మనోళ్లకు ఖతార్‌లో తప్పిన మరణశిక్ష
ABN, Publish Date - Dec 29 , 2023 | 06:30 AM
గూఢచార్యం ఆరోపణలపై అరెస్టయి ఖతర్‌లో మరణశిక్ష పడిన భారత్‌కు చెందిన ఎనిమిది మంది మాజీ సీనియర్ నేవీ అధికారులకు గొప్ప ఊరట లభించింది. వారికి విధించిన శిక్షను తగ్గిస్తూ ఖతర్ న్యాయస్థానం (కోర్టు ఆఫ్ అప్పీల్ ఆఫ్ ఖతర్) కీలక తీర్పు
ఎనిమిదిమంది మాజీ నేవీ అధికారులకు ఊరట
గూఢచర్యం కేసులో విధించిన శిక్ష తగ్గిస్తూ ఖతార్ కోర్టు తీర్పు
ఫలించిన ప్రధాని మోదీ దౌత్యం!
న్యూఢిల్లీ, డిసెంబరు 28: గూఢచార్యం ఆరోపణలపై అరెస్టయి ఖతర్‌లో మరణశిక్ష పడిన భారత్‌కు చెందిన ఎనిమిది మంది మాజీ సీనియర్ నేవీ అధికారులకు గొప్ప ఊరట లభించింది. వారికి విధించిన శిక్షను తగ్గిస్తూ ఖతర్ న్యాయస్థానం (కోర్టు ఆఫ్ అప్పీల్ ఆఫ్ ఖతర్) కీలక తీర్పు వెలువరించింది. దుబాయ్‌లో జరిగిన ‘కాప్ 28’ సదస్సు వేదికగా ఖతర్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీని ప్రధాని మోదీ కలిసిన కొన్ని వారాల్లోనే కోర్టు తీర్పు వెలువడటం గమనార్హం. అయితే, మరణశిక్ష స్థానంలో వారికి కొత్తగా విధించిన శిక్ష వివరాలు తెలియాల్సిఉన్నదని ఖతర్‌లోని భారత్ దౌత్యవర్గాలు తెలిపాయి. తీర్పు సమయంలో మన రాయబారి కోర్టులోనే ఉన్నారని, తీర్పు పత్రాలు చూస్తేగానీ పూర్తి వివరాలు తెలియవని వివరించాయి. అతి కఠిన కారాగార శిక్షను వారికి కోర్టు విధించి ఉండవచ్చునని వార్త లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. తాజా తీర్పుపైనా, జైలు శిక్ష రద్దు కాకపోవడంపైనా ఏమి చేయాలనేది న్యాయబృందం, కుటుంబసభ్యులతో మా ట్లాడుతున్నామని తెలిపింది. తమ ఆప్తులపై వచ్చిన అభియోగాలను కుటుంబసభ్యులు ఖండించారు. ఇజ్రాయెల్ తరఫున వారు గూఢచార్యం చేసినట్టు వచ్చిన ఆరోపణల్లో వాస్త వం లేదని తెలిపారు. నిజానికి, ఇప్పుడు ఖతర్ జైళ్లలో ఉన్న మాజీ అధికారులు నేవీలో అత్యున్నత హోదాలో పనిచేసి పదవి విరమణ పొందారు. అరెస్టు నాటికి వారంతా ఖతర్ సైనిక దళాలకు శిక్షణ తదితర సేవలు అందించే దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అనే ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. వీరిలో పుర్ణేందు తివారీ, సుగుణాకర్ పాకాల, అమిత్ నాగ్‌పాల్, సంజీవ్‌గుప్తా కమాండర్లుగా, నవ్‌తేజ్ సింగ్ గిల్, బీరేంద్ర కుమార్ వర్మ, సౌరభ్ వశిష్ఠ్ కెప్టెన్లుగా సేవలందించారు. సుగుణాకర్ పాకాలా స్వస్థలం విశాఖ జిల్లా. ఇక.. మరో వ్యక్తి రాగేశ్ గోపాకుమార్ నేవీలో గజ ఈతగాడిగా పనిచేశారు. వీరిలో కొందరు భారత యుద్ధ నౌకాదళాలకూ నాయకత్వం వహించారు. గత ఏడాది ఆగస్టులో వీరిని అరెస్టు చేశారు. ఈ ఏడాది మార్చిలో స్పల్ప కాలం విచారించారు. గత అక్టోబరు 26న మరణశిక్ష విధించారు. ‘దహ్రా గ్లోబల్ కేసు’గా పిలిచే ఈ వ్యవహారంలో అభియోగాల వివరాలు బయటకు వెల్లడి కాలేదు. విచారణ సమయంలో పలుమార్లు వారి బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈక్రమంలో శిక్ష తగ్గింపునకు గత నెల పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు సత్వరం స్వీకరించింది. దానిపై సానుకూలంగా ఇప్పుడు నిర్ణయం తీసుకుంది. మాజీ నేవీ అధికారులను తిరిగి భారత్‌కు తీసుకువచ్చేందుకు అన్ని చ ర్యలు తీసుకుంటున్నామని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ ప్రకటించారు. జైలు శిక్షలు కూడా రద్దయి వారంతా భారత్‌కు త్వరలోనే తిరిగి రావాలని కోరుకుంటున్నట్టు కాంగ్రెస్ జాతీయ నేత జైరామ్ రమేశ్ తెలిపారు.
Updated Date - Dec 29 , 2023 | 06:30 AM