Nadu-Nedu scheme: పడకేసిన పనులు!
ABN, First Publish Date - 2023-01-28T17:13:19+05:30
శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం గొప్పిలి జడ్పీ ఉన్నత పాఠశాలలో 326 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ రెండో విడత నాడు-నేడు (Nadu-Nedu scheme)లో
‘నాడు-నేడు’! ఇంకెప్పుడు?
నిధులు రాక నిలిచిపోతున్న పనులు
రెండోదశలో రూ.8వేల కోట్లతో పనులు
ఏడాదిన్నరలో ఇచ్చింది రూ.1,500 కోట్లే
మెటీరియల్ కాంట్రాక్టర్లకు నిలిచిన చెల్లింపులు
కమిటీలకు అరకొర నిధులు, ఆగిన నిర్మాణాలు
కర్నూలులో మితిమీరిన అధికార నేతల జోక్యం
గుంటూరులో సగం కూడా పూర్తికాని పనులు
నిధులు రాక ముఖం చాటేస్తున్న కాంట్రాక్టర్లు
శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం గొప్పిలి జడ్పీ ఉన్నత పాఠశాలలో 326 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ రెండో విడత నాడు-నేడు (Nadu-Nedu scheme)లో అదనపు తరగతి గది కోసం రూ.48లక్షలు మంజూరయ్యాయి. అరకొరగా వచ్చిన నిధులు పిల్లర్ల వరకే సరిపోయాయి. నిధుల కొరతతో గది నిర్మాణం ముందుకు వెళ్లలేదు. ఫలితంగా విద్యార్థులు చెట్ల కింద విద్యనభ్యసిస్తున్నారు. ఇసుక, సిమెంట్ కూడా సకాలంలో రాక.. పనులు జరగడంలేదు.
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం (Ycp government) ప్రారంభించిన ‘నాడు-నేడు’ పథకం నిధుల కొరతతో పడకేసింది. ఈ పథకంలో రెండోదశ పనులు అస్తవ్యస్తంగా మారాయి. పేరుకు ప్రతిష్ఠాత్మక పథకమే అయినా నిధుల విడుదలలో మాత్రం ఈ పథకం చిట్టచివరన నిలవడంతో చాలాచోట్ల పనులు ఆగిపోయాయి. ఏడాదిన్నర కిందట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (Cm jagan) రెండో విడత పనులకు శ్రీకారం చుట్టారు. 2022 జూలై నాటికి పనులు పూర్తిచేస్తామని అప్పట్లో ప్రకటించారు. అయితే పరిపాలనా అనుమతులు ఇచ్చేందుకే సుమారు ఏడాది సమయం పట్టింది. ఇప్పటివరకూ విడుదల చేసిన నిధులతో పనులు చేసిన ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీలు రావాల్సిన వాటికోసం ఎదురుచూస్తున్నారు. 2023 జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పటికీ కూడా ఆ పనులు పూర్తవుతాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 22,199 పాఠశాలల్లో రూ.8వేల కోట్ల అంచనాతో రెండో దశ పనులను 2021 ఆగస్టులో ప్రారంభించారు. ఏడాదిన్నర దాటిపోయినా ఇప్పటివరకూ విడుదల చేసిన నిధులు కేవలం రూ.1,500 కోట్లే. మిగిలిన నిధుల విడుదలకు మరో ఐదారేళ్లు పట్టే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో వైసీపీ ప్రభుత్వానికి మిగిలిన ఏడాది కాలంలో ఈ పనులు పూర్తికావడం కష్టమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
నిధుల విడుదలలో వైఫల్యం
నాడు-నేడు నిధులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచే రావడం లేదు. ప్రపంచ బ్యాంకు నుంచి కొంతమేర రుణాన్ని సర్కారు సమీకరించింది. ఇక అమ్మఒడి పథకంలో పాఠశాల భవన నిర్వహణ నిధి కింద రూ.430 కోట్లు మినహాయించుకుంది. తల్లులకు అందాల్సిన నిధుల్లో ముందుగానే కోత పెట్టినా వాటిని కూడా ప్రభుత్వం ఇతరత్రా అవసరాలకు వాడేసింది. ఈ కాంపోనెంట్‌లో ఇప్పటివరకూ సుమారు రూ.వంద కోట్లు మాత్రమే నాడు- నేడుకు ఇచ్చింది. ఇలా వివిధ రూపాల్లో సమీకరిస్తున్నా సక్రమంగా నిధులు విడుదల చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఇటీవల మెటీరియల్ ధరలు భారీగా పెరిగిపోవడంతో ప్రభుత్వం అరకొరగా ఇస్తున్న నిధులు ఏమూలకూ సరిపోవడం లేదు.
