ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఉత్తరాంధ్రలో ఉత్తుత్తి ప్రాజెక్టులే!

ABN, First Publish Date - 2023-11-28T01:45:47+05:30

ఉత్తరాంధ్రలో రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగంలో అమలు చేస్తున్న పథకాల పురోగతి అంతా పాలకుల అతిశయోక్తుల్లో మాత్రమే కనపడుతున్నది. ఉత్తరాంధ్రలో (విశాఖను...

ఉత్తరాంధ్రలో రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగంలో అమలు చేస్తున్న పథకాల పురోగతి అంతా పాలకుల అతిశయోక్తుల్లో మాత్రమే కనపడుతున్నది. ఉత్తరాంధ్రలో (విశాఖను మినహా ఇస్తే) రాయలసీమ లాగా పేదరికం ఎక్కువ, వలసలూ ఎక్కువే. ఎక్కువ గ్రామీణ ప్రాంతాలుగా వుండి ఉపాధి కల్పన అంతంత మాత్రమే. మిగిలిన రెండు జిల్లాలతో పోల్చుకొంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిస్థితి మరీ దయనీయం. అయితే రాయలసీమకు భిన్నంగా వర్షపాతం ఎక్కువ, నదులూ ఎక్కువే. ఉన్న నదులపై ఆనకట్టలు, బ్యారేజీలు తప్ప వరద నీరు నిల్వ చేసుకొనే పది టీఎంసీల నీళ్లు నిల్వ చేయగల ఒక్క రిజర్వాయరు కూడా లేదు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ హయాంలో నిర్మించిన 19 టీఎంసీల నిల్వ సామర్థ్యం గల హీర మండలం జలాశయం నేడు దిక్కు లేకుండా పోయింది. టీడీపీ హయాంలో జరిగిన పురోగతి తప్ప ఈ నాలుగేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఒక్క కొత్త ప్రాజెక్టు పూర్తి చేసింది లేదు. ఎకరా భూమికి అదనంగా నీళ్లు ఇవ్వలేదు. పైగా ఆ మధ్య రాష్ట్ర ఇంజనీరింగ్ చీఫ్ ఉత్తరాంధ్రలో సాగునీటికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా నిధులు వ్యయం చేయలేదని నిజం అంగీకరించడం కొసమెరుపు.

తాజా పరిణామం ఏమిటంటే 51 శాసనసభ స్థానాలుంటే 49మంది వైసీపీ ఎమ్మెల్యేలను 2019 ఎన్నికల్లో గెలిపించిన రాయలసీమను ఉద్ధరించే కార్యక్రమం పూర్తయినందున రాష్ట్రంలో ఇక మిగిలిన మెట్ట ప్రాంతం ఉత్తరాంధ్రను ఉభయ గోదావరి జిల్లాల్లాగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు చేసింది. ఇందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖకు మారనున్నట్లు చెబుతున్నారు. నాలుగన్నరేళ్ల కాలంలో జరగని అభివృద్ధిని ఆరు నెలల్లో పూర్తి చేస్తామని డాంబికాలకు పోతున్నారు.

ముందుగా విశాఖ ఉద్ధరణ గురించి చూద్దాం. రుషి కొండను బోడి గుండు చేసి కొన్ని వందల కోట్ల రూపాయల వ్యయంతో భవంతులు నిర్మించి ఇదే అభివృద్ధి అని నమ్మమంటున్నారు. తీరం వెంబడి ఉన్న పోర్టులన్నీ అదానీకి అప్పజెప్పి ఇదే పురోగతి అని ఒప్పుకోమంటున్నారు. 43 మంది బలిదానాలతో నిర్మింపబడిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు విప్పకుండా పైగా నిత్యం వేలాది మంది కార్మికులను బజారుకెక్కేట్టు చేసి దీనినే విశాఖపట్నం అభివృద్ధి అని చెవుల్లో పూలు పెట్టి విశ్వసించమంటున్నారు. తీరా అసలు పరిస్థితి చూస్తే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో పది లక్షల ఎకరాలు సాగు భూమి వుంటే 4.9 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతున్నది. వైసీపీ నాలుగేళ్ల కాలంలో ఒక్క ఎకరాకు అదనంగా జిల్లాలో సాగునీరు ఇవ్వలేదు. సాక్షాత్తు తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి శ్రీకారం చుట్టిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసి వుంటే ఒక్క ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోనే 3.21లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు అందేది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 3.94 లక్షల ఎకరాలకు సాగునీరు లభించేది. తుదకు సాగునీరు అటుంచి ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో దాదాపు ఎనిమిది లక్షల మందికి ఈ పథకం తాగునీరు అందించుతుంది. ఈ పథకం తొలి అంచనా వ్యయం రూ.7124.10కోట్లయితే ప్రస్తుతం రూ.18వేల కోట్లకు చేరిందంటున్నారు. ఉత్తరాంధ్రను ఉద్ధరించుతామని డాంబికాలకు పోతున్న వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగున్నర ఏళ్లలో కేవలం అయిదు కోట్లు కూడా సుజల స్రవంతిపై వ్యయం చేయలేదు. ఈ నిధుల్లో సింహభాగం పాత బిల్లులు, సిబ్బంది జీతభత్యాలకు సరిపోయింది.

