Texas : భయానక పేలుడు, అగ్ని ప్రమాదంలో 18 వేల పశువుల మృతి
ABN, First Publish Date - 2023-04-14T18:46:32+05:30
టెక్సాస్ రాష్ట్ర చరిత్రలో అత్యంత భయానక పేలుడు, అగ్ని ప్రమాదం సంభవించింది.
హూస్టన్ (అమెరికా) : టెక్సాస్ రాష్ట్ర చరిత్రలో అత్యంత భయానక పేలుడు, అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ డెయిరీ ఫార్మ్‌లో జరిగిన ఈ దారుణ సంఘటనలో దాదాపు 18 వేల పశువులు ప్రాణాలు కోల్పోయాయి. ఓ వ్యవసాయ కూలీ తీవ్రంగా గాయపడ్డారు. ఈ వివరాలను టెక్సాస్ వ్యవసాయ కమిషనర్ సిద్ మిల్లర్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
టెక్సాస్ చరిత్రలో పశువుల విషయంలో ఇది అత్యంత భీతావహ అగ్ని ప్రమాదమని సిద్ మిల్లర్ చెప్పారు. దర్యాప్తు జరుగుతోందని, పరిస్థితిని చక్కదిద్దడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. ఈ విషాదం గురించి పూర్తి వివరాలు తెలిసిన తర్వాత వెల్లడిస్తామన్నారు. ఇటువంటి దుర్ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
కాస్ట్రో కౌంటీ షరీఫ్ సాల్ రివెరా మాట్లాడుతూ, పశువుల కొట్టం నుంచి పేడను తొలగించే సిస్టమ్ అతిగా వేడెక్కడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని తెలిపారు. మీథేన్ రాజుకుని ఉండవచ్చునని, దానివల్ల పేలుడు, అగ్ని ప్రమాదం సంభవించి ఉండవచ్చునని చెప్పారు. నిర్దిష్ట కారణం దర్యాప్తులో తెలుస్తుందని చెప్పారు.
ఏనిమల్ వెల్ఫేర్ ఇన్‌స్టిట్యూట్ ఇచ్చిన ట్వీట్‌లో, వ్యవసాయదారులు పశువుల సంరక్షణ కోసం అగ్ని ప్రమాదాలను నివారించే చర్యలను అమలు చేయాలని కోరింది.
ఇవి కూడా చదవండి :
Congress : జాతి వ్యతిరేకులుగా ముద్ర వేయడం ప్రమాదకరం : ఖర్గే
America : దశాబ్దంలో అతి పెద్ద ఇంటెలిజెన్స్ లీక్.. 21 ఏళ్ళ యువకుడి అరెస్ట్..
Updated Date - 2023-04-14T18:46:32+05:30 IST