అనకాపల్లిలో ఆగిన మెటీరియల్ సరఫరా
అనకాపల్లి జిల్లాలో రెండోదశ కింద 614 పాఠశాలల్లో అదనపు భవనాలు, వసతుల కల్పన కోసం రూ.260 కోట్లు నిధులు మంజూరుచేశారు. 317 పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణానికి రూ.185 కోట్లు, 218 పాఠశాలలకు ప్రహరీల నిర్మాణానికి రూ.40 కోట్లు, 79 పాఠశాలల మరమ్మతులు, ఇతరత్రా నిర్వహణ పనులు చేపట్టేందుకు రూ.35కోట్లు కేటాయించారు. గత జూన్ నెలాఖరు వరకు పాఠశాల కమిటీల ఖాతాలకు రివాల్వింగ్ ఫండ్ జమ కాలేదు. ఎట్టకేలకు తొలిదశ 15శాతం నిధుల కింద రెండువిడతలుగా రూ.50.34 కోట్లు జమచేశారు. గత జూలై నుంచి పనులు ప్రారంభించారు. కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో మెటీరియల్ సరఫరా నిలిపివేశారు. దీంతో పనులు ఆగిపోయాయి. ఇక విశాఖ జిల్లాలో నాడు-నేడు రెండోదశ కింద 321 పాఠశాలల్లో అదనపు గదులు, ప్రహరీలు, తదితర పనులు రూ.123.95 కోట్లతో ప్రతిపాదించారు. పనులు ప్రారంభం కోసం గతేడాది ఏప్రిల్‌లో ప్రతి పాఠశాల కమిటీ ఖాతాకు 15శాతం సొమ్మును రివాల్వింగ్ ఫండ్ కింద ప్రభుత్వం జమచేసింది. ఆ తర్వాత నిధులు రాకపోవడంతో పనులు ఆగిపోయాయి.
మన్యంలో పడకేసిన పనులు
పార్వతీపురం మన్యం జిల్లాలో నాడు-నేడు రెండో దశ పనులు నిదుల కొరతతో పడకేశాయి. జిల్లాలోని 414 పాఠశాలలు, 117 అంగన్వాడీ కేంద్రాలు, 14 జూనియర్ కళాశాలల్లో రెండో విడత నాడు-నేడు పనులు చేపట్టేందుకు రూ.146కోట్లతో అంచనాలు రూపొందించారు. దీనికి సంబంధించి గతేడాది ఆగస్టులో రూ.22.45 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధుల వరకు పనులు పూర్తిచేశారు. మిగిలిన పనులు నిధుల కొరతతో ముందుకు సాగని పరిస్థితి. ఇక శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నాడు-నేడు ఫేజ్-2 పనులకు సంబంధించి పాఠశాలల్లో 210గదుల నిర్మాణానికి రూ.129.55 కోట్లు మంజూరు అయ్యాయి. కానీ సగం నిధులు కూడా రాలేదు. వచ్చిన కొద్దిపాటి నిధులతో సిమెంట్, ఇసుక, రాళ్లు వేసి.. కొద్దిగా పిల్లర్లను నిర్మించి వదిలేశారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి.
విజయనగరంలో పలకల కొనుగోలుతో సరి
విజయనగరం జిల్లాలో రూ.237.47 కోట్లతో 1,100 అదనపు పాఠశాల భవనాలకు పరిపాలన అమోదం ఇచ్చారు. నిధులు మాత్రం అరకొరగా విడుదల చేశారు. ప్రభుత్వం మొదటి విడత నిధులు విడుదలచేసి, తాము సూచించిన కంపెనీ నుంచి సిరామిక్ పలకలు, గ్రానైట్ పలకలు కొనుగోలు చేయాలని సూచించింది. దీంతో భవన నిర్మాణాల కన్నా ముందుగా పలకలు కొనుగోలు చేశారు. చాలాచోట్ల పునాదుల స్థాయిలో.. కొన్ని చోట్ల పిల్లర్లు వేసి.. మరికొన్ని శ్లాబులు వేసిన తరువాత పనులు నిలిచిపోయాయి.
