ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బీసీలకు భరోసా ఈ ఎన్నికలు!

ABN, First Publish Date - 2023-11-29T02:16:58+05:30

గత కొన్ని దశాబ్దాలుగా ఊరిస్తున్న బీసీ రాజ్యాధికారం అనే వాదానికి ప్రత్యేక ఊపు తెప్పించడమే గాక, బీసీ ఓటు బ్యాంకే ప్రధాన నినాదంగా ఈ ఎన్నికలు...

గత కొన్ని దశాబ్దాలుగా ఊరిస్తున్న బీసీ రాజ్యాధికారం అనే వాదానికి ప్రత్యేక ఊపు తెప్పించడమే గాక, బీసీ ఓటు బ్యాంకే ప్రధాన నినాదంగా ఈ ఎన్నికలు కొనసాగుతున్నాయి. బీసీల గురించి ప్రతి పార్టీ ఆలోచించేలా ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయని, సకల బీసీ సంఘాలు ఒక కొత్త ఒరవడిలో, కొత్త నాయకత్వంలో తమ బీసీ వాదాన్ని జాతీయ స్థాయిలో ముందుకు తీసుకెళ్లడం శుభపరిణామం అని చెప్తున్నారు బీసీ మేధావులు.

బహుజన ఉద్యమంగా సాగిన తెలంగాణ పోరాటంలో సకల సబ్బండ వర్గాలు కలిసి ముందుకు కదిలాయి. కానీ స్వీయ పాలనలో ఎన్నో బహుజన కులాలకు ప్రాతినిధ్యం కరువైంది. ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్‍ఎస్ (నేటి బీఆర్‌ఎస్) నాయకత్వమంతా ఆధిపత్య వర్గాలతో నిండివుండి, బహుజన సబ్బండ వర్గాలను ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే చూసింది. తెలంగాణ స్వీయ పాలనలో బీసీల రాజకీయ ఆర్థిక ఎదుగుదల మీద ఎందరో మేధావులు తమ గొంతును నిర్విరామంగా వినిపించినా గత పదేళ్లుగా పాలకుల చెవికెక్కలేదు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో సామాజికవేత్తల ఆధ్వర్యంలో జరిగిన సామాజిక ప్రయోగాల ఫలితంగా మేనిఫెస్టోలలో బహుజన వర్గాలకు పెద్దపీట వేయక తప్పలేదు అన్ని పార్టీలకు.

ఎన్నో విధాలుగా, పలు దఫాలుగా సాగిన బీసీ ఉద్యమ ఫలితంగా ఏ రాజకీయ పార్టీ గాని ఏ ప్రభుత్వంగాని వారి ప్రాతినిధ్యాన్ని కాదనలేని అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదే అదనుగా భావించిన జాతీయ పార్టీలు దేశ జనాభాలో మెజారిటీ ప్రజలైన బీసీల కోసం తామున్నామంటూ ముందుకొచ్చి, వారి మేనిఫెస్టోలలో బీసీలకు పెద్దపీట వేసి సంఘీభావాన్ని చెప్పకనే వెల్లడించాయి. మొట్టమొదటిసారిగా బీసీలకు తెలంగాణలో అధికంగా సీట్లు కేటాయించడమే కాకుండా, ఏకంగా బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించి బీజేపీ ఎన్నికల సమర శంఖాన్ని పూరించిది. రెడ్ల పార్టీగా పేరొంది, బీసీ నాయకులను మరచిపోయి పప్పులో కాలేసిన కాంగ్రెస్ ఇప్పుడు మేనిఫెస్టోలో ఆ తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది.