దేశ పటంలోనే గాక ప్రపంచ పటంలో అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దదలచిన విశాఖ తాగునీటికి పోలవరం నుంచి కేటాయించిన 23.99 టీయంసీల నీళ్లతో పాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అయితే గియితే పూర్తి అయినా ఈ పథకానికి కేటాయించిన 63.20 టీయంసీల నీళ్లు ఎక్కడ నుండి తెస్తారు? ఈ రెండింటికీ నీళ్లు సరఫరా కావాలంటే పోలవరం ప్రాజెక్టు 45.72 మీటర్లు ఎత్తుకు నిర్మాణం జరిగితే తప్ప వీలు కాదు. పోలవరం ఎడమ కాలువ సిల్ లెవల్ 40.54 మీటర్లు. 41.15 మీటర్ల వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగితే (ఇదీ ఊహా చిత్రమే) ఉత్తరాంధ్ర మొత్తం కథ కంచికి చేరుతుంది. తాజాగా పోలవరం ప్రాజెక్టు గురించి పిడుగులాంటి వార్త వెలువడింది. 41.15 మీటర్ల వరకు మాత్రమే నీళ్లు నిల్వ చేసే విధంగా నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమౌతోందంటున్నారు. ఇదే జరిగితే పోలవరం పూర్తి స్థాయిలో ఎప్పుడు నిర్మాణం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఫలితంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో పాటు విశాఖకు తాగునీటి సరఫరా పథకాల గురించి మరచిపోవలసిదే. ఇదీ పరిపాలన రాజధాని కాబోయే విశాఖ జిల్లా వ్యధాభరిత కథనం.

రాయలసీమలో సగటు వర్షపాతం 500 మిల్లీమీటర్లతే ఉత్తరాంధ్రలో బాగా వెనుకబడిన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సగటు వర్షపాతం 1400 మిల్లీమీటర్లుగా వుంది. రాయలసీమ కన్నా ఇప్పటికీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా బాగా వెనుకబడి వుంది. ఈ జిల్లాలో వంశధార నాగావళి ముఖ్యమైన నదులు. ఇవి రెండు అనుసంధానం చేస్తే శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో 50 వేల ఎకరాలకు అదనంగా సాగునీరు అందుతుంది. ప్రభుత్వ గణాంకాల మేరకు ఒక్క వంశధార నుండే ఏటా 50 నుండి వంద టీయంసీల నీరు సముద్రం పాలౌతోంది. ఈ జిల్లాలో 25 శాతం నీరు మాత్రమే ఉపయోగించుకొంటుండగా 75 శాతం నీళ్లు సముద్రం పాలౌతున్నాయి. నీరు నిల్వ చేసుకునే జలాశయాలుంటే వంద టీయంసీల నీరు నిల్వ చేసుకోవచ్చు. ఇంకా జిల్లాలో మహేంద్ర తనయ (వంశధార ఉపనది), సువర్ణముఖి, వేగవతి, గోముఖి, చంపావతి, బాహుదా, కుంభికోట గెడ్డ దాదాపు పది నదులు వున్నాయి. 1962లో రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు గొట్టా బ్యారేజీ నుండి ఒడిషా ఆంధ్రప్రదేశ్ చెరిసగం నీరు వాడుకోవలసి ఉంది. వంశధార ట్రిబ్యునల్ కూడా 115 టీయంసీల నీరు గొట్టా బ్యారేజీ వద్ద లభ్యమౌతుందని నిర్ధారించింది. ప్రభుత్వ గణాంకాల మేరకే పాతిక టీయంసీల నీరు కూడా ప్రస్తుతం వినియోగంలో లేదు. వంశధార నాగావళి నదుల అనుసంధానం చేస్తే సముద్రం పాలౌతున్న పది టీయంసీల నీళ్లను బీడువాడుతున్న 50వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని టీడీపీ హయాంలో ఇందుకు చెంది వంశధార నాగావళి అనుసంధానం పనులు దాదాపు 60శాతం పూర్తయ్యాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మొదట్లో వంశధార నాగావళి నదులు అనుసంధానం వెంటనే పూర్తి చేస్తామని హామీల వర్షం కురిపించారు. కాని ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది.