తూర్పులో ఎక్కడి పనులు అక్కడే...
తూర్పుగోదావరి జిల్లాలో నాడు- నేడు పనులు నత్తనడకన సాగుతున్నాయి. రెండో దశ కింద రూ.271 కోట్లతో 675 పనులు మంజూరయ్యాయి. కానీ వీటికి రివాల్వింగ్ ఫండ్ కింద రూ.58 కోట్లు మాత్రమే విడుదల చేశారు. గతేడాది విద్యా సంవత్సరం ప్రారంభంలో పనులు ప్రారంభించారు. కొన్నిచోట్ల 30శాతం వరకూ పూర్తయ్యాయి. మళ్లీ రివాల్వింగ్ ఫండ్ విడుదల చేయకపోవడంతో ఎక్క డి పనులు అక్కడే ఆగిపోయాయి.
పశ్పిమలో తాత్సారం..
పశ్పిమగోదావరి జిల్లాలో నాడు-నేడు పథకం సెకండ్ ఫేజ్ కింద 739 పాఠశాలలు ఎంపికయ్యాయి. తరగతి గదులు, మరుగుదొడ్లు. ప్రహరీల నిర్మాణం, ఇతర మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. ఈ పనులకు ప్రభుత్వం రూ.259కోట్లు కేటాయించగా ఇప్పటివరకు రూ.52కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఆ నిధుల మేరకే పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందన్న ఉద్దేశంతో కొన్నిచోట్ల అదనంగా పనులు చేపట్టారు. తీరా ప్రభుత్వం నిధుల విడుదల చేయకుండా తాత్సారం చేస్తోంది. వచ్చే ఏప్రిల్ నాటికి పనులు పూర్తి కావాలి. ఇప్పటివరకు సెకండ్ ఫేజ్‌లో 25 శాతం మాత్రమే పూర్తయ్యాయి. నిధుల కోసం పాఠశాల కమిటీలు ఎదురుచూస్తున్నాయి.
గుంటూరు జిల్లాలో...
విభజిత గుంటూరు జిల్లాలో 206 గ్రామ సచివాలయాలు, 155 రైతు భరోసా కేంద్రాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం రూ.113.04 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎ్‌స కింద వీటిని నిర్మించాలని భావించారు. తొలినాళ్లలో హడావుడి చేసిన ప్రభుత్వం ఆ తరువాత నిధులు కేటాయింపులు వాయిదా వేస్తూ వచ్చింది. దీంతో కాంట్రాక్టర్లు నిర్మాణాలను ఆపేశారు. అధికారులు ఎంత ప్రయత్నించినా నిధులు వస్తాయన్న నమ్మకంలేని కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దీంతో వీటి నిర్మాణాలు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. ప్రస్తుతం జిల్లాలో 98 గ్రామ సచివాలయాలు, 41 రైతు భరోసా కేంద్రాలు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన 108 సచివాలయాలు, 114 రైతు భరోసా కేంద్రాలు వివిధ దశల్లో ఉన్నాయి. నిర్మాణ దశలో ఉన్న 108 సచివాలయాల్లో 45 తుది దశకు చేరుకోగా, పదిహేనింటికి స్లాబులు వేశారు. మరో 24 సచివాలయాలు పైకప్పు దశలో ఆగిపోగా, 20 పునాదుల దశలోనే ఆగిపోయాయి. 2 సచివాలయాలకు పునాదులు కూడా పడలేదు. ఇంకో 2 సచివాలయాలు అసలు ప్రారంభానికే నోచుకోలేదు. కాగా నిర్మాణ దశలో ఉన్న 114 ఆర్బీకేల్లో 15 తుది దశకు చేరుకోగా, 29 పైకప్పు దశలో, 52 పునాదుల దశలో, 11 పునాదులు కూడా పడని దశలో ఆగిపోయాయి. మరో 7 భవనాలు నిర్మాణానికి కూడా నోచుకోలేదు. ఈ జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారయింది. నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని ఆదేశాలు జారీ చేస్తున్న ప్రభుత్వం అందుకు తగిన నిధులు కేటాయించకపోవడంతో పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.
