి ఒక మిధ్య. అభివృద్ధి విరోధులంతా కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డారు. ఇండియా కూటమి ప్రభావం పెద్దగా ఉండదు. అజెండా లేకనే పార్లమెంట్‌లో చర్చలు జరగకుండా అడ్డుకుంటున్నారు. సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం, బీజేపీ పార్టీ సిద్ధంగా ఉంది. ప్రధాని జన్మదినం సెప్టెంబర్ 17 రోజున ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తాం. విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని వెనుకబడ్డ చేతివృత్తులపై జీవించే 140 కులాల వారికి 13 వేల కోట్ల బడ్జెట్ తో 3 లక్షల రుణాలు అందించే పథకానికి శ్రీకారం చుట్టనున్నాం. దేశవ్యాప్తంగా 17 న, తెలంగాణ లో సెప్టెంబర్ 16న ఓబీసీ మోర్చా నేతృత్వంలో జిల్లా, మండల స్థాయిల్లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తాం. చేతివృత్తుల్లో ట్రైనింగ్ ఇవ్వడం, ఆర్థిక సహాయం అందించి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాడమే లక్ష్యంగా ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం అమలు చేయనున్నాం. వచ్చే 5 రాష్ట్రాల ఎన్నికలే లక్ష్యంగా నేషనల్ ఓబీసీ మోర్చా నేతృత్వంలో నేషనల్ లెవెల్ వర్క్ షాప్ ను ఈరోజు నిర్వహించబోతున్నాం’’ అని పేర్కొన్నారు.
Updated Date - 2023-09-01T10:30:35+05:30 IST