Hijab: ఇక చదువు కొనసాగిస్తా.. హిజాబ్‌పై నిషేధం తొలగింపు వార్తపై కర్ణాటక యువతి
ABN, Publish Date - Dec 23 , 2023 | 07:44 PM
హిజాబ్‌పై నిషేధం నేపథ్యంలో చదువుకు దూరమైన కర్ణాటక యువతి ముస్కాన్ ఖాన్ నిషేధం ఎత్తివేతపై హర్షం వ్యక్తం చేసింది.
ఇంటర్నె్ట్ డెస్క్: గతేడాది హిజాబ్‌పై నిషేధం (Hijab row) నేపథ్యంలో చదువుకు దూరమైన కర్ణాటక యువతి ముస్కాన్ ఖాన్..తాజాగా నిషేధం ఎత్తివేతపై హర్షం వ్యక్తం చేసింది. ‘‘హిజాబ్‌పై వివాదం నేపథ్యంలో నేను చదువును వదులుకోవాల్సి వచ్చింది. ఇకపై విద్యాసంస్థల్లో హిజాబ్ ధారణకు అనుమతిస్తామని సీఎం ప్రకటించారు. కాబట్టి నేను చదువును కొనసాగిస్తా’’ అని ఆమె పేర్కొంది (Hijab rows muskan welcoms karnataka cms statement) .
మాండ్యలోని పీఈఎస్ కాలేజీలో బీకామ్ సెకెండియర్ చదివే ముస్కాన్ గతేడాది హిజాబ్‌పై నిషేధాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఆమె వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, నిషేధం అమల్లోకి వచ్చాక ఆమె చదువుకు స్వస్థి చెప్పింది.
‘ఇతర నగరాల్లోని కాలేజీల్లో చదువుకునేందుకు నాకు ఆఫర్లు వచ్చాయి కానీ వాటిని నేను వద్దనుకున్నాను. సొంత ఊరులోనే చదువు కొనసాగించాలని భావించాను. ఇక భవిష్యత్తులో ఎప్పుడూ హిజాబ్ అంశం రాజకీయం కాకూడదని ఆశిస్తున్నాను. నా చదువు నాకు ఎంతో ముఖ్యం. కాలేజీల్లో మునుపటి వాతావరణం ఏర్పడాలని కోరుకుంటున్నా’’ అని ఆమె మీడియాతో పేర్కొంది.
శుక్రవారం మైసూరులో సీఎం సిద్దరామయ్య హిజాబ్‌పై నిషేధానికి సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఏ డ్రెస్సు వేసుకోవాలి, ఏ ఆహారం తినాలనేవి వ్యక్తిగతమని, ఎవరూ జోక్యం చేసుకోకూడదని ఆయన వ్యాఖ్యానించారు. గతేడాది ఏప్రిల్‌లో ముస్కాన్ మూడో సెమిస్టర్‌కు హాజరు కావాల్సి ఉంటుండగా చదువుకు బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం ఆమె అదే సెమిస్టర్ నుంచి చదువు పునఃప్రారంభించాల్సి ఉంటుంది.
కాగా, హిజాబ్ అంశం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయంపై కూడా ముస్కాన్ స్పందించింది. సుప్రీం కోర్టులో అనుకూల తీర్పు వస్తుందన్న నమ్మకం ఉందని వ్యాఖ్యానించింది.
Updated Date - Dec 23 , 2023 | 07:49 PM