లోక్‌సభలో మళ్లీ నేర న్యాయ బిల్లులు
ABN, First Publish Date - 2023-12-13T06:32:52+05:30
దేశంలో ప్రస్తుతం ఉన్న నేర న్యాయ చట్టాల స్థానంలో కొత్త వాటిని ప్రతిపాదిస్తూ గత పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టిన మూడు బిల్లులను కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ, డిసెంబరు 12: దేశంలో ప్రస్తుతం ఉన్న నేర న్యాయ చట్టాల స్థానంలో కొత్త వాటిని ప్రతిపాదిస్తూ గత పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టిన మూడు బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసులను చేరుస్తూ రూపొందించిన కొత్త ముసాయిదా బిల్లులను మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. స్థాయీ సంఘం అనేక మార్పులుచేర్పులు సూచించిందని, వాటన్నింటినీ పొందుపర్చి తాజా బిల్లులను రూపొందించామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ మూడు బిల్లులపై గురువారం సభలో చర్చ జరుగుతుందన్నారు. శుక్రవారం ఓటింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. ముసాయిదా బిల్లులను అధ్యయనం చేయడానికి సమయం కావాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయని.. వారికి 48 గంటల సమయం ఉందని షా చెప్పారు. ప్రధానంగా ఐదు సెక్షన్లలో మార్పులుచేర్పులు చేశామన్నారు. అత్యధిక మార్పులు భాష, వ్యాకరణానికి సంబంధించే ఉన్నాయని వివరించారు. సీఆర్‌పీ చట్టం 1898, ఇండియన్ పీనల్ కోడ్ 1860, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872ల స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిల్లు, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ బిల్లులను మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాగా, మూడు కొత్త బిల్లులను పార్లమెంటు సంయుక్త కమిటీకి పంపాలన్న సూచనలను షా తిరస్కరించారు. స్థాయీ సంఘమే అనేక సిఫారసులు చేసిందని పేర్కొన్నారు. మూడు బిల్లులపై చర్చకు మొత్తం 12 గంటల సమయం కేటాయించనున్నట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు.
Updated Date - 2023-12-13T07:11:16+05:30 IST