ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కులగణనకు టైమొచ్చింది!

ABN, First Publish Date - 2023-10-03T02:04:22+05:30

బిహార్‌ ప్రభుత్వం చేపట్టిన కులగణన.. దేశ రాజకీయాలను ప్రభావితం చేయనుందా..? దేశవ్యాప్తంగా కులాలవారీగా జనాభాను గణించాలన్న డిమాండ్‌ మరింత...

దేశవ్యాప్తంగా చేపట్టాలని డిమాండ్లు

కులసంఘాలు, విపక్షాల నుంచీ ఒత్తిడి

ఇరకాటంలో మోదీ ప్రభుత్వం

దేశవ్యాప్తంగా చేపట్టాలని డిమాండ్లు.. కులసంఘాలతో పాటు విపక్షాల నుంచీ ఒత్తిడి

1881లో తొలిసారి కులగణన

మళ్లీ 1931లో నిర్వహణ

స్వాతంత్ర్యానంతరం జరగనేలేదు

బిహార్‌ ప్రభుత్వం చేపట్టిన కులగణన.. దేశ రాజకీయాలను ప్రభావితం చేయనుందా..? దేశవ్యాప్తంగా కులాలవారీగా జనాభాను గణించాలన్న డిమాండ్‌ మరింత ఊపందుకోనుందా..? వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అన్ని పార్టీలకు ఇదే ప్రధానాస్త్రం కానుందా..? తాజా రాజకీయ పరిణామాలు అవుననే చెబుతున్నాయి. ప్రతిపక్షంలో ఉండగా జనగణనను సమర్థిస్తున్న పార్టీలు.. తీరా గద్దెనెక్కాక ససేమిరా అంటున్నాయి. మండల్‌ కమిషన్‌ నివేదిక బయటపడ్డాక దేశవ్యాప్తంగా కులవిభేదాలు పెచ్చరిల్లిన నేపథ్యంలో.. కులగణన చేపడితే.. తమ జనాభాలో హెచ్చుతగ్గులతో ఆయా కులాలు విభేదిస్తే.. మళ్లీ ఉద్యమాలు చెలరేగుతాయని ప్రతి ప్రభు త్వం భావించడం దీనికి ఓ కారణం. అయితే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు దేశంలోని అన్ని వర్గాలకు సమానంగా అందాలంటే కులాలవారీగా లెక్కలు అవసరమని కొందరి వాదన. బిహార్‌ జనాభాలో బీసీలు 63 శాతం ఉన్నట్లు తేలింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పటికే ఈ పరిమితిని తొలగించి విద్య, ఉద్యోగాల్లో తమకు రిజర్వేషన్‌ పెంచాలని బీసీలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పుడు బిహార్‌ సర్వేతో మరింతగా గళమెత్తే అవకాశాలున్నాయి. చట్టసభల్లోనూ కోటా కోసం పార్టీలపై ఒత్తిడి పెంచుతారు. ‘ఇండియా’ కూటమి, ఇతర ప్రతిపక్షాలు కులగణనకు సై అంటున్న నేపథ్యంలో మోదీ ప్రభుత్వం ఒత్తిడికి లోనవుతోంది. ఈ పరిస్థితుల్లో కులగణనకు సిద్ధపడొచ్చని విశ్లేషకులు అంటున్నారు.

శతాబ్దం కావస్తోంది!

జనాభా లెక్కల్లో కులగణన చేపట్టాలన్న డిమాండ్‌ ఈనాటిది కాదు. దేశంలో 1881లో బ్రిటిష్‌ పాలకులు తొలిసారి జనగణనతోపాటే కులగణన చేపట్టారు. బ్రిటిష్‌ వారి హయాంలో చివరి సమగ్ర కులగణన 1931లో జరిగింది. ఇప్పటికీ ఆ డేటా ఆధారంగానే ప్రభుత్వాల సంక్షేమ కార్యక్రమాలు నడుస్తున్నాయి. స్వాతంత్ర్యానంతరం గద్దెనెక్కిన ప్రభుత్వాలేవీ కులగణన దిశగా అడుగులు వేయలేదు. కేవలం ఎస్సీ, ఎస్టీ జనాభాను మాత్రమే గణిస్తున్నారు. దేశంలో ఓబీసీ జనాభా 52ు ఉంటుందని మండల్‌ కమిషన్‌ సూత్రీకరించింది. 1951 నుంచి జనగణన జరిగిన ప్రతిసారీ కులాలవారీ జనాభా లెక్కలు సేకరించాలన్న డిమాండ్‌ వస్తూనే ఉంది. సుదీర్ఘ చర్చలు, రాజకీయ పోరాటాల తర్వాత 2011లో అప్పటి కాంగ్రెస్‌ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం ‘సామాజిక ఆర్థిక కుల గణన (ఎస్‌ఈసీసీ)’ చేపట్టాలని నిర్ణయించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణ-పట్టణ పేదరిక నిర్మూలన శాఖలు సర్వే చేపట్టి 2016లో తమ డేటాలను ప్రచురించాయి. కానీ వాటిలో కులాలవారీ లెక్కల ప్రస్తావన లేదు. కులాల డేటా వివరాలను కేంద్ర సామాజిక న్యాయం-సాధికారత శాఖకు అప్పగించారు. దీనిపై అధ్యయనానికి ఆ శాఖ ఓ నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదికను ఇప్పటిదాకాబహిర్గతం చేయలేదు. గ్రామీణాభివృద్ధి శాఖపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ 2016 ఆగస్టు 31న లోక్‌సభ స్పీకర్‌కు తన నివేదికను అందజేసింది. ‘డేటాను పరిశీలిం చాం. వ్యక్తుల కులాలు, మతాలకు సంబంధించిన వివరాలు 98.87 శాతం లోపరహితంగా ఉన్నాయి. దేశంలో జనాభా సంఖ్య 118,64,03,770 అని ఎస్‌ఈసీసీ పేర్కొనగా.. 1.35 కోట్ల మంది విషయంలో మాత్రమే సర్వేలో తప్పులు కనిపించాయి. తదనుగుణంగా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించాం’ అని కమిటీ పేర్కొంది. ఆ తర్వాత రాజకీయ పార్టీలేవీ కులగణన ప్రస్తావన తేలేదు. 2021లో జనాభా లెక్కల సమయంలో ఓబీసీల గణన కూడా చేపట్టాలని జాతీయ బీసీ కమిషన్‌ కేంద్రాన్ని కోరింది. దాంతో మళ్లీ దీనిపై చర్చ మొదలైంది. జేడీయూ, ఆర్‌జేడీ, బీఆర్‌ఎస్‌, ఎన్‌సీపీ వంటి విపక్షాలు దీనిని సమర్థించాయి. మోదీ సర్కారు మాత్రం వ్యతిరేకించింది. ఆ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. తర్వాత కరోనా కారణంగా జనాభా లెక్కల సేకరణ వాయిదాపడింది.