తెలుగుదేశం హయాంలోనే దాదాపు పూర్తయిన హీర మండలం (19 టీయంసీలు) నుంచి 33 కిమీ దూరంలో గల నాగావళి నదిపై ఉన్న నారాయణపురం ఆనకట్ట వరకు గ్రావిటీ ద్వారా నీళ్లు తరలిస్తే అనుసంధానం పూర్తవుతుంది. హీరమండలం రిజర్వాయర్ లెవల్ 43.705 మీటర్లయితే నారాయణపురం ఆనకట్ట లెవల్ 28 మీటర్లుగా వుంది. టీడీపీ హయాంలో ఈ అనుసంధానానికి చెందిన పనులు 60 శాతానికి పైగా జరిగితే ఉత్తరాంధ్రను ఉభయ గోదావరి జిల్లాల్లాగా చేయదలచిన వైసీపీ పాలనలో 20 శాతం కూడా పనులు జరగలేదు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ వుంది. వంశధార ట్రిబ్యునల్ గతంలో జరిగిన ఒప్పందం మేరకు వంశధారలో ఒడిశా ఆంధ్రప్రదేశ్ చెరిసగం నీళ్లు వాడుకోవాలని నిర్ధారిస్తూ నేరెడి వద్ద బ్యారేజీ దానితో పాటు సైడ్ వేర్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్‌కు అనుమతి ఇచ్చింది. ఫలితంగా ఒడిశాలో కేవలం 106 ఎకరాల భూమి ముంపుకు గురౌతుందని ఈ భూమిని ఒడిశానే సేకరించి ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. ఇందుకు ససేమిరా అంటూ ఒడిశా సుప్రీంకోర్టు కెక్కింది. ఈ అంశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒడిశా ముఖ్యమంత్రిని ఒప్పించే యత్నాలు కించిత్తు కూడా చేయలేదు. తీరా నాలుగున్నర ఏళ్ల కాలం గడిపేసి ఇప్పుడు గొట్టా బ్యారేజీ నుంచి హీరమండలం రిజర్వాయర్‌కు ఎత్తిపోతలకు సిద్ధమౌతున్నారని చెబుతున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో మహేంద్ర తనయ అఫ్‌షోర్ (రేగుల పాడు జలాశయం) మరొక ముఖ్యమైన పథకం కూడా నిధుల లేమితో సతమతమౌతోంది. ఇక విజయనగరం జిల్లాలో పలు మధ్య తరహా ప్రాజెక్టులు అర్ధాంతరంగా మిగిలిపోయి ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉన్న ఉత్తరాంధ్రకు సాగునీరు అందించి వ్యవసాయం కుదుటపడేట్టు చేయడం మాని విశాఖను పరిపాలన రాజధాని చేసి ఎన్నికల వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడ కూర్చొని సమీక్షా సమావేశాలు నిర్వహిస్తే ఈ ఆరు నెలల కాలంలో ఏం అభివృద్ధి సాధిస్తారు? వాస్తవంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమే లేనపుడు దేన్ని గురించి సమీక్ష చేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే.

వి. శంకరయ్య

విశ్రాంత పాత్రికేయులు

Updated Date - 2023-11-28T01:45:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising