Karnataka: దారుణం.. దళిత విద్యార్థులతో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయించిన ఉపాధ్యాయులు!
ABN, Publish Date - Dec 18 , 2023 | 02:47 PM
కర్నాటకలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రిన్సిపల్, టీచర్ దళిత విద్యార్థులతో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయించాడు.
ఇంటర్నెట్ డెస్క్: కర్నాటకలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ రెసిడెన్షియల్ పాఠశాలలోని దళిత విద్యార్థులతో (Dalit Students) ప్రిన్సిపాల్, టీచర్ సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయించారు. విద్యార్థులకు శిక్షగా ఈ పని చేయించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగుతోంది. ఇందుకు బాధ్యులైన ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు.
కోలార్ (Kolar) జిల్లాలోని మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ పాఠశాలలో (Morarji Residential School) ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. 6 నుంచి 9 తరగతుల వరకూ ఉన్న ఈ పాఠశాలో 19 మంది బాలికల సహా 243 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే, మొత్తం నలుగురు విద్యార్థులను సెప్టిక్ ట్యాంకులోకి దింపి శుభ్రం చేయించినట్టు తెలుస్తోంది. ఇదే స్కూల్‌కు సంబంధించి మరో వీడియోలో కొందరు విద్యార్థులను బ్యాగులు ధరించి చేతులు పైకెత్తి నిలబడాలంటూ శిక్ష విధించినట్టు వెలుగులోకి వచ్చింది.
ఈ షాకింగ్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్వయంగా ముఖ్యమంత్రి సిద్దరామయ్య జోక్యం చేసుకున్నారు. దీంతో, ఘటనకు బాధ్యులైన ప్రిన్సిపల్ భారతమ్మ, టీచర్ మునియప్పలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వృత్తిపై నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు వారిని సస్పెండ్ (Suspended) చేశారు . కాగా , ఘటనకు సంబంధించి మరో నలుగురు కాంట్రాక్ట్ సిబ్బందిని కూడా విధుల నుంచి తొలగించారు.
మనుషులతో సెప్టిక్ మురుగును శుభ్రం చేయించడాన్ని భారత ప్రభుత్వం మూడు దశాబ్దాల క్రితమే నిషేధించింది. అయితే, ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ఇది కొనసాగుతోంది. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే క్రమంలో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా వెలుగు చూశాయి.
Updated Date - Dec 18 , 2023 | 02:54 PM