మహిళా బిల్లుపై ప్రచారాన్ని

అడ్డుకోవడానికే

బిహార్‌ సర్వే వెల్లడితో వివిధ రాష్ట్రాల్లోనూ ఈ దిశగా కులగణన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓబీసీల ఓటుబ్యాంకుపై కన్నేసిన విపక్షాలు దేశవ్యాప్తంగా కులగణనకు డిమాండ్‌ చేస్తున్నాయి. దీంతో మోదీ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం, ఉమ్మడి పౌరస్మృతిపై లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారానికి బీజేపీ సమాయత్తమవుతోందని.. దీనిని కులగణనతో తిప్పికొట్టి.. దాని ఓబీసీ ఓటుబ్యాంకును కొల్లగొట్టేందుకు విపక్షాలు వ్యూహాత్మకంగా వెళ్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే కచ్చితంగా కులగణన చేపడతామని కాంగ్రెస్‌ తేల్చేసింది. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం కూడా ఈ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఇంకోవైపు.. 2024 ఎన్నికలకు విపక్షాలను ఏకతాటిపైకి తేవడానికి నితీశ్‌ చొరవ చూపగా.. కర్ణాటక విజయం తర్వాత కాంగ్రెస్‌ దానిని హైజాక్‌ చేసిందని జేడీయూ, ఆర్‌జేడీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు బిహార్‌లో కులగణనను విజయవంతం చేసిన ఉత్సాహంతో నితీశ్‌ ఇతర విపక్షాల మద్దతు కూడగట్టేందుకు కసరత్తు మొదలుపెట్టారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

కోర్టుల జోక్యం..

కులగణన విషయంలో కోర్టుల జోక్యమూ కొత్తది కాదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు దామాషా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడానికి తాజా కులాలవారీ లెక్కలు సేకరించాలని మద్రాసు హైకోర్టు గతంలో కులగణన విభాగాన్ని ఆదేశించింది. ఆ ఆదేశాలను 2014లో జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారీమన్‌, జస్టిస్‌ యూయూ లలిత్‌తో కూడిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం కొట్టివేసింది. 2021లో మహారాష్ట్రలో అప్పటి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం ఎస్‌ఈసీసీ సర్వేను బహిర్గతం చేయాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. కోర్టు దానిని తిరస్కరించింది. 2024 లోక్‌సభ ఎన్నికలే ఎజెండాగా బిహార్‌లో నితీశ్‌ ప్రభుత్వం ఈ ఏడాది కులగణనకు శ్రీకారం చుట్టింది. దీనిపై మేలో స్టే విధించిన పట్నా హైకోర్టు.. ఆగస్టులో మాత్రం పచ్చజెండా ఊపింది. జనగణన అధికారం కేంద్రానిదని మోదీ సర్కారు వాదించినా.. ఈ వ్యవహారంలో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. బిహార్‌ కంటే ముందు కర్ణాటకలోనూ కులగణన జరిగింది. 2014లో సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సామాజిక-విద్యా సర్వేకు ఆదేశించింది. 2016 జూన్‌లో నివేదిక వచ్చింది. కానీ సిద్దూ సర్కారు బహిర్గతం చేయలేదు. అలాగే 2021లో తెలంగాణ బీసీ కమిషన్‌ కూడా కులగణన చేపట్టింది. మరి సర్వే జరిగిందో లేదో తెలియరాలేదు. ఒడిసా కూడా ఈ ఏడాది మే 1న కులగణన సర్వే చేపట్టింది. దాని నివేదిక కూడా బయటకు రాలేదు.

Updated Date - 2023-10-03T02:04:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising