Former Minister: ఆ ఆదాయాన్ని ఓటర్లకు పంచుతున్నారు..
ABN, First Publish Date - 2023-02-21T10:15:56+05:30
ఈరోడ్ తూర్పు ఉప ఎన్నికలో అధికార డీఎంకే సరికొత్త ఫార్ములా ప్రయోగిస్తోందని, టాస్మాక్ ఆదాయాన్ని ఓటర్లకు పంచుతోందని అన్నాడీఎంకే సీనియర్
- ఈసీకి అన్నాడీఎంకే ఫిర్యాదు
పెరంబూర్(చెన్నై): ఈరోడ్ తూర్పు ఉప ఎన్నికలో అధికార డీఎంకే సరికొత్త ఫార్ములా ప్రయోగిస్తోందని, టాస్మాక్ ఆదాయాన్ని ఓటర్లకు పంచుతోందని అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి డి.జయకుమార్(Former Minister D. Jayakumar) ఆరోపించారు. డీఎంకే తన అధికార బలంతో పాటూ డబ్బుతో ఉపఎన్నిక గెలవడానికి నిబంధనలు ఉల్లంఘిస్తోందంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహుకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈరోడ్ తూర్పు(Erode East) నియోజకవర్గంలోని టాస్మాక్ దుకాణాల్లో రోజువారీ విక్రయాలకు సంబంధించిన నగదు, సంబంధిత శాఖ మంత్రి ఆదేశాలతో ఓ అధికారికి అప్పగిస్తున్నారని, ఆ డబ్బును ఓటర్లకు అందిస్తున్నారని అన్నారు. ఇలాంటి నగదు ఎన్నికల ఖర్చులో చూపేందుకు అవకాశం లేకపోవడంతో ఈ సరికొత్త టెక్నిక్ వాడుతున్నారని ఆరోపించారు. అలాగే, నియోజకవర్గంలోని 111 ప్రాంతాల్లో ఓటర్లను తరలించి, వారికి తలా రూ.1,000, మూడు పూటలా భోజనం అందిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీల ప్రచార సమయంలో ఓటర్లు ఎవ్వరూ ఉండరాదన్న ఉద్దేశంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందన్నారు. ఎన్నికల్లో గెలించేందుకు అన్ని అడ్డదారులు తొక్కుతున్నారని, ఇలాంటి చర్యలను అడ్డుకొనేలా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని కోరినట్లు జయకుమార్ తెలిపారు.
Updated Date - 2023-02-21T10:15:58+05:30 IST