పదో స్థానంలో ప్రకాశం జిల్లా
నాడు-నేడు రెండు, మూడు విడతల పనుల పురోగతిలో ప్రకాశం జిల్లా రాష్ట్రంలో పదోస్థానంలో నిలిచింది. నిధులు లేక 3నెలలగా పనులు నిలిచిపోయాయి. జిల్లాలో నాడు-నేడు కింద పాఠశాలలకు కేటాయించిన నిధుల్లో 14శాతమే విడుదలయ్యాయి. మనబడి, నాడు-నేడు రెండు, మూడుదశల్లో మొత్తం 978 పాఠశాలలు ఎంపికచేశారు. వాటిలో 1,559 ప్రాజెక్టులకు రూ.428.17 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. రివాల్వింగ్ ఫండ్ 15శాతం కింద రూ.60.02కోట్లు, ఇసుకకు రూ.32.27లక్షలు, సీపీఎంకు రూ. 3.78కోట్లు, మెటీరియల్‌కు రూ.69.67 కోట్లు వ్యయం చేశారు. విడుదలైన రూ.60.02కోట్లు పోను అదనంగా రూ.21.57 కోట్లు వ్యయ మైంది. ఈ బిల్లుల కోసం సప్లయిర్లు ఒత్తిడి చేస్తుండటంతో సమాధానం చెప్పుకోలేక హెచ్‌ఎంలు ఇబ్బందులు పడుతున్నారు.
కర్నూలు జిల్లాలో నేతల సిగపట్లు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మితిమీరిన రాజకీయ జోక్యంతో మనబడి నాడు-నేడు రెండో విడత పనులు ప్రారంభించడంలో జాప్యం నెలకొంటోంది. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన వివిధ అభివృద్ధి పనులు వివాదాల కారణంగా కొన్నిచోట్ల మొదలుపెట్టలేదు. ఈ పనులను తామే చేయాలంటూ వైసీపీ నాయకుల మధ్య పోటీ ఏర్పడటంతో జిల్లా విద్యాశాఖ అధికారులు, ఇంజనీరింగ్ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1061 పాఠశాలలు, 23 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వివిద అభివృద్ధి పనులకు రూ.526 కోట్ల నిధులు మంజూరు చేశారు. రూ.92 కోట్లు రివాల్వింగ్ ఫండ్ విడుదలైంది. ఇందులో రూ.88 కోట్లు ఖర్చు చేయగా.. ఇంకా రూ.4 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. పనులు నత్తనడకన కొనసాగుతుండటంతో విద్యార్థులు, బోధన సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విజయనగరం జిల్లా కేంద్రంలోని బాబామెట్టలో ఉన్న బాలికల ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు వసతులు చాలని కారణంగా 15 గదులు అదనంగా నిర్మించేందుకు నాడు-నేడు పథకం కింద రూ.1.74కోట్లతో పరిపాలన ఆమోదం ఇచ్చారు. మొదటి విడతగా రూ.35.6లక్షలు విడుదల చేశారు. ఈ నిధులు ఉన్నంత వరకు నిర్మాణాలు చేపట్టారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో మిగిలిన పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి.
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం కల్లుబావిలోని ప్రకాష్ నగర్ పురపాలక ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు 485 మంది విద్యార్థులు ఉన్నారు. రెండో విడత నాడు-నేడు కింద ఐదు అదనపు గదులు రూ.60లక్షలతో మంజూరయ్యాయి. మొదటి విడత కింద గత జూలైలో రూ.9లక్షలు రావడంతో, టాప్ లెవెల్ పనులు పూర్తి చేశారు. మరో విడత నిధుల విడుదలలో జాప్యంతో పనులు నిలిపివేశారు.
పశ్పిమగోదావరి జిల్లా భీమవరం మండలం బేతపూడి జడ్పీ పాఠశాలకు నాడు-నేడు సెకండ్ ఫేజ్ కింద రూ.1.07 కోట్లు కేటాయించగా ఇప్పటివరకు రూ.23లక్షలు మాత్రమే మంజూరయ్యాయి. ఆ మేరకు పనులు పూర్తిచేశారు. మిగిలిన సొమ్ములు పడితే పనులు నిర్వహిద్దామని చూస్తున్నారు. ఇంకా మూడు అదనపు తరగతి గదులు, ప్రహరీ, మరుగుదొడ్ల నిర్మాణం, కొన్ని మరమ్మతులు చేయాల్సి ఉంది.
Updated Date - 2023-01-28T17:14:38+05:30 IST