భక్త జనసంద్రం శబరిమల
ABN, First Publish Date - 2023-12-11T03:55:07+05:30
పవిత్ర శబరిమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుణ్యక్షేత్రంలో అత్యంత రద్దీ నెలకొంది. స్వామి దర్శనానికి క్యూలైన్లలో 18 గంటలు నిరీక్షించాల్సి వస్తోంది.
రెండు రోజులుగా రోజుకు లక్ష మంది రాక
క్యూలైన్లలో భక్తులు 18 గంటలు
కొట్టాయం, తిరువనంతపురం, డిసెంబరు 10: పవిత్ర శబరిమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుణ్యక్షేత్రంలో అత్యంత రద్దీ నెలకొంది. స్వామి దర్శనానికి క్యూలైన్లలో 18 గంటలు నిరీక్షించాల్సి వస్తోంది. శుక్రవారం నుంచి రోజుకు లక్షమంది వస్తున్నట్లు అంచనా. పోలీసులు, దేవస్థానం సిబ్బంది శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నా వేలాదిగా పోటెత్తుతున్న భక్తులను నియంత్రించడం మహా కష్టంగా మారింది. శనివారం రాత్రి దాక కూడా పరిస్థితి సాధారణ స్థితికి రాలేదు. గంటల కొద్దీ నిరీక్షణతో సహనం కోల్పోయిన కొందరు క్యూలైన్లను బ్రేక్ చేసి.. బారికేడ్లు దూకి పథినెట్టంబడిని చేరుకుంటున్నారు. ఇలాగైతే లాభం లేదని.. ఆన్‌లైన్ క్యూ బుకింగ్‌ను 90 వేల నుంచి 80 వేలకు కుదించారు. ప్రస్తుతం భక్తుల వరుస సన్నిధానం నుంచి శబరి పీఠం ఉంది. అత్యంత నిదానంగా ముందుకుసాగుతోంది. దీంతో దేవస్థానం వర్గాలు ఇకపై వస్తున్న భక్తులను పంబా వద్దనే నిలిపివేస్తున్నారు. సన్నిధానం, పంబా వద్ద అదనపు పోలీసుల బలగాలను మోహరించారు. ఇక ఎరుమేలి, పంబా, నిలక్కల్, ఎలవుంకల్ ప్రాంతాల్లో వీరి వాహనాలు బారులు తీరాయి. కాగా, శుక్రవారం సాయంత్రం నుంచి బాధ్యతలు చేపట్టిన కొత్త బ్యాచ్ పోలీసుల వైఫల్యమే ఈ పరిస్థితికి కారణమనే విమర్శలు వస్తున్నాయి. సెలవు రోజులు కావడంతోనే రద్దీ ఏర్పడిందని.. పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని కేరళ దేవాదాయ మంత్రి కె.రాధాకృష్ణన్ ఆదేశించారు.
దర్శనం వేళలను పొడిగించలేం
భక్తుల తాకిడి ఎంత ఉన్నప్పటికీ, దర్శన వేళలను 17 గంటలకు మించి పొడిగించలేమని శబరిమల ప్రధాన పూజారి చెప్పినట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) శనివారం కేరళ హైకోర్టుకు తెలిపింది. అష్టాభిషేకం, పుష్పాభిషేకాలను రోజుకు 15కు పరిమితం చేసినట్లు వివరించింది. అనూహ్య రద్దీ కారణంగా.. శబరిమలలో సాయంత్రం దర్శన వేళల ప్రారంభ సమయాన్ని గంట ముందుకు జరిపారు. మధ్యాహ్నం 3 నుంచే భక్తులను అనుమతించాలని నిర్ణయించారు. మరోవైపు అప్పచిమేడులో దర్శనం కోసం నిరీక్షణలో ఉన్న తమిళనాడుకు చెందిన 11 ఏళ్ల బాలిక పద్మశ్రీ అస్వస్థతకు గురైంది. పంపా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందింది.
Updated Date - 2023-12-11T03:55:23+05:30 IST