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట కొంతమేరకు ప్రయత్నించినా, బీసీల చిరకాలవాంఛ అయిన రాజకీయాధికారాన్ని అందిస్తామనే ఒక గట్టి భరోసా మటుకు కల్పించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. దానితో పాటు, ప్రతి లోక్‍సభ పరిధిలో రెండు ఎమ్మెల్యే సీట్లు బీసీలకు కేటాయిస్తామని ప్రకటించిన ఆ పార్టీ ఆ వాగ్దానాన్ని ప్రకటనలకే పరిమితం చేసింది. మరోపక్క బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నాయకుడే సీఎం అవుతాడంటూ బీజేపీ జాతీయ నాయకత్వం పదే పదే నొక్కివక్కాణిస్తూ బీసీల ఆకాంక్షను తీర్చేది తామే అంటూ ప్రచారం చేసి ముందుకెళ్తోంది. కులానికో కార్పొరేషన్ ఏర్పాటు అని చెప్పే కాంగ్రెస్ మాటలన్నీ మభ్యపెట్టేవే! వృత్తి విద్య, శిక్షణా తరగతులు, కుల వృత్తుల వారికి బీమా, ఎక్స్‌గ్రేషియా లాంటి పథకాలన్నీ పాత చింతకాయ మాటలే. విదేశీ, గల్ఫ్ తెలుగు నివాసితుల కోసం బీజేపీ ప్రత్యేక పథకాలు ప్రకటించగా సింగరేణి ఉద్యోగుల కోసం మేమున్నామంటూ కాంగ్రెస్ గాలం వేసింది. ఈ రెంటికి మేమేమీ తక్కువ కాదన్నట్లు బీఎస్పీ సైతం బీసీ అభ్యర్థులకు అధికంగా టికెట్లు ఇచ్చి ముందుకెళ్తున్నారు.

కాంగ్రెస్ ప్రకటించిన ఇందిరమ్మ ఇల్లు, గృహలక్ష్మి, రైతు హామీలాంటి వాటితో కూడిన ‘ఆరు గ్యారంటీ’ల కార్డులో ప్రజలకు ఉపయోగపడే పథకాలు కొత్తగా ఏమీ కనిపించలేదు. ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానత్వం కోసమంటూ గత కొన్నేళ్లుగా బీసీలు చేస్తున్న పోరాటాన్ని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. ఎమ్మెల్యేలను కొంటూ అడ్డంగా దొరికిన అవినీతి సామ్రాట్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వాన్ని వహిస్తూ ఉండగా, కాంగ్రెస్ జెండా మీద గెలిచినా పార్టీని పట్టుకొని ఉంటారా అనే సందేహాన్ని కలిగించేవారే పార్టీ నిండా ఉన్నారు! ఇలాంటి పార్టీ అవినీతి రహిత పాలనను అందిస్తామని, జరిగిన అవినీతి కుంభకోణాల మీద విచారణ చేపడతామని మేనిఫెస్టో మొదటి పేజీలోనే పెట్టడం ఒక పెద్ద విడ్డూరం!

ఇక పార్టీల వారీగా కేటాయించిన సీట్లు చూస్తే, ఓపెన్ కేటగిరీ కింద ఉన్న 88 సీట్లల్లో బీజేపీ అత్యధికంగా 36 సీట్లను ఇవ్వగా, కాంగ్రెస్ 21, టీఆర్‌ఎస్ 24 సీట్లను ఇచ్చాయి. దీనికి తోడు, కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో బీసీ నాయకత్వాన్ని పక్కకు పెడుతూ, రెడ్డి–మాల ముఖాలను ముందుకు పెడుతున్నది. మరోపక్క బీజేపీ బీసీ నాయకులుగా ఈటెల, బండిలకు హెలికాప్టర్లు ఇచ్చి మరీ ప్రజల ముందుకు పంపిస్తోంది. ఇక బీఆర్‌ఎస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అక్కడంతా కుటుంబ పెత్తనం, కుల రాజకీయం, ఉచిత హామీలే తప్ప మరోటి లేవు.

ఈ పరిస్థితులనన్నీ గమనించి బహుజన వర్గాల ప్రజలు బాధ్యత గల భారతదేశ పౌరులుగా తమకు మంచి చేసే పార్టీని, దాని అభ్యర్థులను గెలిపించుకోవాలి. అంబేడ్కర్ ప్రసాదించిన ఓటు హక్కును సరైన విధంగా వినియోగించుకోవాలి.

డాక్టర్ కిరణ్ దాసరి

బ్యాక్‌వార్డ్ క్లాసెస్ చాంబర్స్ అఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (బిక్కి)

Updated Date - 2023-11-29T02:16:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising